Homeవిశ్లేషణయువతరం కదిలింది

యువతరం కదిలింది

- Advertisement -

నాలుగు దశాబ్దాల క్రితం మాదాల రంగారావు సినిమా ఈ యువతరం కదిలింది. అప్పుడు యువతరం అలాగే ఉంది. అలాగే కదిలింది. అలాగే ఉద్యమించింది. ఉపాధి అందనంత దూరంలో ఉన్నప్పుడు… భవిష్యత్ అగమ్యగోచరంగా మారినప్పుడు… దిక్కులన్నీ మూసుకుపోయినప్పుడు… ఏకం కావడమే లక్ష్యంగా మారినప్పుడు… ఉద్యమమే ఊపిరిగా మారుతుంది. వాళ్లేం కోరారు. వాళ్లేం ఆశించారు. ఏలికలూ… మా భవిష్యత్‌ని కాలరాయకండి అని అర్థించారు. మా జీవితాలను చిదిమేయకండి అని ఆగ్రహించారు. బతుకులు జంతర్‌మంతర్ చేయకండి అంటూ ప్రార్థించారు. యువతరం నీట్‌గా బతకాలి తప్ప నీట్ గురించి ప్రశ్నించకూడదు అంటోంది ఏలిక. అలా ప్రశ్నిస్తే నీకు లాఠీలు సమాధానం చెబుతాయి. టియర్ గ్యాస్ నీ ముక్కుపుటాల్లోంచి నీ శరీరమంతా పాకి నిన్ను నిర్వీర్యుడ్‌ని చేస్తాయి అంటోంది కరకు ఖాకీ. దిల్లీ వీధులన్నీ యువరక్తంతో తడిశాయి. వారి వెనుక దుష్ట శక్తులున్నాయి… వారి మాటలు వినే యువత రోడ్డు మీదకు వచ్చారంటున్నాయి. అవును… నువ్వున్నది నిజం… నిజం. ఆ లక్షలాది యువత వెనుక ఆకాంక్షలున్నాయి. ఆశలున్నాయి. కలలున్నాయి. కన్నీళ్లున్నాయి. కలతలున్నాయి. వెతలున్నాయి. వెక్కిళ్లున్నాయి. పుట్ట పగలడం గురించి నువ్వు విన్నావంతే. పుట్ట పగిలితే ఎలా ఉంటోందో నీకు ఎరుకులోకి వచ్చింది. ఇప్పుడు పుట్టలోంచి వచ్చినవి బొద్దింకలే అనుకున్నావు. ఆ బొద్దింకల వెనుక దేశ పటమంత మద్దతు ఉంది. మతం మత్తు మందే దీనికి సమాధానం అనుకున్నావు. ఆ మతం ఇప్పుడు మానవత్వమైంది. ఆ మతం ఇప్పుడు ఆపన్న హస్తమైంది. అక్కున చేర్చుకునే అమ్మ అయ్యింది. సన్యసం తీసుకున్న ఆ పెద్దాయన యువతరానికి స్వాంతన అయ్యారు. అల్లా నాలుగు అరటి పళ్లుగా, మూడు వాటర్ బాటిళ్లుగా మారాడు. ఏసుక్రీస్తు శిలువను చీల్చుకుని సొమ్మసిల్లిన ఆ అమ్మాయికి విసనకర్ర అయ్యాడు. బుద్ధుడు బుద్ధిగా కూర్చునే రోజులు కావంటున్నాడు. రక్తం ముద్దలుగా మారిన వారికి శ్రీరాముడు సపర్యలు చేస్తున్నాడు. కుల మతాలు గీచుకున్న గీతలన్నీ ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా చెరిగిపోతున్నాయి. ఒక్క రాజీనామా… ఒక్కటంటే ఒక్కటే… అదేమీ శిక్ష కాదు. అదేమీ అవమానం కాదు. అదేమీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టడం కాదు. ఆనాడెప్పుడో తనకు దూరాతి దూరంగా జరిగిన రైలు ప్రమాదానికి తాను నైతిక బాధ్యత వహిస్తూ ఆనాటి రైల్వే మంత్రి లాల్బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. గుర్తుందా. మరచిపోవడానికి ఆ మంత్రిగారి రాజీనామా ఓ సంఘటన కాదు కదా..!
దశాబ్దాల క్రితం నాటి సంఘ టన ఇప్పటికీ ఈ దేశ నాయకత్వ బాధ్యతకు గుర్తింపు కదా..! నీకు మహానుభావుల్నీ గుర్తించుకోవడం… ప్రతి క్షణం స్మరించు కోవడం… వందలాది అడుగుల విగ్రహాలు నెలకొల్పడం అలవాటే కదా..! మరి లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలకు నిప్పులు పెట్టిన వారి చేత రాజీనామా చేయించాలని అడగడం నేరం కాదు కదా..! ప్రశ్నించకూడదనే ప్రజాస్వామ్యంలోనే నేను, నువ్వు, మీరు బతుకులు ఈడ్చాలని నువ్వు శాసించడం సమ్మతి కాదు కదా..! సామా జిక మాధ్యమాల సంగతి సరే… ప్రధాన మీడియా కూడా తెరచాటున దాగి ఉండడమే నేటి అసలు సిసలు ప్రజాస్వామ్యం. ఫోర్త ఎస్టేట్‌గా పిలుచుకునే మీడియాకి ఈ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల వేదన కానరాకపోవడం నికార్సైన దౌర్భాగ్యం. అధికారంతో మీడియా చెట్టాపట్టాలు వేసుకుని తిరగడమే దారుణాతి దారుణమైన స్థితి. కాగితం కన్నీరు పెట్టుకోవడానికి… ఠీవీగా తలెత్తుకొని తిరగాల్సిన ఎలక్ట్రానిక్ మీడియా తలదించుకుని భూమిలోకి చూపులు దింపు కోవాల్సి రావడం కంటే పెద్ద పాపం మరింకే ముంటుంది. ఇదిగో ఇలాంటి సమయంలోనే నేను జర్నలిస్టుని అని చెప్పుకుందుకు సిగ్గేస్తుంది. భయమేస్తుంది. జెండా అవనతం చేసినట్లుగా తల తనంత తానే దించుకుంటుంది. ఇందుకే మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు “పెట్టుబడికి… కట్టుకథకి/ పుట్టిన విష పుత్రికలు/ఈ పత్రికలు”. ఒక్క తెలుగు సినీ పరిశ్రమ తప్ప మిగిలిన తెర తారలంతా యువతరం కదýడాన్ని ఆహ్వానించారు. ఉద్యమంపై లాఠీ పడడాన్ని నిరసించారు. న్యాయమూర్తులకు సమయం లేదు కాని… న్యాయవాదులంతా ముక్త్ కంఠంతో “ యువరానర్… ఇది మంచిది కాదు. యువతరానికి మేం మద్దతిస్తున్నాం” అన్నారు. ఒకే ఇంట్లో కంచె వేసుకుని అటు ఇటు కూర్చుని వాదులాడుకోవడం కంటే కంచె తొలగింపే శ్రేయస్కరం కదా…! బారికేడ్ల సాయంతో బానిసత్వం నేర్పాలనుకోవడం అత్యాశే అవుతుంది. దిల్లీ వీధుల్లో ఉద్యమం అణిగింది అనుకుంటే పల్లె గల్లీలో చిన్న చిన్న మొలకలు బయలు దేరతాయి. మొలకలు పెరిగి వృక్షాలుగా మారతాయి. వృక్షాలు శాఖోపశాఖలై ఉద్యమాలుగా ఎదుగుతాయి.
సీనియర్ జర్నలిస్టు, 99120 19929

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు