Wednesday, January 21, 2026
Homeవణికిన ఉత్తరాంధ్ర

వణికిన ఉత్తరాంధ్ర

- Advertisement -

వాయుగుండం ప్రభావంతో వర్ష బీభత్సం

. వంశధారకు భారీ వరద, మూడో ప్రమాద హెచ్చరిక జారీ
. నలుగురి మృతి… పంటలకు తీవ్ర నష్టం
. చెట్లు కూలి వాహన రాకపోకలకు అంతరాయం
. విద్యుత్‌ సరఫరా నిలిచి అంధకారంలో గ్రామాలు
. పంట నష్టం అంచనా వేయాలని సీఎం ఆదేశం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి చెందగా, వందలాది ఎకరాల్లో పంట భూములకు తీవ్ర నష్టం వాటిల్లింది.

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి/విశాఖపట్నం/శ్రీకాకుళం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి చెందగా, వందలాది ఎకరాల్లో పంట భూములకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒడిశాలో కుండపోత వర్షాలకు హిర మండలంలోని గొట్టా బ్యారేజీకి వరద ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా వరద రావడంతో అధికారులు బ్యారేజీకి ఉన్న అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వర్ష బీభత్సంతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు కూలి విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలి రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్ష బీభత్సానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విశాఖ నగరంలో రోడ్లపై కూలిన చెట్లను జీవీఎంసీ, ఈపీడీసీఎల్‌ అధికారులు తొలగిస్తున్నారు. విశాఖ నగరంలో అనేక చోట్ల కార్లపై చెట్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు తీవ్ర జలమయమయ్యాయి. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రా`ఒడిశా సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నదికి వరద తాకిడి భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 110 క్యూసెక్కుల వరద నీరు హిర మండలం గొట్టా బ్యారేజీకి చేరింది. ప్రధానంగా కొత్తూరు మండలంలోని పెనుగోటువాడ, మాతల, కడుము, హంస, పునుటూరు, మాకవరం, కుద్దిగమ్‌ గ్రామాల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్రతనయ నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ శివారు మహేంద్రనగర్‌ వీధిలోకి వరద నీరు చేరింది. పాతపట్నంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 600 ఎకరాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి పంటలు నీటి మునిగాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. పంట పొలాలు చెరువులను తలపించాయి. రహదారులకు గండ్లు పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఏజెన్సీ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భామిని మండలం కీసరలో 300 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. బూర్జ మండలంలో నారాయణపురం, చిన్నలంకాం పరిధిలో చాలా చోట్ల పంట పొలాలు ముంపులో ఉన్నాయి.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా : సీఎం
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజి, తోటపల్లి బ్యారేజీ పరిధిలో భారీ ఎత్తున వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఒడిశాలోని వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార నదికి 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా మురీడు జిల్లాల్లో నలుగురు మృతి చెందినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరద కారణంగా నీట మునిగిన పంటను కూడా లెక్కించి పంట నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. అదే సమయంలో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను రిజర్వాయర్లను నీటితో నింపాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు