Sunday, April 12, 2026
Homeసమృద్ధిగా యూరియా

సమృద్ధిగా యూరియా

- Advertisement -

. రాష్ట్రంలో 80 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వలు
. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
. కాకినాడ పోర్టుకు వచ్చిన నౌకలో 7 ర్యాక్‌లు కేటాయింపు
. ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం ఆరోగ్య పరిస్థితులపై సీఎం సమీక్ష

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామన్నారు. పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు. సోమవారం ఆర్టీజీఎస్‌ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు, కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా లభ్యత సమృద్ధిగానే ఉందని, దానిని సక్రమంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో పది రోజుల్లో 23,592 మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు. ఆర్టీజీఎస్‌ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. సోమవారం కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 రేక్‌ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రానికి అదనంగా మరో 50 వేల మెట్రిక్‌ టన్నులు కేటాయించినట్లయింది. వచ్చే రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువుల పంపిణీకి సంబంధించి భరోసా ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు, కౌలు రైతులు ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా… నిల్వ చేసి పెట్టుకోకుండా చూడాలని సీఎం అన్నారు. అలాగే ఎరువులను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేయకుండా నియంత్రించాలని స్పష్టం చేశారు. తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు.
ఉల్లి కొనుగోళ్లు… నిల్వలపై దృష్టి పెట్టండి
కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు… మద్దతు ధర పైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉల్లి క్వింటాలుకు రూ.1,200 ధర తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఆ ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఉల్లి పంట ఉత్పత్తి అంచనాల మేరకు నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లతో పాటు మార్కెట్‌ కూడా తరలించాలని ఆదేశించారు.
పౌర సేవల్లో సంతృప్త్తి స్థాయికే ప్రాధాన్యత
ప్రభుత్వ విభాగాలు అందించే వివిధ పౌరసేవల్లో సంతృప్త స్థాయిపై ఇక ప్రతీవారం సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్‌, ఆర్టీసీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ఇలా వేర్వేరు శాఖల్లో అందిస్తున్న సేవలపై ఇంకా సంతృప్త స్థాయి పెరగాలన్నారు. ప్రజల నుంచి వ్యక్తం అయ్యే అభిప్రాయాలను డేటా అనలటిక్స్‌ ద్వారా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఆర్టీజీఎస్‌ నుంచి నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ కె.విజయానంద్‌ సహా వ్యవసాయ శాఖ, వైద్యారోగ్య శాఖ, మార్కెటింగ్‌, ఐటీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
యూరియా సరఫరాపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌
వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి యూరియా సరఫరా, లభ్యతపై రైతులకు నమ్మకాన్ని కల్పించాలని సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్సులో ఆదేశాలు జారీ చేశారు. టెలికాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు