Thursday, January 15, 2026
Homeసంపాదకీయంవిద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ

విద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ

- Advertisement -

అమెరికాలో అతి పెద్ద నగరం, ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటి అయిన న్యూయార్క్‌ మేయరుగా జొహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక కావడమే కాక ఆయన డెమొక్రాట్‌ పార్టీలో సోషలిస్టు కావడం బ్రహ్మాండమైన పరిణామమే. మమ్దానీ భారతీయ సంతతి వాడు. ప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడు. మంగళవారం రాత్రి డెమొక్రాట్‌ పార్టీ నాయకులకు పండగ రోజు. అబిగెయిల్‌ స్పాంబెగర్‌ వర్జీనీయ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. న్యూ జెర్సీ గవర్నర్‌గా మైకీ షెర్రిల్ల్‌ మరో వేపు జాక్‌ చీట్టరెల్లీని ఓడిరచి విజయ బావుటా ఎగరేశారు. కాలిఫోర్నియాలో గవిన్‌ న్యూసం కూడా డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన వాడే. దానివల్ల కాలిఫోర్నియా నుంచి మరో అయిదుగురు డెమొక్రాట్లు చట్ట సభలో ఉంటారు. ఇవన్నీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు పెద్ద విఘాతమే. 34 ఏళ్ల సోషలిస్టు మమ్దానీ న్యూయార్క్‌ లాంటి మహా నగరానికి మేయర్‌ కావడం అన్నింటికన్నా పెద్ద పరిణామం. నిజానికి ఈ ఏడాది ఆరంభంలోనూ మమ్ద్దానీ అంటే ఎవరికీ తెలియదు. గత యాభై ఏళ్లల్లో ఎన్నడూ లేనట్టుగా మమ్ద్దానీ పది లక్షల కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించాడు. మొత్తం ఓట్లలో ఆయనకు 50.04 శాతం ఓట్లు దక్కాయి. ఆయన గెలుపు అమెరికాలో అనేక సానుకూల పరిణామాలకు సంకేతం. ఓ సోషలిస్ట్‌ న్యూయార్క్‌ మేయర్‌ కావడం అంటే అమెరికాలో సోషలిస్టు భావాలకు ఆదరణ పెరగడానికి చిహ్నం. ఈ ప్రభావం దేశమంతా ఉంటుందంటున్నారు. ఈ కారణాలన్నీ చూస్తే మమ్ద్దానీ విజయం చాలా ప్రత్యేకమైన విజయ గాథే. మేయర్‌ ఎన్నికల ప్రచారంలో మమ్ద్దానీ పెద్ద పెద్ద వాగ్దానాలే చేశారు కనక ఆయన ఏలుబడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా గమనించవలసిన అవసరం ఉంది. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చే శక్తి ఆయనకు ఉంటుందో లేదో చూడాలి. మమ్ద్దానీ గెలుపు కేవలం అసాధారణం మాత్రమే కాదని అమెరికాలో వామపక్ష భావాలు ఉన్న వారు భావిస్తున్నారు. ఈ ప్రభావం దేశమంతటా ఉంటుందని ఆశిస్తున్నారు. మేయర్‌గా మమ్ద్దానీ హయాంలో ప్రజాభద్రత సన్నగిల్లుతుందని న్యూయార్క్‌ మాజీ పోలీసు కమిషనర్‌ రే కెల్లీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మమ్ద్దానీ విజయం వెనక ఆయన భార్య రమా దువాజీ మద్దతు చాలా అపూర్వమైందని చెప్తున్నారు. ఆమె నవతరానికి ప్రతినిధి. ఆమె వయస్సు 28 ఏళ్లే. ఆమె మామూలుగా జనం దృష్టిలో పడడానికి అంగీకరించరు. కానీ మమ్దానీ విజయోత్సవ సభలో ఆమె పక్కనే ఉన్నారు. రమా దువాజీ సిరియాకు చెందిన అమెరికా పౌరురాలు. ఆమె 2021 లోనే అమెరికా వచ్చి మమ్ద్దానీని పెళ్లి చేసుకున్నారు. మమ్ద్దానీ ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఆమె మమ్ద్దానీకి వెన్నంటే ఉన్నారు. డిజిటల్‌ వేదికల్లోనూ, సామాజిక మాధ్యమాలలోనూ మమ్ద్దానీ పలుకుబడి పెంచడానికి ఆమె నిరంతరం కృషి చేశారు. ఆమె మమ్ద్దానీకి చాలా దన్నుగా ఉన్నప్పటికీ బహిరంగ వేదికల మీద తన భర్త పక్కన కనిపించే వారు కాదు. ఆమె మంచి కళాకారిణి. తన కళద్వారా ఆమె పలస్తీనియన్ల దయనీయ స్థితికి అద్దంపట్టే వారు. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికలకు ముందు మమ్ద్దానీ డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా ఎంపిక అయ్యే క్రమంలో మాత్రం రమా దువాజీ వేదికల మీద కనిపించే వారు. రమ న్యూయార్క్‌లోని విసువల్‌ ఆర్ట్స్‌ సంస్థ నుంచి స్నాతకోత్తర పట్టా సంపాదించారు. ఆమె గీసిన చిత్రాలు న్యూయార్క్‌, వాషింగ్టన్‌ పోస్టు, బీబీసి, ఆపిల్‌ స్పోటిఫై లాంటి చోట్ల కనిపించేవి. లండన్‌లోని మాధ్యమల్లో ఆమె చిత్రాలు వెలువడ్డాయి. రాజకీయ ప్రతిఘటనే ఆమె కళా రీతికి ఆలవాలం.
