Homeవిశ్లేషణలేటు ఎవరికి చేటు

లేటు ఎవరికి చేటు

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

అంతదూరం నించే మాంసం షాప్ మూసేసి ఉండడం చూసింది డాగీ. ఈ రోజు మనకు ‘ఫాస్టింగో’ ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగో’ తప్పేట్టు లేదు అనుకుంటూ వెళ్లింది. షాపు ముందు ఎలెక్రిట్క్ స్తంభం కింద దొరికిన ఓ ఎముకను మళ్లీమళ్లీ నవుల్తున్న ఎర్రమచ్చల తెల్లకుక్క డాగీని చూడగానే హలో బ్రదర్! యమూ ఆర్ లేట్Y! అయిదు నిమిషాలయిందో లేదో ఇప్పుడే షాప్ క్లోజ్ చేసి పోయేడు మన మాంసదాత అంటూ పళ్లికిలించింది. వీడికేమయిందివ్వాళ నేను లేటా? వాడు అర్లీనా అని చిరాకుపడుతూ తనకు రెగ్యూలర్‌గా అన్నం పెట్టే ఓ అన్నపూర్ణమ్మ ఇంటి వైపు పరుగెత్తింది. అప్పటికే అరుగు మీద ఉన్న అన్నాన్ని ఆవురావురంటూ తింటున్నది. ఈసారి తెల్లమచ్చల ఎర్ర కుక్క, డాగీని చూడగానే హలో బ్రదర్! యమూ ఆర్ లేట్! జస్ట్ ఒకే ఒక నిమిషం ఆలస్యమయింది. ఇవ్వాళటి చద్దన్నం మెతుకుల మీద నా పేరు అదే తెల్లమచ్చల ఎర్ర కుక్క అని రాసి ఉన్నట్టుంది అంటూ ఇకిలించింది పళ్లు. ఓ మైగాడ్! ఇక్కడా లేట్ అయిపోయానా? ఒక్క ఐదు నిమిషాలు ఒక్క నిమిషం లేటయినందుకు ఫాస్టింగ్ తప్పదా! నారు పోసిన వాడు నీరు పొయ్యడా! అంటారు కదా సాయంత్రానికల్లా ఏమైనా దొరక్కపోదు, ఎందుకైనా మంచిదని ో{ల్ వెనక వైపునకు వెళ్లింది. అక్కడ చెత్తబుట్టను మున్సిపాలిటీ వ్యాన్ వాడు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాడు. దీనమ్మా జిందగీ! ఇక్కడా లేటు అయింది అని తనని తాను కొట్టుకోలేక తిట్టుకుంటూ మైదానంలో నుంచి కూలిన కొంప అరుగు ఎక్కింది డాగీ. అప్పటికే అరుగు మీద సెటిలయిన డాంకీ కళ్లు పెద్దవి చేసుకుని అరుగు మరో చివర వైపు చూస్తున్నది. తన జాగాలో కూచుంటూ ఎవరా అని చూసింది డాగీ. అరుగు చివర చేతిలో పరీక్ష రాసే ప్యాడ్ పట్టుకుని ఏడుస్తూ ఉన్నది ఓ అమ్మాయి.
ఏంటి డాంకీ ! ఎవరా అమ్మాయి! ఎందుకలా ఏడుస్తున్నది. ఏమైందో కనుక్కున్నావా? అంది డాగీ. ఏంటి కనుక్కునేది. మనుషులు గాడిదలవచ్చు కానీ గాడిదలు మనుషులు కాకూడదు కదా! నేను మనిషి భాషలో మాట్లాడితే ఆ అమ్మాయి కార్డియాక్ అరెస్ట్ అయ్యి చచ్చూరుకుంటుంది. పోక్సో కేసులో ఇరుక్కోమంటావా నన్ను అంది డాంకీ. ఆ అమ్మాయి నిన్ను చూసి భయపడకపోయినా అయిందానికీ కాని దానికీ ‘భవ్వు’మనే రాజకీయ నాయకుడిలాంటి నన్ను చూసి కూడా భయపడ్డం లేదు అంది డాగీ, తను ఉన్న ‘సిట్యుయేషన్ ’ అలాంటిదేమో. కాలేజీ అమ్మాయిలా ఉంది ఏం కష్టం వచ్చిందో పాపం ! మనమేం చెయ్యగలం చెప్పు. అనేకానేక సామాజిక సంస్థలు, పోలీసులు, నిత్యం ప్రజల కోసమే గాలి పీల్చే గల్లీ నుండి దిల్లీ దాకా ఉన్న నాయకులు, డొమెస్టిక్ వయలెన్స్‌ చట్టాలు / పోక్సోలు ఉన్నా, మానవ హక్కుల సంఘాలు, పత్రికలూ మీడియా వాళ్లు సాటి మనుషుల కష్టసుఖాలు పట్టించుకునే తీరికే లేకుండా ఉంటే నాలుగు కాళ్ల పశువులం మనమేం చెయ్యగలం చెప్పు అని డాంకీ అంటుండగానే అరుగు ఎక్కాడు అబ్బాయి. అరుగు చివర కూచుని ఏడుస్తున్న అమ్మాయి వైపు చూపిస్తూ డాగీ ఆ అమ్మాయి అప్పట్నించీ ఏడుస్తూ కూచుంది. ఎందుకు కన్నీరు ? ఏమి నీ కష్టాలు ? అని అడుగుదామంటే అమ్మాయి భయపడిపోతుందని మిన్నకున్నాం. నువ్వైనా కనుక్కోరాదు ! అంది డాగీ. అబ్బాయి అరుగు చివర వరకూ వెళ్లి అమ్మాయితో మాట్లాడాక అమ్మాయి కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటూ అరుగు దిగి వెళ్లిపోయింది. అరుగు మీద తాపీగా కూచుంటూ చెప్పాడు అబ్బాయి. ఆ అమ్మాయి ఏదో పరీక్ష రాయడానికి, ఎగ్జామ్ హాల్‌కి వెళ్తే ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఆలస్యం అయిందని పరీక్ష రాయడానికి వీల్లేదని వెనక్కి పంపేశారట్. ఒక్క నిమిషం ఆలస్యానికి ఒక్క సంవత్సరం లేదా, ఒక జీవితకాలం నష్టపోతుందేమోనని ఏడుస్తూ కూచుంది నాలుగు ఓదార్పు మాటలు చెప్పి పంపించేశా అని. నిజంగా ఎంత నష్టమో ! ఎంత కష్టమో అని నిట్టూర్చింది డాంకీ. ఐదు నిమషాలు, ఒక్క నిమిషం లేటయి ఈరోజు పస్తులుండాల్సి వచ్చింది అంది డాగీ. అవునూ నాకు తెలీక అడుగుతా ఎక్కడైనా అసాంఘిక శక్తులు రెచ్చిపోతే, జరగకూడనిది జరుగుతుంటే పోలీసులు లేటుగా రావచ్చు. కోర్టులు తీర్పులు ఇవ్వడానికి దశాబ్దాలు లేటు చేయవచ్చు. ఆస్పత్రిలో పేషెంటు చావుబతుకుల్లో ఉంటే డాక్టర్ లేటుగా రావచ్చు. రైళ్లు, బస్సులు విమానాలు లేటుగా నడవ్వచ్చు. సర్కారు వారు తాము ఇచ్చిన హామీలను లేటుగా అమలు చెయ్యవచ్చు లేదా మరో ఎన్నికలకు వాయిదా వెయ్యవచ్చు కానీ జీవితానికి అత్యంత ముఖ్యమైన పరీక్ష రాయడానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదా అంది డాంకీ. రాజ్యాలేలే వాళ్లకి ఏదైనా చెల్లుతుంది. ఎన్నికలప్పుడు ‘క్యూలో’ ఉన్నవారందరి చేతా ఓట్లు వేయించుకుంటారు. చట్టసభలకు సంక్షేమ కార్యక్రమాలకూ ‘లేట్’ గా హాజరవుతారు సంఘటనలకు వీలయినంత లేటుగా స్పందిస్తారు. పరీక్ష రాసేవాళ్లకి తప్ప ‘లేట్’ ఎవరికి లేటు అవదు అంటూ అరుగు దిగాడు అబ్బాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు