Friday, December 5, 2025
Homeవ్యాపారంరాహుల్‌ పేల్చిన బాంబు

రాహుల్‌ పేల్చిన బాంబు

- Advertisement -

గురువారం నాటి రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలను పరిశీలించిన వారికెవరికైనా జరుగుతు న్నది ఓట్ల దొంగతనం కాదు… బందిపోటు అని అర్థం అవుతుంది. ఆ అంశాలన్నీ నిజమైతే దేశ ప్రజాస్వామ్యం గాలిలో కలిసిపోయినట్టే. ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలు. కానీ ఆ ఎన్నికల ద్వారానే ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సకల ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. ఇన్ని అక్రమాలకు పాల్పడ్డ ఎన్నికల కమిషన్‌ అధికారుల, సిబ్బంది వెనక అసలు హస్తం ఎవరిదన్నది తేలాల్సిందే. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలను ఎద్దేవా చేయడం సులభమే. అప్పుడే బీజేపీ నాయకులు ఈ పనిలో నిమగ్నమైపోయారు. ఎన్నికల జాబితా ఎలక్ట్రానిక్‌ ప్రతి అందించాలని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారు. కానీ ఓటర్ల జాబితా ఎలక్ట్రానిక్‌ ప్రతి అందుబాటులోకి వస్తే తప్ప ఎంత ఘోరం జరిగిపోతోందో జనానికి అర్థం కాదు. ప్రతి పౌరుడికి ఒక ఓటు అన్నది ఉదాత్తమైన సూత్రం. ఈ సూత్రం రీత్యానే ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి తీసుకురాకపోతే ఏదో మాయ జరుగుతోందన్న విషయం రూఢ అయిపోతుంది. ముందే చెప్పినట్టు రాహుల్‌ గాంధీ ‘‘ఆటం బాంబు’’ ప్రయోగిం చారు. ఆయన వెల్లడిరచిన వివరాలను పరిశీలిస్తే ఇంత అఘాయిత్యం ఎలా చేయగలిగారని ఆశ్చర్యపోక తప్పదు. మీడియా సమావేశంలో రాహుల్‌ గాంధీ తాను చేసిన ప్రతి ఆరోపణకు రుజువులు చూపించారు. కర్నాటక ఎన్నికలలో మోసం ఎలా జరిగిందో తెలియజేయడానికి ఆయన మహదేవ్‌పుర నియోజకవర్గంలో జరిగిన వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఓటర్ల జాబితాలో 40,009 బూటకపు చిరునామాలు ఉన్నాయని రాహుల్‌ రుజువులతో సహా నిరూపించారు. ఎన్నికల కమిషన్‌ అందజేసిన సమాచారం సుల భంగా చదవడానికి, విశ్లేషించడానికి అనువుగా లేదు. అందుకే రాహుల్‌ గాంధీ ఎలక్ట్రానిక్‌ రూపంలో సమాచారం అందించాలని పట్టుబడుతు న్నారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన దస్త్రాలను నిలువుగా నిలబెడ్తే ఏడు అడుగుల ఎత్తు ఉంది. కనీసం రెండు మూడు వందల కిలోల బరువు ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అవకతవకలను కనిపెట్టడం అంత సులభం కాదు. ఓటర్ల ఫొటోలను, చిరునామాలను పోల్చి చూడడం అంత సులభం కాదు. ఈ సమాచారమే ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటే విశ్లేషణ సులభం అవుతుంది. కొంత సమయమూ తగ్గుతుంది. కానీ ఎన్నికల కమిషన్‌ ఈ పని చేయ డానికి సిద్ధంగా లేదు. ఇంత క్లిష్టరూపంలో అందిన సమాచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తల చేత వీలైనంత మేరకు పోల్చి చూసి లొసుగులను బయట పెట్టగలిగారు. ఎన్నికల కమిషన్‌ చేసిన పనిలో ఏ మోసమూ లేకపోతే ‘‘డిజిటల్‌ ఇండియా’’ లో ఎలక్ట్రానిక్‌ రూపంలో సమాచారం అడ్డంకి ఏమిటో అంతుపట్టదు. ఈ ప్రశ్న అడగాల్సింది ఒక్క రాహుల్‌ గాంధీనే కాదు. ప్రతి పౌరుడు అడగవలసిన ప్రశ్న ఇది. కర్నాటకలోని ఒక శాసనసభ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అవకతవకలను కనిపెట్టడానికి దాదాపు 40 మంది ఆరు నెలల పాటు శ్రమ పడవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని వీలైనంత జటిలం చేయడానికే ఎన్నికల కమిషన్‌ దస్త్రాల దొంతరలను అందజేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 240 సీట్లతో బయట పడిరది. మరో 25 సీట్లు బీజేపీకి తక్కువ వచ్చి ఉంటే మోదీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే వచ్చి ఉండేది కాదు. ఎలక్ట్రానిక్‌ రూపంలో ఎన్నికల కమిషన్‌ సమాచారం అందించి ఉంటే ఇన్ని దస్త్రాలు పరిశీలిం చడానికి 40 మంది ఆరు నెలలు కష్టపడవలసిన అవసరమే ఉండేది కాదు.
రాహుల్‌ గాంధీ బయటపెట్టిన లొసుగులన్నీ ఎన్నికల కమిషన్‌ అందించిన సమాచారాన్ని విశ్లేషించి సమకూర్చినవే తప్ప ఆయన కల్పన కాదు. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు, పోలింగ్‌ పూర్తి అయిన తరవాత జరిగిన సర్వేల ఫలితాలకు, అంతిమంగా వెలువడిన ఫలితాలకు పొంతనే లేకుండా పోయింది. బీజేపీ ఓడిపోతుందనుకున్న రాష్ట్రాలలో సునాయాసంగా గెలవగలిగింది. ఎన్నికల కమిషన్‌ చేత అక్రమాలు, అవకతవకలు చేయించి ఉండకపోతే ఈ ఫలితాలు తారుమారయ్యేవని చెప్పడానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. ఈ అక్రమాల ఆధారంగానే కొన్నిచోట్ల బీజేపీ అనూహ్యమైన మెజారిటీ సంపాదించ గలిగింది. పోలింగ్‌ తేదీలను నిర్ణయించడంలో కూడా ఎన్నికల కమిషన్‌ ఈ మధ్య ఎన్ని మతలబులు చేస్తోందో చూస్తే కళ్లు తేలేయాల్సిందే. మామూలు బ్యాలెట్‌ పత్రాలను వినియోగించి పోలింగ్‌ జరిగే రోజుల్లో కూడా దేశమంతటా ఒకే రోజు పోలింగ్‌ పూర్తి అయ్యేది. ఇప్పుడు పోలింగ్‌ జరిపించడానికి ఈవీఎంలు ఉన్నాయి. అయినా ఒక్కో రాష్ట్రంలో ఆరేడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించవలసిన అగత్యం ఏమిటో అంతుపట్టదు. మహదేవ్‌పురా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి రెట్టింపు ఓట్లు రావడంలో ఆంతర్యం రాహుల్‌ చెప్పిన అంశాల ఆధారంగా చూస్తే సునాయాసంగానే అర్థం అవుతుంది. ఒక్క మహదేవ్‌పురాలో బీజేపీ దాదాపు లక్షా పాతిక వేల ఓట్లు కాంగ్రెస్‌ కన్నా అధికంగా సంపాదించినందువల్ల మొత్తం లోకసభ పరిధిలో కాంగ్రెస్‌ సాధించిన ఓట్లకన్నా బీజేపీకి సమకూరిన ఓట్లు అంత ఎక్కువ కాకపోయినప్పటికీ విజయం బీజేపీనే వరించింది. ఎన్నికల కమిషన్‌ చేస్తున్న మాయ అయిదు రకాలుగా ఉంటుందని రాహుల్‌ చెప్పారు. ఒకటి: డూప్లికేట్‌ ఓటర్లు. రెండు: బూటకపు చిరునామాలు. మూడు, ఒకే చిరునామాలో అనూహ్యమైన సంఖ్యలో ఓటర్లు ఉండడం. నాలుగు: నకిలీ ఫొటోలు. అయిదు: ఫారం 6 ను దుర్వినియోగం చేయడం. డూప్లికేట్‌ ఓటర్లు భిన్న నియోజక వర్గాల్లో ఉన్నారు. విభిన్న రాష్ట్రాలలోనూ ఉన్నారు. ఒక్క మహదేవ్‌పురా శాసనసభా నియోజకవర్గంలో 11,000 డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారు. ఈ డూప్లికేట్‌ ఓటర్లు వివిధ నియోజక వర్గాలలో, రాష్ట్రాలలోనూ ఓటు వేశారని రాహుల్‌ గాంధీ నిరూపిం చారు. ఇంత దగా చూసిన తరవాత ఎన్నికల కమిషన్‌ సొంతంగా ఈ ఘాతుకానికి పాల్పడిరదని అనుకోలేం. ఎన్నికల కమిషన్‌ మెడలు వంచి ఈ మోసాలు చేయించడం వల్ల లబ్ధి పొందింది ఎవరో గమనిస్తే అసలు విషయం బయటపడి పోతుంది. ఎన్నికల కమిషన్‌ రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను విచిత్రమైన పద్ధతిలో సవాలు చేసింది. రాహుల్‌ గాంధీ ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాలని అడిగే సాహసానికి ఒడిగట్టింది. ఇంకా విచిత్రం ఏమిటంటే బీజేపీ నాయకుడు రవి శంకర్‌ ప్రసాద్‌ ఎన్నికల కమిషన్‌ను వెనకేసుకు రావడం. ఈ లంకెలన్నీ చూస్తే ఎన్నికల కమిషన్‌ కేవలం దిష్టిబొమ్మ స్థాయిలోనైనా మిగలలేదనిపిస్తోంది. రాహుల్‌ చెప్పాల్సింది చెప్పారు. పరిస్థితిని సరిదిద్దవలసిన బాధ్యత ఈ దేశ పౌరులకూ ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు