- అవమానాలపై అధికార, ప్రతిపక్షం వాగ్వాదం
- రెండో రోజూ సమావేశాలు కొనసాగని వైనం
- స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
- మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పట్టు
- 22ఏపై చర్చకు బీజేపీ డిమాండ్
విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు రెండో రోజూ రసాభాసగా మారాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో సభ వాయిదా పడింది. ముందుగా మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కోరగా, సభాపతికి జరిగిన అవమానం సంగతి ఏమిటని కాంగ్రెస్ నిలదీసింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ వైఖరిని తప్పుపట్టారు. మీ సభ్యులకు జరిగిన అవమానంపై మాట్లాడుతున్న హరీశ్ రావు, తనకు, తన తల్లికి జరిగిన అవమానం గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. సమావేశం ప్రారంభం కాగానే తమ మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును స్పీకర్‌గా కనీసం మీరు స్పందించకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ మండిపడింది. తమపై దాడి జరిగిందని మా మహిళా సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే… మా సభ్యులపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపిం చారు. ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదని, అందుకే పోలీసులను అడ్డంపెట్టుకుని మా సభ్యులపై దాడి చేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని, అందువల్ల సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే స్పీకర్‌కు సంబంధించిన విషయంలో ఎమ్మెల్సీ మధు క్షమాపణ చెప్పారని, అయినా కూడా వారి పై కేసులు పెట్టి అరెస్టు చేశారని, ఇంకా ఎన్ని శిక్షలు వేస్తారని నిలదీశారు. స్పీకర్ స్పందిస్తూ సభ్యులపై చేసిన దాడి ఘటనపై తాము ఇప్పటికే నివేదిక కోరామని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు శాంతించకపోవడంతో సహనం కోల్పోయిన స్పీకర్ ఘాటుగా స్పందిస్తూ నా తల్లికి జరిగిన అవమానం మీకు పట్టదు… ఎందుకంటే ఆమె నాకు తల్లి అయినందున… ఇదేం పద్ధతి మీకు జరిగితే అవమానం మాకు జరిగితే కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తదితర కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ మహిళా సభ్యులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ముందు సభాపతికి జరిగిన అవమానంపై విచారం వ్యక్తం చేస్తారనుకున్నామని, కానీ ఇలా వ్యవహరిస్తోం దని అనుకోలేదని అన్నారు. ఒక సీనియర్ సభ్యునిగా సభలో ఉన్న హరీశ్ రావు… నిన్న పక్కన మహిళా సభ్యులు, పోలీసులు ఉన్నారని కూడా చూడకుండా చొక్కాలు విప్పారని దుయ్యబట్టారు. అసలు వీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు. అదే సమయంలో గేటు వద్ద అంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న సమయంలో మహిళా సభ్యులను… ఆ పార్టీ సభ్యులు ముందుకు ఎలా నెట్టారని నిలదీశారు. వారిని పక్కకు తప్పించా ల్సిన తోటి సభ్యులే మహిళా సభ్యులను ముందుకు నెట్టారని, ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న చెలెల్లిని బయటకు పంపి కన్నీరు పెట్టించిన వారికి మహిళల కన్నీరు గురించి ఏం తెలుస్తోందంటూ వ్యాఖ్యానించారు. అలాగే పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని చెబుతున్న బీఆర్ఎస్ సభ్యులు… వారు పోలీసులపై చేసిన దాడి సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారు కూడా మహిళా పోలీ సులపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిం చారు. గతంలో పోలీసులతో ఇతరులపై కేసులు పెట్టించి… ఇప్పుడు వారిపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు, బీజేపీ సభ్యులు 22ఏ ఎప్పుడు చర్చిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ… బీఆర్ఎస్కు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్… కాంగ్రెస్‌కు క్షమాపణ చెప్పి ఈ అంశం ఇక్కడితో ముగించాలని సూచించారు. ఆరు నెలల తర్వాత ప్రారంభమయిన ఈ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా రెండు పక్షాలు సమయం వృధా చేయకుండా సంయమనం పాటించాలని సూచించారు. 22ఏ, భూకబ్జాలపై విచారణ విషయంలో సభలో చర్చ జరగాల న్నారు. చివరకు పోడియం వద్దకు ప్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు దూసుకురావడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. రెండు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభాపతి సభను వాయిదా వేశారు.
స్పీకర్‌ను పరామర్శించిన
సీఎం, డిప్యూటీ సీఎం
శాసన సభలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్‌ను సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. శాసన సభ సమావేశాల తొలి రోజు సోమ వారం అసెంబ్లీ ఆవరణలో అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకుల విషయంపై చర్చించారు. మహిళా అధికారుల ఎదుట అంగీలు విపðకుని అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ తీరు పట్ల వారి మధ్య చర్చ జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఏకంగా స్పీకర్‌ని అసభ్యకర పదజాలంతో దూషించి… మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరి చేలా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. శాసన సభ ఎదుట జరిగిన ఈ పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించటంతో స్పీకర్ కంట తడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పీకర్‌కు తెలియజేశారు.


