కానూరి కృష్ణ, సీనియర్ జర్నలిస్టు
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు గుండెకాయ, బిలియనీర్లు, వాల్ స్ట్రీట్ ఆర్థిక అహంకారానికి చిరునామా అయిన న్యూయార్క్ నగర మేయర్‌గా 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ విజయం వెనుక దశాబ్దాల తరబడి న్యూయార్క్ నగర రాజకీయాలను మలచిన కమ్యూనిస్టులు, సోషలిస్టులు, పౌర హక్కుల ఉద్యమాల ప్రగతిశీల, రాడికల్ వారసత్వం ఉంది. న్యూయార్క్‌లోని కమ్యూనిస్టులు, సోషలిస్టులు చారిత్రక కార్మిక సంఘాలు, పౌర హక్కుల ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. మమ్దానీ రాజకీయ లక్ష్యం, న్యూయార్క్ నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రగతిశీల, రాడికల్ ఉద్యమాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే. బ్రూక్లిన్ డాక్స్‌లో కార్మికులు ‘‘యూనియన్ లేకుండా పని లేదు’’ అంటూ కార్మిక సంఘాల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తిని, బ్రాంక్స్‌లో అద్దెదారులు ‘రెంట్ స్ట్రైక్స్’ చేసి సరసమైన గృహ నిర్మాణం కోసం నిలబడిన చారిత్రక ధైర్యాన్ని, అలాగే హార్లమ్లో నల్లజాతీయ కవులు తమ కవితల ద్వారా జాతి సమానత్వాన్ని, స్వేచ్ఛను ఆకాంక్షించిన గొంతుకను ఆయన ప్రతిబింబిస్తున్నారు. శ్రమ జీవుల హక్కులు, జాతి సమానత్వం, సరసమైన గృహనిర్మాణం వంటి అంశాల కోసం ఈ ఉద్యమాలు సాధించిన ప్రగతిశీల విజయాలను ముందుకు తీసుకెళ్లాలనేదే మమ్దానీ ప్రధాన లక్ష్యం. వలసదారుల కష్టాలు, ఆర్థిక అన్యాయాలు, జాతి వివక్ష ఇవన్నీ ఆయన చిన్ననాటి జీవితంలోనే చూసిన వాస్తవాలు. అందుకే ఆయన రాజకీయాల లక్ష్యం అధికారంలోకి రావడం కాదు. అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం. ఆయన తన రాజకీయాన్ని డెమోక్రటిక్ సోషలిజం మీద నిర్మించారు.
మమ్దానీ ఎన్నికల ప్రచారం అమెరికా రాజకీయాల్లో అరుదైన ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో ‘ధనబలం’పై ‘ప్రజాశక్తి’ విజయాన్ని జోహ్రాన్ ఎన్నికల ప్రచారం అద్భుతంగా నిరూపించింది. ఈ గెలుపు కేవలం వ్యక్తిగతం కాదు. ఇది ‘డెమోక్రాటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా’ (డీఎస్ఏ) వెన్నెముకగా నిలిచిన వ్యవస్థీకృత ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితం. మమ్దానీ తన ప్రచారానికి కార్పొరేట్ నిధులను తిరస్కరించారు. ప్రతి డాలర్‌ను సాధారణ ప్రజల విరాళాల ద్వారా సేకరించారు. అద్దెదారులు, విద్యార్థులు, వలస కార్మికులతో సహా లక్షకు పైగా వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్ల నుంచి సమీకరించారు. కమ్యూనిటీ మీటింగ్స్, సోషల్ మీడియా చైతన్యం ఇవన్నీ మామూలు రాజకీయ వ్యూహాలు కాదు. సోషలిస్టు పద్ధతిలో ప్రజల భాగస్వామ్య పాలనకు నమూనాలు. అందుకే ఆయన ప్రచారం ఒక పార్టీ మిషన్ కాదు ఒక ప్రజా ఉద్యమం. ఈ విజయం ‘ఆర్గనైజ్డ్ పీపుల్స్ డెమోక్రటిక్ పవర్’ అనేది కార్పొరేట్ ‘మనీ పవర్’ను ఓడిరచగలదని, సోషలిజం పునరుజ్జీవాన్ని సూచిస్తూ, అమెరికన్ రాజకీయాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. ట్రంప్ వంటి నాయకులు, మస్క్ వంటి బిలియనీర్లు మమ్దానీని ‘‘కమ్యూనిస్టు’’ అంటూ ఓటర్ల నుంచి దూరం చేసేందుకు ప్రయత్నం చేసినా, ప్రజల మనసులో ఆయనను ‘‘ప్రజా నాయకుడు’’గా నిలిపింది ఆయన దృక్పథం.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు కేంద్రమైన న్యూయార్క్ నగరంలో, యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ తన రాజకీయాన్ని ‘గుర్తింపు రాజకీయాలు’ చుట్టూ కాకుండా, సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం అనే అంశంపైనే కేంద్రీకరించి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. ఆయన సిద్ధాంతం ప్రధానంగా జాతి వివక్షతో కూడిన పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరంతర పోరాటాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ పోరాటంలో భాగంగా, ఆయన అనేక కీలక సోషలిస్ట్ ఆర్థిక విధానాలను ప్రతిపాదించారు. దాదాపు 2 మిలియన్లకు పైగా అద్దెదారులకు ఊరటనిచ్చేలా అద్దె నియంత్రణను ప్రతిపాదించి, రియల్ ఎస్టేట్ లాభాపేక్షకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని రక్షించాలని కోరారు. పేదలు, వలస కార్మికుల రవాణా ఖర్చులను తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి బస్సు సేవలను వేగంగా, ఉచిత ప్రజా రవాణాగా మార్చాలని ప్రతిపాదించారు. ద్రవ్యోల్బణం పెరిగిన నగరంలో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రభుత్వ ఆధీనంలో, లాభాపేక్ష లేని కిరాణా స్టోర్లను ప్రారంభించాలనే వినూత్న ఆలోచనను ముందుకు తెచ్చారు. ఈ విధానాలన్నింటికీ నిధులు సమకూర్చడానికి, మిలియనీర్లు, బిలియనీర్లపై ఎక్కువ పన్నులు విధించి, తద్వారా సంపదను పునఃపంపిణీ చేయాలనే సోషలిస్ట్ లక్ష్యాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానాలు కార్ల్‌మార్క్స్ ప్రవచించిన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల అధికారం అనే సూత్రాలకు ఆధునిక ప్రతిబింబంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కొత్త తరంగాలు మొదలయ్యాయి. అసమానతలకు వ్యతిరేకంగా, సామ్యవాద భావజాలంతో కూడిన ప్రజా ఉద్యమాలు బలం పుంజుకుంటున్నాయి. న్యూయార్క్ నగరంలో జోహ్రాన్ మమ్దానీ విజయం, ఈ ప్రపంచ మార్పునకు శక్తిమంతమైన ప్రతిధ్వనిగా నిలిచింది. స్పెయిన్‌లోని ‘‘పొడేమోస్’’, ఫ్రాన్స్‌లో ‘‘లా ఫ్రాన్స్ ఇన్సూమిస్’’, బ్రిటన్‌లో ‘‘లేబర్ లెఫ్ట్’’, లాటిన్ అమెరికాలోని ‘‘పింక్ టైడ్’’ ఉద్యమాల పరంపరలో మమ్దానీ విజయం కూడా చేరింది. ఇవన్నీ కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, ప్రజల జీవన గౌరవం, సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం పుట్టిన నూతన ప్రజాస్వామ్య తరంగాలు. ఈ తరంగాలు పెట్టుబడి దారీ వ్యవస్థపై ప్రజల అసంతృప్తిని, సంక్షేమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాక, మమ్దానీ గెలుపు ఇస్లామో ఫోబియాకు వ్యతిరేకంగా ఒక శక్తిమంతమైన సందేశాన్ని చ్చింది. ఆయన జన్మస్థలమైన ఉగాండాలోనూ, రాజకీయ మార్పు కోసం పోరాడుతున్న యువతకు, ప్రతిపక్ష నాయకు లకు ఈ విజయం ఒక పెద్ద ప్రోత్సాహంగా నిలిచింది.
కేపిటలిజం వల్ల నిరాశకు గురైన యువత ఇప్పుడు సోషలిజాన్ని ఒక స్వప్నంగా కాదు బతుకు అవసరంగా చూస్తోంది. ‘‘పీపుల్స్ ఓవర్ ప్రాఫిట్’’ అనే నినాదం అమెరికా వీధుల నుంచి ప్రపంచ వేదికల వరకూ వినిపిస్తోంది. మమ్దానీ విజయం ఆ నినాదానికి ప్రతిరూపం. ప్రజల ఆశల, న్యాయం కోసం పుట్టిన కొత్త రాజకీయ తరంగం. ’’మమ్దానీ విజయం ఒక పాఠం చెబుతోంది ’సామ్యవాదం అంటే ప్రభుత్వ నియంత్రణ కాదు. ప్రజా నియంత్రణతో కూడిన ప్రజాస్వామ్యం’ అని. రాజీ లేని విలువలు, ప్రజల పట్ల నిజమైన మమకారం ఉంటే, అమెరికా వంటి దేశంలో కూడా ప్రజా రాజకీయాన్ని పునరుద్ధరించడం సాధ్యమే. నేటి భారత యువత కార్పొరేట్ గ్లామర్‌లో కాదు, ప్రజా స్వరంలో, సమానత్వపు పోరాటంలో కొత్త మార్గం కనుగొనాలి. మమ్దానీ దేశీయ సమస్యలకే పరిమితం కాకుండా, విదేశాంగ విధానంలోనూ సత్యం పక్షాన నిలిచే ధైర్యవంతమైన వైఖరిని ప్రదర్శించారు. పలస్తీనా ప్రజల హక్కుల పక్షాన నిలిచి, గజాపై ఇస్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిరచారు. బలమైన ఇస్రాయెల్ అనుకూల వాతావరణంలోనూ తన సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణిపై రాజీ పడకుండా విజయం సాధించి, ‘‘నిజం, న్యాయం గెలుస్తాయి’’ అని ప్రపంచానికి చాటారు. భారతీయ మూలాలున్న యువ నాయకుడిగా మమ్దానీ కేవలం న్యూయార్క్‌లో మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘాటైన విమర్శకుడిగా నిలిచారు. 2002 నాటి గుజరాత్ హింసపై మోదీని లక్ష్యంగా చేసుకుని, ‘‘ఆ దారుణాలకు మోదీ బాధ్యత వహించాలి. ఆ హింస మానవత్వంపై మచ్చ’’ అని తీవ్రంగా విమర్శించారు. మోదీ కలలు కంటున్న ‘ఒకే మతం, ఒకే జాతి’ భారత్‌ను కూడా ఆయన ప్రశ్నించారు. న్యూయార్క్‌లో హిందూ జాతీయవాదులు బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఉత్సవంగా జరుపుకోవడాన్ని ‘‘భారత ప్రజా స్వామ్యాన్ని అవమానించే చర్య’’ అని బహిరంగంగా ఖండిరచారు. మమ్దానీ వైఖరి మోదీ అనుచరులకు ‘దేశ ద్రోహం’గా కనిపించినా, చాలామంది భారతీయులు ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ద్వేషాన్ని వ్యాపింపజేసే నాయకులను ఎదిరించడమే తన రాజకీయ తాత్వికత అని చెబుతూ, ‘‘నేను ముస్లిం, నేను యువకుడిని, నేను డెమోక్ర టిక్ సోషలిస్టును. ఇవన్నీ చెప్పడానికి నేను సిగ్గుపడను,’’ అని తన విజయోత్సవ ప్రసంగంలో స్పష్టం చేశారు.
మమ్దానీ విజయం, భారతదేశంలోని మేధావులు, సామాజిక కార్యకర్తలకూ యువతకు ఒక శక్తిమంతమైన మేల్కొలుపు సందేశాన్ని, సరికొత్త స్ఫూర్తిని అందించింది. మమ్దానీ విజయం కారణంగా, ముంబై, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో అత్యవసరంగా పరిష్కరించాల్సిన పట్టణ సమస్యలైన అద్దె నియంత్రణ, ఉచిత ప్రజా రవాణా వంటి విధానాలు భారతీయ రాజకీయ పార్టీల విధాన ఎజెండాపై పునరాలోచనకు దారితీయవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ గెలుపు కమ్యూనిస్టు కార్యకర్తలకు అపారమైన నైతిక బలాన్ని ఇచ్చింది. కార్పొరేట్ ధనబలం, మీడియా ఆధిపత్యాన్ని కూడా, నిజాయితీతో కూడిన సిద్ధాంతం, వ్యవస్థీకృత ప్రజల శక్తి సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించగలదని ఆయన రుజువు చేశారు. అమెరికా వంటి మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో కూడా సోషలిస్టు భావజాలం ప్రజల హృదయాలను తాకగలదని నిరూపించారు. న్యూయార్క్ వీధుల్లో మొదలైన ‘‘పీపుల్ ఓవర్ ప్రాఫిట్’’ నినాదం ఇప్పుడు ప్రపంచ ప్రజాస్వామ్యాల గుండెల్లో బలంగా మార్మోగుతోంది. జోహ్రాన్ మమ్దానీ సాధించిన ఈ విజయం కేవలం ఒక నగరం గెలుపు కాదు. ఇది 21వ శతాబ్దపు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బీజం. కార్ల్‌మార్క్స్ సూత్రాలు 19 వ శతాబ్దపు నినాదాలు కావు, అవి 21 వ శతాబ్దపు అవసరం అని మమ్దానీ విజయం నిరూపించింది. ఈ ప్రజా ఉద్యమ పవనం, ఒక కొత్త ఆలోచనా సరళికి బీజం వేస్తూ, సమానత్వం వైపు భారత్ పయనించేలా ప్రభావితం చేయాలని ఆశిద్దాం.


