- అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ స్కూళ్లు
- తల్లిదండ్రులపై మోయలేని భారంగా మారిన పిల్లల చదువులు
- చోద్యం చూస్తున్న సర్కారు
- జీవోలు ఉన్నా నియంత్రణ సున్నా
- కోర్టు కేసుల పేరుతో తప్పించుకుంటున్న యాజమాన్యాలు
- అధికార యంత్రాంగం మొద్దునిద్ర
విశాలాంధ్రసచివాలయం: రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల అడ్డగోలు ఫీజుల వసూళ్లకు, ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చే విధానాలకు ప్రభుత్వం చెక్ పెట్టకపోవడంతో సగటు మధ్యతరగతి, పేద కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ‘విద్య హక్కు వ్యాపారం కాదు’ అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి…తల్లిదండ్రులపై రోజురోజుకూ మోయలేని భారాన్ని మోపుతున్నారంటూ విద్యావేత్తలు, నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రిస్తున్నామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున జీవోలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు శూన్యంగా మారింది. గతంలో 2021 ఆగస్టు 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.53 ప్రకారం నర్సరీ నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో రూ.10 వేలు పట్టణాల్లో రూ.11 వేలు, నగరాల్లో రూ.12 వేలు, అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు గ్రామాల్లో రూ.12 వేలు, పట్టణాల్లో రూ .13 వేలు, నగరాల్లో రూ.18 వేలు వరకు మాత్రమే గరిష్టంగా ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. ఇటీవల జీవో నం.6, జీవో నం. 9 (2025) వంటి కొత్త ఉత్తర్వులు తీసుకొచ్చినప్పటికీ వాటికి చట్టబద్ధమైన పటిష్టత కల్పించడంలో వైఫల్యం చెందింది. ప్రభుత్వ విధానాల్లోని న్యాయపరమైన లోపాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించి స్వేచ్ఛగా ఊరట పొందుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ట్యూషన్ ఫీజులకే పరిమితం కాని ‘దోపిడీ’
కేవలం అడ్మిషన్, ట్యూషన్ ఫీజులతోనే ప్రైవేట్ బడులు ఊరుకోవడం లేదు. రకరకాల పేర్లతో అదనపు బాదుడు బాదుతున్నాయి. స్కూల్ యాజమాన్యాలు నిర్ణయించిన కౌంటర్లు, నిర్దిష్ట వ్యాపారుల వద్దే పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫారాలు, టై, బెల్టులు, షూలు అధిక ధరలకు కొనుగోలు చేయాలని ఆంక్షలు విధిస్తున్నాయి. స్పెషల్ క్లాసులు, సాంస్కృతిక కార్యక్రమాలు, డిజిటల్ లెర్నింగ్, ప్రాజెక్టు వర్కుల పేరిట వేలకు వేలు గుంజుతున్నా విద్యాశాఖ అధికారులు కనీస తనిఖీలు చేపట్టడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన లోపించడం వల్ల ప్రైవేట్ స్కూలు వ్యాపార ధోరణి మరింత పెరిగిపోతోంది.
పొరుగు రాష్ట్రాల్లో కఠినం… ఏపీలో మాత్రం సున్నా
తమిళనాడు, పంజాబ్, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేసి…నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. పరిమితికి మించి ఒక్క రూపాయి వసూలు చేసినా గుర్తింపు రద్దు చేయడం, జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు అక్కడ అమలవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు గుంజుతున్న బడులపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
నగదు ప్రోత్సాహకాలు శాశ్వత పరిష్కారం కావు
గత ప్రభుత్వం ‘అమ్మ ఒడి’, ప్రస్తుత ప్రభుత్వం ‘తల్లికి వందనం’ వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ, ప్రైవేట్ విద్యా ఖర్చుల భారంతో పోలిస్తే ఈ మొత్తం అరకొరగానే మిగులుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని 44,222 పాఠశాలల్లో 34.93 లక్షల మంది విద్యార్థులు, అలాగే 797 ఎయిడెడ్ పాఠశాలల్లో 95,710 మంది విద్యార్థులు, అంటే ప్రభుత్వ, ఎయిడెడ్ రంగాలు రెండూ కలిపి దాదాపు 45,000 పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య మాత్రం కేవలం 36 లక్షలకే పరిమితమైంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 15,710 ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఉండగా, ఏకంగా 48.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే ప్రభుత్వ బడులతో పోలిస్తే దాదాపు మూడో వంతు సంఖ్యలోనే ఉన్న ప్రైవేటు పాఠశాలల్లోనే దాదాపు 12.40 లక్షల మంది విద్యార్థులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో బలోపేతం చేసి, మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడంలో సర్కారు విఫలం కావడం వల్లే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
కమిటీల నివేదికలు బుట్ట దాఖలు?
ప్రైవేట్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, ఫీజుల సమతుల్యతపై అధ్యయనం చేసేందుకు గతంలో వేసిన వివిధ కమిటీల నివేదికలు అధికారుల నిర్లక్ష్యం వల్ల బుట్టదాఖలయ్యాయి. బడుల తనిఖీలు కేవలం రికార్డుల పరిశీలనకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఉపశమనం లభించడం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను, విద్యా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కఠినమైన చట్టంతో కూడిన ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలి. స్కూళ్ల ప్రాంగణాల్లో లేదా నిర్ణీత దుకాణాల్లో పుస్తకాలు, యూనిఫారాలు అధిక ధరలకు అమ్మే విధానాన్ని తక్షణమే అరికట్టాలి. ప్రతి సర్కారీ పాఠశాలలో నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు కల్పించి ‘ఉచిత ` నాణ్యమైన విద్య’ను రాజ్యాంగబద్ధంగా అందించాలి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న ఈ సున్నిత అంశంపై ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలకు స్వస్తి చెప్పి…పటిష్టమైన చట్టబద్ధ విధానాన్ని అమలు చేయాలని నిపుణులు , విద్యావేత్తలు కోరుతున్నారు.


