Homeవిశ్లేషణవీబీజీ-రామ్‌జీ పథకంపేదలు ఉపాధికి దూరం

వీబీజీ-రామ్‌జీ పథకంపేదలు ఉపాధికి దూరం

- Advertisement -

మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి పథకం స్థానంలో, వికసిత్ భారత్-జీ-రామ్‌జీ పథకాన్ని తీవ్ర వ్యతిరేకతల మధ్య జూలై 1 నుంచి మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా పేదలను క్రమంగా ఉపాధికి దూరం చేయడం మోదీ ప్రభుత్వ విధానంగా ఉంది. ఈ పథకాన్ని రద్దు చేయాలని రైతు, రైతు కూలీ సంఘాలు దేశ వ్యాప్తంగా ఉద్యమబాట పట్టాయి. ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసి చివరికి రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిధులు పెంచకుండా చేసి ఇప్పుడు ఆ పథకాన్నే రద్దు చేసే విధానాలు అమలుచేస్తోంది. అందులో భాగంగానే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి ‘వికసిత్ భారత్-జీ-రామ్ జీగా పేరు పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును 2025 డిసెంబర్ 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఎటువంటి చర్చ లేకుండానే నిరసనల మధ్య 18న బిల్లును మోదీ ప్రభుత్వం చట్టంగా ఆమోదం పొందింది. ఈ బిల్లులో పంచాయతీల ద్వారా పనుల అమలు, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంపు, వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత లేకుండా ఉపాధి పనులను 60 రోజుల వరకు తాత్కాలిక నిలిపివేత, వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో పనులు, ప్రణాళికలు, వారానికి ఒకసారి కూలి చెల్లింపు, ఏబీసీలు గ్రామ పంచాయతీల విభజన, కేంద్రం నిర్ధారించిన పారా మీటర్స్‌ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి పనుల కేటాయింపు, కేటాయింపులకు అదనంగా నిధులు ఖర్చు చేస్తే దాన్ని రాష్ట్రాలే భరించడం, ఉపాధి పనుల కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం నిధుల కేటాయింపు ఈ బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గి, నిరుద్యోగం పెరగడం, ఉపాధి కోసం గ్రామీణ పేదలు పట్టణాలకు వలస వెళ్లడం, ప్రభుత్వం పట్ల గ్రామీణ పేదల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం దృష్టిలో పెట్టుకుని, ఆ వ్యతిరేకతను చల్లార్చేందుకు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పధకం తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నికరమైన ఆదాయ కల్పన, వనరుల ఉత్పాదక, అభివృద్ది లక్ష్యాలుగా 2005 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యంగా ప్రకటించింది. 2009లో మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి పధకంగా యూపీఏ ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకం కింద జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తామని చెప్పింది. మోదీ పాలనలో 2024 నాటికి దేశంలో జాబ్ కార్డులు పొందిన కుటుంబాలు 9 కోట్ల, 2 లక్షలుగా ఉన్నాయి. ఉపాధి పథకం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కుటుంబాలకు వంద రోజుల పని కల్పించడంలో పాలక ప్రభుత్వాలన్నీ విఫలం అయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 40.70 లక్షల కుటుంబాలకు వంద రోజుల పని లభిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.74 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని లభించింది. యూపీఏ ప్రభుత్వ పాలనలోనే పథకాన్ని నీరుగార్చే విధానాలు ప్రారంభమై నేడు మోదీ ప్రభుత్వ పాలనలో అది తీవ్రమైంది. పథకానికి నిధుల కేటాయింపులు తగ్గించలేదు పెంచలేదు. పైగా 4కోట్ల,57 లక్షల జాబ్ కార్డులు తొలగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 18.34 జాబ్ కార్డులు తొలగించి 100 రోజులు పని కల్పించడంలో విఫలమైంది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ 2025 డిసెంబర్ 9న పార్లమెంట్‌కి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 18.34 లక్షల జాబ్ కార్డులు తొలగించింది. 2019-20, 2024-25 మధ్య అత్యధికంగా కోటి 4 వేల మంది జాబ్కార్డులను తొలిగించింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 11లక్షల జాబ్కార్డులు తొలగించారు. తెలంగాణలో 3,45,445, ఒడిశాలో 80,896, ఉత్తరప్రదేశ్‌లో 91.48 లక్షలు జాబ్ కార్డులు తొలగించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పధకాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్ నిధుల కేటాయింపులు పెంచడం లేదు. 2020-21 వార్షిక బడ్జెట్లో 63 వేల కోట్లు కేటాయించింది. ఆ తర్వాత కోవిడ్ రావడంతో పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలందరూ తిరిగి గ్రామాలకు వచ్చేశారు. అప్పుడు వారికి ఉపాధి సమస్యగా మారింది. దీంతో మోదీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు రావడంతో, గ్రామీణ జాతీయ ఉపాధి పథకానికి 63 వేల కోట్ల నుంచి 1,11,170 కోట్లకు నిధుల కేటాయింపు జరిగింది. ఆ మరుసటి ఆర్థిక (2022-23 ) సంవత్సరం బడ్జెట్ కేటాయింపు మాత్రం 73 వేల కోట్లకే పరిమితమైంది. 2024-25 బడ్జెట్లో 60 వేల కోట్లు కేటాయించి, ఆ తర్వాత 86 కోట్లుగా ప్రకటించింది. 2025-26 వార్షిక బడ్జెట్లో 89,153.73 కోట్లు ప్రకటించింది. గత బడ్జెట్ కన్నా పెంపుదల 3 వేలు మాత్రమే. దీన్ని పెంపుదల అనలేము. కోవిడ్ సమయంలో తప్ప ఉపాధి పథకానికి నిధుల పెంపుదల జరగలేదు. వీబీజీ-రామ్-జీ పథకంలో ప్రతిపాదించిన సెక్షన్ 5(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాలను నోటిఫై చేస్తుందో, అక్కడ మాత్రమే ఈ పధకం అమలు జరుగుతుంది. కేంద్రం నోటిఫై చేసిన ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకు వచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. నోటిఫై చేయని ప్రాంతాల్లో పేద కుటుంబాలకు కొత్త పథకంలో పని లభించదు. కొత్త పథకంలోని సెక్షన్ 5(1) రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. ఇంతకుముందు ఉపాధి చట్టంలో పనులు ఏ ప్రాంతాల్లో నిర్ణయించాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. ఇప్పుడు కొత్త ఉపాధి పథకం రాష్ట్రాల హక్కును తొలగించి, మోదీ ప్రభుత్వానికి కట్టబెట్టింది. కేంద్ర ప్రభుత్వం, తనకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో పనుల కేటాయింపులలో వివక్షకు అవకాశం ఉంది. ఉపాధి వేతనాల్లో ఖర్చులో కూడా 60:40 నిష్పత్తిలో పంచుకోవాలి. ఇది రాష్ట్రాలపై భారం మోపడమే. ఈ భారాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలు భరించలేక ఉపాధి పనులను తగ్గిస్తాయి. ఫలితంగా జాబ్ కార్డు పొందిన కుటుంబాలకు పని లభించదు. ఉపాధి పథకంలో రోజు కూలీ 307 రూపాయలుగా మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవ రూపంలో 240 రూపాయలకు మించి రావడం లేదు. వ్యవసాయ, వ్యవసాయేతర పనుల్లోనూ రోజు కూలి 500 రూపాయలుగా ఉంది. దీన్ని గమనిస్తే ఉపాధి పథకం కూలి ఎంత తక్కువగా ఉందో తెలుస్తుంది. వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత పేరుతో, ఆ సమయంలో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేతను తాజా బిల్లులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం వల్ల గ్రామీణ పేదలకు లభించే ఉపాధిలో 80శాతం తగ్గిపోయింది. గ్రామీణ ఉపాధి పనులే వారికి ఆధారం. వ్యవసాయ సీజన్ పేరుతో ఉపాధి పధకం పనులు నిలిపివేస్తే పేద కుటుంబాలు పనులు దొరక్క తీవ్ర సంక్షోభంలో పడతాయి. దీన్ని గమనిస్తే వ్యవసాయ సీజన్‌లో పనులు నిలిపివేత భూకామందుల ల్ఙÝ కోసం అన్నది స్పష్టమౌతుంది. ఉపాధి పనుల కూలీలకు వారం రోజుల్లోనే వేతనాలు చెల్లించాల్సి ఉండగా, నెలల తరబడి వారికి కూలి డబ్బులు అందకపోగా ఉపాధి బకాయలు పేరుకుపోతున్నాయి. ఉపాధి పనులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం దేశవ్యాప్తంగా 1,340 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 402.93 కోట్ల బకాయిలు ఉన్నాయి. కేరళలో 339.87 కోట్లు, తమిళనాడులో 220.13 కోట్లు, మధ్యప్రదేశ్ 131 కోట్ల బకాయిలు ఉన్నాయి. మహాత్మాగాంధీగ్రామీణ ఉపాధి హామీ పధక లక్ష్యం అనుగుణంగా పనిచేయకపోయినా, అవకతవకలు, అవినీతితో నిండి ఉన్నా గ్రామీణ, ఆదివాసీ ప్రజలకు పధకం కొంత మేరకు ఉపశమనంగా ఉంది. దీన్ని కూడా వారికి లేకుండా చేసేందుకే మోదీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి పధకం. ఉపాధి పొందడం ప్రజల హక్కు. అది భిక్ష కాదు. వీబీజీ`రామ్‌జీ పధకాన్ని తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలందరూ డిమాండ్ చేస్తూ, మౌలిక సమస్య అయిన భూమి కోసం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం గ్రామీణ, ఆదివాసి ప్రజలు కార్మిక వర్గంతో కలిసి పోరాట బాట పట్టాలి. సెల్ : 9885983526

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు