Homeసాహిత్యంమౌనానికీ భాష ఉన్నదని గుర్తుచేసే నవల

మౌనానికీ భాష ఉన్నదని గుర్తుచేసే నవల

- Advertisement -

సృజన వావిలపల్లి రచించిన ‘ఆనందమాయే సఖి’ నవల మైథిలి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతుంది. ఆమె చుట్టూ ఉన్న అన్నయ, నేత్రలతో ఏర్పడే స్నేహ సంబంధాలు, వాటి మధ్య చోటు చేసుకునే మాటలు- మౌనాలే ఈ కథకు ఆధారం. ఇది స్పష్టమైన ఆరంభం-ముగింపు ఉన్న సంఘటనల కథ కాదు. జీవితం అనుభవంగా ఎలా రూపుదిద్దుకుంటుందో అలా ప్రవహించే కథ.స్త్రీ తనను తాను అర్థం చేసుకునే ప్రయాణమే ఈ నవల ప్రధాన కథాంశం.
ఈ కథను రచయిత నాటకీయ మలుపులతో కాకుండా, సంభాషణల సహజ ప్రవాహంతో నిర్మించారు. మైథిలి-అన్నయ-నేత్రల మధ్య జరిగే మాటలే కథగా మారుతాయి. మాటలతో పాటు మాటల మధ్య మిగిలే నిశ్శబ్దం కూడా ఇక్కడ భావ్వయక్తీకరణలో భాగమవుతుంది.
మైథిలి పాత్ర నవలకి భావాత్మక కేంద్రం. ఆమె మాటలు తక్కువ, మౌనం ఎక్కువ. అన్నయ అడిగే ప్రశ్నలకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వదు. కానీ ఆ మౌనమే ఆమె జీవన దృక్కోణాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది లొంగుబాటు కాదు: అనుభవం నేర్పిన ఒక రకమైన అవగాహన. స్త్రీ బలం ఎప్పుడూ ఘోషగా ఉండనక్కర్లేదన్న భావాన్ని ఈ పాత్ర మృదువుగా ప్రతిపాదిస్తుంది.
అన్నయ సంభాషణలు ప్రశ్నలుగా నిలుస్తాయి. ‘ఎందుకు?’ అనే ప్రశ్న ఆమె మాటల్లో ప్రత్యక్షంగా వినిపించకపోయినా, ప్రతి సంభాషణలో అంతర్లీనంగా ఉంటుంది. స్త్రీ తనభావాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు?తన జీవితాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఎందుకు? అనే సందేహాలు ఆమె మాటల ద్వారా పాఠకుడి ముందుకు వస్తాయి. అయితే ఈ పాత్రను రచయిత అతివాద పాత్రగా మలచరు: ఆమె మాటల్లో సందిగ్ధత, ఆత్మపరిశీలన సహజంగానే కనిపిస్తాయి.
నేత్ర పాత్ర ఈ రెండు ధ్రువాల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. ఆమె సంభాషణల్లో రాజీ ఉంది: కానీ ఆ రాజీ వెనుక ఉన్న అలసట కూడా స్పష్టమే. మైథిలితో మాట్లాడేటప్పుడు ఆమె మౌనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అన్నయతో మాట్లాడేటప్పుడు ప్రశ్నల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఈ ద్వంద్వ స్వభావమే నేత్ర పాత్రను సహజంగా నిలబెడుతుంది.
నవలలోని పురుష పాత్రలు కేంద్రంగా నిలబడవు. వారు సంఘటనలను నడిపించే శక్తులుగా కాక, స్త్రీల జీవితాలను ప్రభావితం చేసే నేపథ్య స్వరాలు గానే కనిపిస్తారు. సంబంధాల్లోని అపార్థాలు,ఆశలు, పరిమితులను అవి సూచిస్తాయి గానీ, కథను ఆక్రమించవు. ఈ పరిమిత హాజరే స్త్రీల అంతర్ముఖ ప్రపంచానికి నవలలో ఉన్న ప్రాధాన్యాన్ని మరింత స్పష్టం చేస్తుంది. రచనా శైలిలో సృజన వావిలపల్లి సరళమైన భాషను, సంక్షిప్త సంభాషణలను ఎంచుకున్నారు. ఉపదేశానికి పోకుండా, చిన్న మాటలతోనే లోతైన భావాన్ని వ్యక్తపరచడం ఆమె శైలిలో ముఖ్య లక్షణం. అవసరమైన చోట కథను క్షణకాలం ఆపి, పాత్రల అంతర్ముఖ స్థితిలోకి పాఠకుడిని తీసుకెళ్లగలగడం ఈ నవల ప్రత్యేకత. ‘ఆనంద మాయె సఖి’లో స్త్రీవాదం ప్రధానంగా రాదు.అది సంభాషణల సహజ ప్రవాహంలో అంతర్లీనంగా వ్యక్తమవుతుంది. మైథిలి మౌనం,అన్నయ ప్రశ్న, నేత్ర రాజీ- ఈ మూడూ కలిసి స్త్రీ అనుభవానికి ఒక సమగ్ర సాహిత్య రూపాన్ని ఇస్తాయి.
మొత్తంగా, ‘ఆనందమాయే సఖి’ శబ్దంచేసే నవల కాదు. మెల్లగా చదవాల్సిన, ఆలోచనకు ఆహ్వానం పలికే నవల. సమకాలీన తెలుగు నవలా సాహిత్యంలో ఒక సున్నితమైన, ఆత్మపరిశీలనాత్మక రచనగా ఇది తనస్థానాన్ని సంపాదించుకుంటుంది.
మర్రాపు వసుంధరాదేవి, 7901355395

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు