హెచ1బీపై కోర్టు తీర్పును తప్పుబట్టిన ట్రంప్
వాషింగ్టన్: ‘ఈ జడ్జీలు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వారు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. వారు దేశాన్ని బాగా బాధపెడుతున్నారు’ అని మంగళవారం రాత్రి న్యూయార్క్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. హెచ1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయించడాన్ని ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్ప్పుబట్టారు. ఇటువంటి నిర్ణయాలు దేశాన్ని బాధపెడతాయని స్పష్టం చేశారు. మరోవైపు కోర్టు తీర్పును కొంత మంది అమెరికా చట్టసభ సభ్యులతోపాటు భారతీయ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు. హెచ1బీకి ట్రంప్ గత సెప్టెంబరులో తీసుకొచ్చిన లక్ష డాలర్ల ఫీజును చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ సోమవారం బోస్టన్లోని ఫెడరల్ కోర్టు జడ్జి సొరొకిన్ తీర్పు చెప్పారు. దీనిపై పలువర్గాల నుంచి స్పందనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఫెడరల్ జడ్జి తీర్పును అప్పిలేట్ కోర్టులో సవాలు చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ‘దశాబ్దాలుగా హెచ1బీ కార్యక్రమం తీవ్రంగా దుర్వినియోగమవుతోంది. దానిని సరిచేయడానికి అధ్యక్షుడు ట్రంప్ చర్యలు చేపట్టారు. ఇలాంటి ఆదేశాలనే వాషింగ్టన్లోని ఫెడరల్ జడ్జి ఒకరు సమర్థించారు. దీని విషయంలోనూ సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’ అని అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు.
కాగా బోస్టన్ కోర్టు తీర్పును అమెరికా చట్టసభ సభ్యులు స్వాగతించారు. వారిలో కొందరు అధికార రిపబ్లికన్లూ ఉన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు, టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, అటువంటి ప్రాంతాలకు ఈ తీర్పు మేలు చేస్తుందని రిపబ్లికన్ సెనేటర్ లీసా ముర్కోవ్స్కీ అభిప్రాయపడ్డారు. హెచ1బీ వీసా ఫీజును చట్టవిరుద్ధంగా ప్రకటించిన బోస్టన్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ చీఫ్ ఖండేరావ్ కంద్ తెలిపారు.
జడ్జీలు మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు
- Advertisement -
RELATED ARTICLES


