Homeరైల్వే జోన్కల సాకారం

రైల్వే జోన్కల సాకారం

- Advertisement -

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు
గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
జాన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభం
మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారమైంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు దశాబ్ద్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితి పోరాట ఫలితంగా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజిట్‌లో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్‌లో కేంద్రం పేర్కొంది. రాయగఢ్ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్‌లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వులతో రాయగఢ్ డివిజన్‌లో ఇంతకుముందున్న పలాస-ఇచ్ఛాపురం రైల్వేలైన్, ఇచ్ఛాపురం – దువ్వాడ-విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్‌లో చేరాయి. అదే విధంగా నౌపడా- పర్లాకిమిడి- బొబ్బిలి – సాలూరు లైన్లు, సింహాచలం- వడ్లపూడి- విశాఖ జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేశారు. కోరాపుట్-కిరండోల్ లైన్‌లను విశాఖ, రాయగఢ్ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు. నగరంలోని ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతానికి వీఎంఆర్డీఏ డెక్‌లోని రెండు అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమోదం తెలిపి… అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ జోన్ కార్యకలాపాలకు ముఖ్యమైన అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారులను నియమించారు. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3 వేల మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తికనబరిచారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం కాగా, జోన్ అంతటా 17 వేల మంది వరకు నియమితులు కానున్నారు. రైల్వే జోన్ గెజిట్ విడుదల నేపథ్యంలో విశాఖలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నాయి.
రైల్వేజోన్ ఏర్పాటు హర్షణీయం: చంద్రబాబు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్ఛాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగఢ్ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎక్స్ వేదికగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు