Homeవిద్యారంగాన్నికాపాడుకుందాం

విద్యారంగాన్నికాపాడుకుందాం

- Advertisement -

వైద్య కళాశాలలు అమ్ముకోవడం సిగ్గుచేటని విమర్శ

. ఉద్యమం ఉధృతం చేయాలి
. ఏఐఎస్‌ఎఫ్‌ బస్సు జాత ముగింపు సభలో ఈశ్వరయ్య పిలుపు

విశాలాంధ్ర బ్యూరో- అనంతపురం : విద్యారంగాన్ని కాపాడుకోవడానికి విద్యార్థి లోకం ఉద్యమం ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. విద్యారంగ పరిరక్షణ కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) అక్టోబరు 22న ఇచ్చాపురంలో ప్రారంభించిన రాష్ట్రవ్యాప్త బస్సుజాత ముగింపు సందర్భంగా బుధవారం అనంతపురంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.కుళ్లాయిస్వామి అధ్యక్షతన జరిగిన సభకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకత్వం, వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసభకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఊరూరా తిరిగి విద్యారంగాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారని, విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేసి అనేక వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నియంత పోకడలతో విద్యార్థుల సమస్యల పట్ల సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలతో కనీసం చర్చలు జరపకుండా ఉద్యమాన్ని అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సైతం విద్యార్థుల సమస్యలను గాలికొదిలేశారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో పౌష్టికాహార లోపంతో పాటు కనీసం తాగునీరు లేక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. విద్యార్థులకిచ్చే స్కాలర్‌ షిప్‌లు పెంచలేదన్నారు. ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో 4వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి 10 లక్షల మంది యువకులు రోడ్లపై తిరుగుతున్నారని…ఉద్యోగావకాశాలు ఎక్కడ చూపించారన్నారని నిలదీశారు. గూగుల్‌ డేటా సెంటర్‌ పేరుతో రూ.లక్షల కోట్ల భూములు అప్పనంగా అప్పగిస్తున్నారని, కడప స్టీల్‌ ప్లాంట్‌ కు దిక్కులేదు గానీ కార్గో విమానాశ్రయం పెడతామంటున్నారని విమర్శించారు. కరువు బారిన పడి రైతులు వలసలు పోతుంటే, విద్యార్థుల చదువులు ఆగిపోతుంటే సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేశ్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అశాస్త్రీయమైన భావజాలంతో కుర్చీ కోసం ఏ వానకు ఆ గొడుగు పడుతూ సనాతన ధర్మం పేరుతో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసుకుంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. విద్యారంగాన్ని రక్షించడం మానేసి భక్షించడం నేర్చుకున్న మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు తగిన గుణపాఠం చెప్తారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు ఉండాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. నిరుద్యోగులకు నెలనెలా రూ. 3వేల భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితవాడల్లో 5వేల కోట్లతో గుడులు కడతామంటూ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాఠశాలలు కట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బందెల నాసర్‌జీ మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మిక , శ్రామిక వర్గ కుటుంబాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే పీపీపీ ప్రతిపాదన తెచ్చారని మండిపడ్డారు. విద్యార్థులకు 4400 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌ బకాయిలుంటే రూ.400 కోట్లు ఇస్తామనడం సమంజసం కాదన్నారు. 10 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గూగుల్‌ డేటా సెంటర్‌, అమరావతి, పోలవరం చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహించారు. హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వలరాజు మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీ జాఫర్‌, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జే రాజారెడ్డిలు వేదికపై ఆశీనులైనారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ చలపతి, మస్తాన్‌, ఫణీంద్ర, నాగభూషణం, సాయి, సాబీర్‌, రవికుమార్‌, నాయకులు హనుమంతు, ఆంజనేయులు, వెంకట, నాయక్‌, నరసింహ, మంజునాథ్‌, చందు, ఉమా మహేష్‌, మౌలిక, హారిక, రాధా, జ్యోతి, నాని, సాయి, సుమన్‌ పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్‌ అధ్వర్యంలో పాడిన విప్లవ గేయాలు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు