ప్రజాభిప్రాయ సేకరణకు 30 రోజులు
వాషింగ్టన్: అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఫీజు మరోమారి పెంచబోతోంది. 1.03 లక్షల డాలర్ల ఫీజును ప్రతిపాదించింది. సాధారణ కోటాతో పాటు మాస్టర్స్ డిగ్రీ కోటా కింద దరఖాస్తు చేసే అన్ని హెచ్-1బీ కేప్-సబ్జెక్ట్ దరఖాస్తుదారులకు కొత్త ఫీజు వర్తిస్తుంది. అమెరికాలో ఉన్నత విద్య (మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ) పూర్తి చేసిన వారికి వర్తించే ‘అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు’ ఉన్నప్పటికీ ఈ రుసుము చెల్లించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ ోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు దాఖలు చేసే కేప్-ఎసెంప్ట్ దరఖాస్తులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే ఈ ఫీజను వీసా కోరుతున్న కంపెనీ దరఖాస్తు చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరిచిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించిందని ఇమిగ్రేషన్ సంస్థ ఫ్రాగోమెన్ తెలిపింది.
తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు…
అమెరికాలో వలస విధానాలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో అక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశం కోరే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. 2025-26లో 15 శాతం క్షీణత నమోదైంది. 1,100కు పైగా విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహించే ‘కామన్ యాప్’ ఈ వివరాలు వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుల సంఖ్య పెరిగినప్పటికీ, మార్చి 1 నాటికి సంఖ్య 10 శాతం తగ్గింది. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో అగ్రగామిగా ఉన్న భారత్ నుంచి దరఖాస్తుదారుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆసియా, ఆఫ్రికా దరఖాస్తుదారుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించినట్లు తెలిపింది. వీసా నిబంధనలు, అనిశ్చిత విధానాల కారణంగా 2026 ‘ఫాల్’ సెమిస్టర్ నాటికి అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 1.1 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని ‘జీదీ ఇంటర్నేషనల్’ మరో నివేదిక ఇచ్చింది. 2025-26లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 11.69 లక్షలుగా ఉండగా, ఈ ఏడాది 10.57 లక్షలకు తగ్గిందని తెలిపింది. అమెరికాలో 40,000 ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని ఆ నివేదిక వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో 3.63 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 2025-26 ‘ఫాల్’ సెమిస్టర్లో అంతర్జాతీయ విద్యార్థులు స్థానిక ఆర్థిక వ్యవస్థకు 41.77 బిలియన్ డాలర్ల మేర సహకారం అందించారు. 2026-27లో ఈ సంఖ్య 38.37 బిలియన్ డాలర్లకు తగ్గనుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం విద్యార్థి, సందర్శక వీసాలకు సంబంధించి సాంప్రదాయ ‘స్టేటస్ వ్యవధి’ విధానాన్ని తొలగిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. అమెరికాలో నివసించే గరిష్ట పరిమితిని నాలుగేళ్లకు పరిమితం చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ కార్యక్రమం ద్వారా పని చేయాలను కునే విదేశీ విద్యార్థులపై 1,00,000 డాలర్ల రుసుము విధించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఇలాంటి కఠిన నిబంధనలన్నీ అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు దారితీస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమైంది.
పడిపోతున్న ట్రంప్ గ్రాఫ్
యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ పడిపోతోంది. ఆయనకు ప్రజాదరణ రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. ఈ మేరకు రాయిటర్స్ ఇప్సోస్ పోల్ వెల్లడించింది. అమెరికా వ్యాప్తంగా నాలుగు రోజులపాటు 1,215 మందిపై ఈ సర్వే జరిగింది. సైనిక చర్యకు కేవలం 31 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు. మార్చిలో నిర్వహించిన సర్వేలో 37 శాతం మంది మద్దతు ఇవ్వగా, ఈ నెల ప్రారంభంలో అది 34 శాతానికి…. ఇప్పుడు 31 శాతానికి తగ్గిపోవడం గమనార్హం.
మళ్లీ పెరిగిన హెచ్-1బీ ఫీజు
- Advertisement -
RELATED ARTICLES


