Homeఅంతర్జాతీయం‘భూకంపం’ తరహా ప్రతీకారం

‘భూకంపం’ తరహా ప్రతీకారం

- Advertisement -

అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఆంక్షలను రెండేళ్ల ప్రణాళికతో ఎదుర్కోనున్నట్లు ప్రకటన

తెహ్రాన్: అమెరికాకు మరో ఓటమి తప్పదని ఇరాన్ ప్రకటించింది. తమపై కొత్త ఆంక్షలను ఎదుర్కోవడానికి రెండేళ్ల ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ ఆర్థిక జీవనాధారాన్ని తెగ్గొట్టడమే లక్ష్యంగా అమెరికా ఆంక్షలతో రెచ్చిపోయింది. అయితే అమెరికా చర్యలను తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు వ్యతిరేకిస్తారని ఇరాన్ నమ్మకంగా ఉంది. ఇదే విషయాన్ని పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. అమెరికా ఆంక్షలను పరిగణనలోకి తీసుకోబోమని వాణిజ్య భాగస్వాములు భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్క్యాస్ట్’ పేరుతో కొత్త ఆంక్షల ప్యాకేజీని అమెరికా ప్రకటించింది. ఎకనామిక్ డీ-డేగా వర్ణించింది. డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా వంటి కీలక రంగాలను దెబ్బతీసే విధంగా ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలు విధిస్తామంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
ఇరాన్ చమురు ఆదాయం, ఆయుధాల సేకరణ, సైబర్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 60కి పైగా వ్యక్తులు, కంపెనీలు, నౌకలపై కూడా ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో ఆర్థిక పోరులో ఇదే చివరి అంకంగా ప్రకటించకుంది. ఈ పరిణామాల క్రమంలో ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనీజాదేహ్ స్పందించారు. ‘అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శత్రువులు ఆర్థికపరమైన ఉగ్రవాద దాడికి పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు తగిన సాధనాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అమెరికా ఆంక్షలను చైనా, రష్యా అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా ప్రతిఘటిస్తాయన్నారు. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసెన్ రెజాయ్ స్పందిస్తూ అమెరికాకు సహకరించే దేశం తమ నుంచి ‘భూకంపం’ తరహా ప్రతీకారాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. పర్షియన్ గల్ఫ్ లేదా హోర్మూజ్ జలసంధి నుంచి చుక్క చమురు బయటకు వెళ్లదని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై ఆంక్షలను ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ఇరాన్‌తో పాటు ఆ దేశానికి మద్దతిచ్చే వారి నుంచి భారీ మూల్యం వసూలు చేయొచ్చన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు