Tuesday, July 15, 2025
Homeమోదీ పాలనలో ఆర్థిక విచ్ఛిన్నత

మోదీ పాలనలో ఆర్థిక విచ్ఛిన్నత

హామీల అమలులో కాంగ్రెస్‌ చరిత్ర: ఖడ్గే

విశాలాంధ్ర – హైదరాబాద్‌: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే ఘాటుగా విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్‌కు మోదీ చేసింది శూన్యమని, దేశ ఆర్థిక స్థితిని మోదీ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, మరి మోదీ ఎందుకు యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారు అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేయగానే యుద్ధం ఆపేశారు కానీ ఆ విషయంపై ప్రధాని నోరు విప్పరన్నారు. గతంలో అమెరికా బెదిరించినా ఇందిరాగాంధీ భయపడలేదని గుర్తు చేశారు. దేశం కోసం ఇందిర, రాజీవ్‌గాంధీ ప్రాణాలు అర్పించారు… బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఒక్కరైనా ప్రాణాలు అర్పించారా అని నిలదీశారు. 42 దేశాలు తిరిగిన మోదీ… మణిపూర్‌ వెళ్లడానికి ఎందుకు ఇష్టపడడం లేదని అన్నారు. మణిపూర్‌ భారత దేశంలో భాగం కాదా… మణిపూర్‌ ప్రజలు భారతీయులు కాదా మోదీజీ… ముందు దేశ ప్రజల బాధలు వినండి… ఆ తర్వాత విదేశాల సంగతి చూడొచ్చని సలహా ఇచ్చారు.
తెలంగాణలో హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోతుందని ఖడ్గే అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కార్యకర్తలేనని అన్నారు.
రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క… ఇలా అందరూ కలిసికట్టుగా బీఆర్‌ఎస్‌ను ఓడిరచారని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్నబియ్యం, రైతు భరోసా …ఇలా ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేరుస్తోంది. గిగ్‌ వర్కర్ల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తోందన్నారు. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని టీపీసీసీకి సూచించారు. ఇష్టానుసారం మాట్లాడొద్దని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలని నేతలకు సూచించారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్‌ మోసం చేశారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు