Thursday, December 11, 2025
Homeరైతులకు తక్షణ పరిహారం

రైతులకు తక్షణ పరిహారం

- Advertisement -

. వరికి రూ.30 వేలు… వాణిజ్య పంటలకు రూ.50 వేలు
. ప్రభుత్వానికి ఈశ్వరయ్య విజ్ఞప్తి
. నందిగామ ప్రాంతంలో పాడైన పంటలు పరిశీలించిన సీపీఐ బృందం

విశాలాంధ్ర – విజయవాడ (నందిగామ): రాష్ట్రంపై విరుచుకుపడిన మొంథా తుపానుతో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, స్థానిక నాయకులతో కలిసి నందిగామ పరిసర ప్రాంతాల్లో వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న వరి, పత్తి పంటలను ఈశ్వరయ్య శుక్రవారం పరిశీలించారు. నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ వాణిజ్య పంటకు ఎకరాకు రూ.50 వేలు, వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పండిరచిన పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుపాను రూపంలో తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో కంటితుడుపు చర్యలతో కాకుండా పూర్తిస్థాయిలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేకపోతే వ్యవసాయ రంగం అంతరించిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మొంథా తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఎకరాకు రూ.40 వేల నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టగా…పంట మొత్తం సర్వనాశనమైందని తెలిపారు. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. రంగు మారిన పత్తిని నిబంధనలు సడలించి సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, తేమశాతం ఎక్కువగా ఉన్న పత్తినీ కొనుగోలు చేయాలని కోరారు. క్వింటా పత్తి రూ.8110కి కొనుగోలు చేయాల్సి ఉండగా… ఇప్పటికే దళారులు సిండికేట్‌గా మారి రూ.5 వేల నుండి రూ.6 వేలకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని, అధికారులు మాత్రం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని అన్నారు. నిబంధనలను సడలించి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. సొంత భూమి సాగు చేసే వారు తీవ్రంగా నష్టపోతుంటే కౌలుకు తీసుకొని భూమి సాగు చేసేవారు ఇంకెంత నష్టపోతారో ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. రైతులకు సీపీఐ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, రైతులకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుట్టి రాయప్ప, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవింద రాజులు, చేతివృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు తాడి పైడియ్య, ఏఐటీయూసీ నాయకులు కొట్టు రమణారావు, పార్టీ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి, షేక్‌ గులామ్మహ్మద్‌, లంకె సాయి, మన్నె హనుమంతరావు, వాసిరెడ్డి నవీన్‌, మౌలాలి, నాగు పాల్గొన్నారు.
ఈశ్వరయ్యకు ఘన సన్మానం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై మొట్టమొదటిసారి నందిగామ విచ్చేసిన గుజ్జుల ఈశ్వరయ్యను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు నేతృత్వంలో సీపీఐ బృందం సన్మానించింది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షులు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు