నంబూరి శ్రీమన్నారాయణ
దేశవ్యాప్తంగా రాజ్యం అసలు ముసుగును తొలగించుకుంటోంది. రాజ్యాంగం, చట్టబద్ధత, సంక్షేమం అనే మాటలు కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యాయి. నిజ జీవితంలో రాజ్యం ఒక బలప్రయోగ సాధనంగా, ఒక నేరమయ యంత్రంగా మారిపోయింది. మణిపూర్‌లో ప్రజలను కాల్చడం దగ్గర నుంచి దిల్లీలో నిరసనకారులపై లాఠీచార్జ్ వరకు, కశ్మీర్‌లో ఇంటర్నెట్ బంద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ గ్రామాలను తగలబెట్టడం వరకు, రాజ్య హింస ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇది అప్పుడప్పుడు జరిగే అవాంతరం కాదు, ఇది రాజ్య నిర్మాణంలోని అంతర్గత లక్షణం. రాజ్యం అంటే సామాన్య ప్రజల భద్రత కోసం ఏర్పడిన సంస్థ అనే ఉదారవాద సిద్ధాంతం బోర్లా పడింది. వర్గ సమాజంలో బలవంతులు తమ ఆధిపత్యాన్ని, దోపిడీని కాపాడుకోవడానికి సృష్టించుకున్న ఆయుధమే రాజ్యం అనే హక్కుల భావన, విశ్లేషణ నేడు అక్షరాలా నిజమవుతోంది. కార్పొరేట్‌లకు భూములు ఇవ్వడానికి రైతులపై కాల్పులు, గనుల కోసం ఆదివాసీలను నిర్వాసితులను చేయడం, దళితులు, ముస్లింల పై టార్గెట్ చేసి దాడులు హత్యలు చేసే వారికి రాజ్యం అండగా నిలబడటం, వారి అండగా ఉండే రచయితలు, కళాకారులు, న్యాయ వాదులు, ప్రజా సంఘాలు మేధావులు పైన భీమా కోరేగావ్, ముంచింగి పుట్టు, గురజాల లాంటి కుట్ర కేసులు పెట్టడం ప్రజాస్వామ్యవాదుల ఇళ్లపై ఎన్‌ఐఏ చేత దాడులు చేయించడం, వారి పైన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కేసులు నమోదు చేయటం, విమర్శించిన జర్నలిస్ట్లు, యూట్యూబర్ల పైనా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా వర్తింపజేయడం, ప్రజల ప్రశ్నలకు సమాధానమివ్వలేక, పరిష్కారం చూపలేక ఏళ్ల తరబడి బెయిలు రాకుండా జైల్లోనే నిర్బంధించడం, అణచివేయడం పౌర సమాజాన్ని భయకంపితులను చేయడం – ఇవన్నీ రాజ్యం యొక్క వేర్వేరు కోణాలు. రాజ్యం ప్రజల కోసం కాదు, రాజ్యం కోసమే ప్రజలు అనే స్థితికి మనం చేరుకున్నాం. ఇది మన పౌర సమాజం ప్రమాదంలో ఉందని చెప్పటానికి నిదర్శనం. రాజ్య హింసకు అత్యంత ప్రమాదకరమైన రూపం చట్టాన్ని ఆయుధంగా మార్చడం. యూఏపీఏ, ఎన్‌ఎస్‌ఏ, పీఎస్‌ఏ, ఏఎఫ్‌ఎస్‌పీఏ వంటి క్రూరమైన చట్టాలు ఈరోజు నిరసన హక్కును ఉగ్రవాదంగా ముద్ర వేస్తున్నాయి. సీఆర్.నెం.188/2026 లో ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు ఇందుకు తాజా ఉదాహరణ. సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు, అధికారాన్ని విమర్శించినందుకు “ఉగ్రవాద సంస్థకు సహాయం” అనే సెక్షన్. అంటే ఆలోచననే నేరంగా మార్చే కుట్ర. ఇది ఆర్టికల్ 19(1)ఏ కింద వచ్చే భావ ప్రకటన స్వేచ్ఛపై నేరుగా దాడి చేయడం. రాజ్యం చట్టాన్ని రక్షించడం లేదు, చట్టంతోనే ప్రజలను వేటాడుతోంది. రెండవ ప్రమాదకర రూపం రాజ్యం ద్వేషాన్ని పంచడం. మతం, కులం, ప్రాంతం పేరుతో ప్రజలను విడగొట్టి, ఒక వర్గాన్ని మరొక వర్గంపైకి ఉసిగొల్పడం. పోలీసులు చూస్తూ ఉండగా జరిగే మూక హత్యలు, కోర్టులు మూగబోయే ద్వేషపూరిత ప్రసంగాలు, మీడియాలో 24 గంటల విష ప్రచారం – ఇవన్నీ రాజ్య హింసకు పరోక్ష ఆయుధాలు. రాజ్యం నేరుగా కొట్టకుండా, ప్రజలతోనే ప్రజలను కొట్టిస్తోంది. ఇది సంవిధాన విలువలకు, లౌకిక సూత్రాలకు వ్యతిరేకం. మూడవ రూపం ఆర్థిక హింస. నోట్ల రద్దు, జీఎస్‌టీ, కార్మిక చట్టాల రద్దు, రైతాంగ హక్కులను కాలరాయడం, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం. పేరుకు సంస్కరణలు కానీ ఫలితం కోట్ల మంది ప్రజల జీవనోపాధిని లాక్కోవడం. పేదవాడి కడుపు కొట్టడం ఒక రకమైన హింసే. ఆకలి, నిరుద్యోగం, అప్పులతో చావడం అనేది బుల్లెట్‌తో చావడం కంటే నెమ్మదైన హత్య. రాజ్యం సంపదను కొందరి చేతుల్లోకి కేంద్రీకరిస్తూ, మిగిలిన వారిని అసురక్షితంగా మారుస్తోంది. ఇది ఆర్టికల్ 21 కింద వచ్చే “జీవించే హక్కు” ను ఉల్లంఘించడమే. నాల్గవది నిర్బంధం. జైళ్లు నిండిపోతున్నాయి కానీ విచారణలు జరగడం లేదు.
బెయిల్ అనేది నిబంధన కాకుండా మినహాయింపు అయిపోయింది. జైలులోనే చావులు, పోలీస్ కస్టడీలో హింస, ఎన్‌కౌంటర్ల పేరుతో విచారణ లేని ఉరిశిక్షలు. “నిర్దోషి అని రుజువయ్యే వరకు నేరస్తుడు కాదు” అనే చట్ట సూత్రం తలకిందులైంది. “నేరస్తుడు అని అనుమానం వస్తేనే శిక్షించాలి” అనేది కొత్త సూత్రం. ఈ హింసకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను నొక్కేయడమే రాజ్యం ప్రధాన లక్ష్యం. జర్నలిస్టులపై కేసులు, విద్యార్థి నాయకులపై దేశద్రోహం, పౌర, మానవ హక్కుల కార్యకర్తలపై, కవులు, రచయితలు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు మేధావులు పై ఉపా “భయపడితే గొంతు మూసుకుంటారు” అనే లెక్క. కానీ రాజ్యం మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. గొంతును చంపలేరు, ఆలోచనను చంపలేరు. ప్రతి అణచివేత ఒక కొత్త పోరాటానికి బీజం వేస్తుంది. మన రాజ్యాంగం ఒక వాగ్దానం. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం. కానీ రాజ్యం ఆ వాగ్దానాన్ని రోజూ ఉల్లంఘిస్తోంది. ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 19 స్వేచ్ఛను, ఆర్టికల్ 21 జీవించే హక్కును కాగితాలకే పరిమితం చేసింది. రాజ్యాంగం ఉన్నా రాజ్యం రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తోంది. అంటే సమస్య రాజ్యాంగం లో లేదు, రాజ్యాంగాన్ని అమలు చేసే వారిలో ఉంది. కాబట్టి మన పోరాటం చట్టాల కోసం కాదు, చట్టాల అమలు కోసం. చట్టబద్ధ పాలన కోసం ఉపా రద్దు కోసం, ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్తివేత కోసం, నిరసన హక్కు పునరుద్ధరణ కోసం. ప్రతి అక్రమ అరెస్టును, ప్రతి ఎన్‌కౌంటర్‌ను, ప్రతి కస్టడీ మరణాన్ని ప్రశ్నించాలి. కోర్టుల చుట్టూ, రోడ్లపై, సోషల్ మీడియాలో నిరంతర పోరాటం చేయాలి. ఎందుకంటే న్యాయం అడిగితే ఇవ్వడం లేదు, అడిగితే చట్టబద్ధ పాలన అమలు చేయడం లేదు. దాన్ని పోరాడి సాధించుకోవాలి. మన లక్ష్యం ఈ రాజ్యాన్ని మార్చడం కాదు. మన లక్ష్యం హింస లేని సమాజం. గాంధీ కలలు కన్న, మార్క్స్ ఊహించిన రాజ్యరహిత సమాజం. అక్కడ మనుషులు జ్ఞానవంతులుగా, సహజీవనంతో బతికే సమాజం. అది యుటోపియా కాదు. ఎందుకంటే ప్రతి విప్లవం ఒక యుటోపియాతోనే మొదలవుతుంది. ఈ పోరాటంలో పౌరహక్కుల సంఘం సీఎల్‌సీ పాత్ర కీలకం. మేము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. మేము రాజ్యాంగానికి, పౌర హక్కులకు, మానవ హక్కులకు కట్టుబడి ఉన్నాం. ఎవరు దాడికి గురైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ జాతివాడైనా , కుల, మత, భాష, లింగ, జాతి, ప్రాంత భేదాలు లేకుండా మేము వారి పక్షాన నిలబడతాం. ఎందుకంటే మానవ హక్కులు సార్వత్రికం, విభజించ లేనివి. సామాజిక వ్యవస్థ సోషలిస్టు, కమ్యూనిస్ట్ సమాజం దశకు చేరుకున్న తర్వాత కూడా పౌర హక్కుల కోసం పౌరులు జీవించే హక్కుల కోసం “పౌర హక్కుల సంఘం” పోరాడుతుంది. చరిత్ర మనల్ని గమనిస్తోంది. మనం మౌనంగా ఉంటే రేపు మన ఇంటి తలుపు తడుతుంది. ఈరోజు ప్రశ్న రావణ్, రేపు మీరు, ఎల్లుండి నేను. కాబట్టి ఇప్పుడే లేవాలి. రాజ్య హింసను పేరుతో పిలవాలి. దానికి వ్యతిరేకంగా స్వరం కలపాలి. గుర్తుంచుకోండి, రాజ్యం బలమైనది కాదు. ప్రజల ఐక్యతే బలం. లాఠీలు విరగవచ్చు, జైళ్లు నిండ వచ్చు, కానీ ఆశను చంపలేరు. ప్రతి బలప్రయోగం ఒక కొత్త ప్రతిఘటనకు జన్మనిస్తుంది. రాజ్యం లేకుండా సమాజం నడవదని ఎవరైతే చెబుతారో వారిని అడగండి…రాజ్యం ఉన్న ఈ 75సంవత్సరాల్లో భారత సమాజం ఎంత సురక్షితంగా ఉంది ? జవాబు మీ ముందే ఉంది. ఎటు చూసినా హింస, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి అక్రమాలు కుంభకోణాలు నిర్బంధం అణచివేత, అక్రమ అరెస్టులు, జైళ్లు , చిత్రహింసలు ఎన్‌కౌంటర్లు, జైల్లో మరణాలు. కాబట్టి హింసారహిత సమాజ స్థాపన కోసం, మానవ గౌరవం కోసం, రాజ్యాంగ విలువల కోసం మనం రాజ్యహింసకు వ్యతి రేకంగా నిలబడి పోరాడాల్సిం< లేకుంటే మనం బతికినా చచ్చిన శవాలమే.
అడ్వకేట్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పౌరహక్కుల నేత.
సెల్ : 9493861875