మమ్ద్దానీ గెలుపు అమెరికాలో పురోగమన భావాలు విస్తరించ డానికి తార్కాణం. ఆయన గెలుపు వలస వాదులకు వ్యతిరేకంగా డోనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించడానికి చిహ్నం కూడా. మమ్ద్దానీ గెలుపు ట్రంప్‌ ముస్లిం వ్యతిరేకతను ఎండగట్టడానికి కూడా నిదర్శనం. మమ్ద్దానీ న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నిక కావడం ఒక్కటే మహత్తరమైంది కాదు. సిన్‌సినాటి నగర మేయర్‌గా ఆఫ్తాబ్‌ పర్వాల్‌ ఎన్నికయ్యారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ సోదరుడు. జేడీవాన్స్‌ భార్య భారతీయ సంతతికి చెందిన వారే. ఆమె త్వరలోనే క్రైస్తవ మతం స్వీకరిస్తారని జేడీవాన్స్‌ ఇటీవలే ప్రకటించారు. వాన్స్‌ భార్య హిందువు. అమెరికాలో నివాసం ఉండాలంటే విధిగా క్రైస్తవం స్వీకరించవలసిన అగత్యం ఉందా అన్న ప్రశ్న తలెత్తక తప్పదు. వాన్స్‌ భార్య క్రైస్తవం స్వీకరిస్తారనడం మన దేశంలో లాగే అమెరికాలోనూ విద్వేషం ఇంకా వదలలేదనడానికే చిహ్నం. మమ్ద్దానీ తండ్రి మహమూద్‌ మమ్ద్దానీ ప్రఖ్యాత చరిత్రకారుడు. సలాం బాంబే చిత్ర దర్శకుడు. తాను ముస్లింను అని మమ్ద్దానీ గర్వంగా చెప్పుకుంటారు. ఆయన పుట్టింది మాత్రం ఉగాండాలో. మమ్ద్దానీ ముస్లిం కనక ఆయన న్యూయార్క్‌ మేయర్‌ కాకుండా చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా చాలా మందే శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ట్రంప్‌ అయితే మమ్ద్దానీ న్యూయార్క్‌ మేయర్‌ అయితే ఆ నగరానికి నిధులు అందించబోమని బెదిరించారు. అక్కడికి ఆ నిధులు తన జేబులోంచి ఇస్తున్నట్టు. ఇలాంటి బెదిరింపులు మన దేశంలో ఎప్పటి నుంచో అనుభవంలో ఉన్నవే. ఎలాన్‌ మస్క్‌ సైతం మమ్ద్దానీని తప్ప ఎవరినైనా ఎన్నుకోండి అని చెప్పి తన ముస్లిం వ్యతిరేకతను బయట పెట్టుకున్నారు. అన్నిటికన్నా మించి తీవ్రవాద దేశంగానే కాక అమెరికాకు లంకెలా తయారైన ఇస్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ సైతం మమ్ద్దానీ గెలవకుండా చూడడానికి సకల ప్రయత్నాలూ చేశారు. ఇది అమెరికా గడ్డ మీంచి ‘‘అబ్కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌’’ అని మోదీ నినదించిన రోజులు గుర్తుకు వస్తాయి. మమ్ద్దానీ విజయం అమెరికాలో ప్రబలుతున్న ఇస్లాం వ్యతిరేకతను ఓడిరచడంకన్నా ఎంత మాత్రం తక్కువ కాదు. ఇస్రాయెల్‌ యూదు దేశం. అనేక మంది యూదులు అమెరికా ప్రభుత్వంలో ఎప్పుడూ కీలక స్థానాల్లో పని చేస్తూనే ఉన్నారు. ముస్లిం వ్యతిరేకతను, యూదుల ఉన్మాదాన్ని వ్యతిరేకించడం మమ్ద్దానీ విజయానికి సంకేతంగా పరిగణించాలి. భారతీయ సంతతి మూలాలు ఉన్న వ్యక్తి న్యూయార్క్‌ మేయర్‌ కావడం గర్వకారణమే. కానీ బృహన్ముంబై మేయర్‌ ఎన్నిక మూడున్నరేళ్ల నుంచి వాయిదా పడ్తూనే ఉంది. బెంగళూర్‌ మేయర్‌ ఎన్నిక జరగాల్సిన గడువు దాటి చాలా రోజులే అయింది. ఈ అంశాన్ని లేవనెత్తే వారే కనిపించడం లేదు. భారతీయ సంతతి వారు అమెరికాలో విజయ కేతనం ఎగరవేసిన వారిలో హరగోవింద్‌ ఖొరానా నుంచి చాలా మందే ఉన్నారు. సంతతి ఏది అన్న దానికన్నా వారి ఆలోచనా ధోరణి ఏమిటి అన్నదే ప్రధానం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు