ఆంధ్రప్రదేశ్ సమగ్ర వికాసానికి, పల్లెసీమల ఆర్థిక ప్రగతికి వెన్నెముకలా నిలవాల్సిన సహకార వ్యవస్థ నేడు ఘోరమైన నైతిక, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రైతన్నకు కష్టం వస్తే కొండంత అండగా నిలవాల్సిన పవిత్రమైన వ్యవస్థ, కొందరు ఉన్నతాధికారుల అపరిమిత అధికార దాహానికి, అడ్డగోలు అక్రమార¨నకు వేదికగా మారడం సమస్త సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు చుట్టూ తిరుగుతున్న వందల కోట్ల అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రజాధనం దారిమళ్లింపు ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సహకార శాఖ కమిషనర్, పాడి అభివృద్ధి కమీషనర్, వాణిజ్య పన్నుల కమిషనర్ వంటి కీలక పదవులను ఏకకాలంలో చేతిలో పెట్టుకుని, వ్యవస్థలను నిలువునా కొల్లగొట్టారని ఒంగోలుకు చెందిన ఈదర మోహన్ బాబు కేంద్ర హోంశాఖకు పంపిన సుదీర్ఘ ఫిర్యాదు ఈ మహా దోపిడీ కోణాలను బహిర్గతం చేసింది. ఉన్నత పరిపాలనా హోదాలో ఉండి, న్యాయస్థానాల నుంచే తీవ్ర నిరసనను ఎదుర్కోవడం పరిపాలనా యంత్రాంగానికి పట్టిన చెదలుకు నిదర్శనం. 2026 ఏప్రిల్ 23, 27 తేదీల్లో ఏపీ హైకోర్టు అహ్మద్ బాబు పరిపాలనా తీరుపై, కోర్టుకు రికార్డులను దాచడంపై, ఉద్యోగుల పట్ల ప్రదర్శించిన దౌర¨న్యపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తూ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) కు సమగ్ర విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన సర్వీస్ నిబంధనల ఉల్లంఘన కింద సస్పెన్షన్ లేదా డిస్మిసల్ దాకా వెళ్లే తీవ్రమైన అంశాలివని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోంది.పాడిరైతుల సంక్షేమం పేరుతో తెరపైకి తెచ్చిన ‘జగనన్న పాల వెల్లువ’ (జెపివి) పథకం అహ్మద్ బాబు హయాంలో వ్యక్తిగత కామధేనువుగా మారింది. ఎలాంటి శిక్షణ లేకుండా, అసలు పాల ఉత్పత్తి లేని ప్రాంతాల్లో సైతం బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసి, యంత్రాల కొనుగోలు, వార్షిక నిర్వహణ (ఎఎమ్సి) కాంట్రాక్టుల్లో తమ అనుకూల వెండర్లతో నిబంధనలకు విరుద్ధమైన రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నాసిరకం యంత్రాలను కొనుగోలు చేసి, అవి మాటిమాటికీ పాడవుతుంటే రిపేర్ల పేరుతో కోట్ల రూపాయల ఫేక్ బిల్లులు సృష్టించారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ డెయిరీ ఆస్తులను నామమాత్రపు లీజులకు అప్పగించి, పశుసంవర్ధక శాఖ సిబ్బందిని ఉచితంగా వాడుకుంటూ కోట్ల రూపాయలు దారిమళ్లించారనే ఆరోపణలు రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డిసిసిబి) లలో జరిగిన దాదాపు రూ. 4,500 కోట్ల భారీ ఆర్థిక అక్రమాలకు, నిధుల గోల్‌మాల్‌కు ఈ అధికారి అభయహస్తమే కారణమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పిడిసిసిబి) లో జరిగిన రూ.200 కోట్ల కుంభకోణంపై ముగ్గురు సభ్యుల కమిటీ ప్రాథమిక ఆధారాలు సాధించి సెక్షన్ 51 విచారణకు ఆదేశిస్తే, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న విచారణాధికారినే రక్షణ కవచంలా నిలిపారు. చివరికి ప్రభుత్వం ఆ అధికారిని మార్చి వేరే అధికారిని వేయాలని ఆదేశించినా, ఆ ఆర్డ్ర్లను పక్కన పడేసి విచారణను తొక్కిపెట్టారంటే అక్రమార్కుల నుంచి ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో ఊహించుకోవచ్చు. కాకినాడ డిసిసిబిలోనే నకిలీ రైతులు, బోగస్ రికార్డుల పేరిట రూ. 700 కోట్లకు పైగా నిధులు స్వాహా అయ్యాయని ఆడిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్ నిధులతో చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ఈ దోపిడీ వదల్లేదు. ‘కోడ్ ట్రీ సొల్యూషన్స్’ అనే తన సన్నిహితుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కట్టబెట్టి కోట్ల రూపాయల కమీషన్‌లు పిండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ప్యాక్స్‌లో కేవలం రూ.2,000 అయ్యే విద్యుత్ పనులకు రూ.25,000 చొప్పున పదింతలు బిల్లులు పెంచి దోచుకున్నారు. ఎం.పి.ఎఫ్.సి గోదాముల నిర్మాణంలో కొండలు, స్మశానాల్లో నాసిరకం గోదాములు కట్టించి, నిర్మాణం పూర్తికాకముందే, సొసైటీలకు అప్పగించకుండానే కాంట్రాక్టర్లకు 90% పేమెంట్లు విడుదల చేసి కమీషన్‌లు గుంజారు. ఫలితంగా ఇవాళ వందలాది ప్యాక్స్ లు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసి నియంత్రణ, ఆర్థిక, పర్యవేక్షణ అధికారాలన్నింటినీ తన వద్దే కేంద్రీకరించుకోవడానికి ఈ అధికారి సర్వశక్తులూ ఒడ్డారు. ఏకకాలంలో నాలుగు సంస్థలకు పర్సన్-ఇన్-ఛార్జ్గా ఉంటూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రతి సంస్థ నుంచి అలవెన్సులు, కార్ల అలవెన్సులు చట్టవిరుద్ధంగా క్లెయిమ్ చేశారు. ప్రతి ఆరు నెలలకోసారి టెక్నికల్ బ్రేక్ కోసం లీవ్ పెట్టి మళ్లీ వచ్చి అలవెన్సులు పొందే ‘రోటేషన్ స్కామ్’ నడిపారు. ఈ అక్రమ సంపాదననంతా హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించేందుకు, అక్కడే ఆస్తులు కొనేందుకు తరచూ విదేశీ పర్యటనలు చేశారనే బలమైన ఆరోపణలు కేంద్రానికి చేరిన పిటిషన్‌లో వ్యక్తమయ్యాయి.ఈ మొత్తం దందాను ఛేదించేందుకు కేంద్ర హోంశాఖ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డిఒపిటి) గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నిర్ణయం తీసుకున్నాయి. ఒంగోలు పిటిషన్‌పై స్పందించిన కేంద్ర హోంశాఖ , ఈ పిటిషన్‌ను తక్షణమే సీబీఐ విచారణ పరిధిలోకి తెచ్చేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటీ) కు 01-06-2026న అధికారిక కార్యాలయ మెమోరాండం (ఓఎం. నెంబర్ : 4283249) ద్వారా రీ-డైరెక్ట్ చేసింది. సీబీఐ ద్వారా సమగ్ర విచారణ, జెపివి, గోదాములు, కంప్యూటరీకరణ ప్రాజెక్టులపై ప్రత్యేక ‘ఫొరెన్సిక్ ఆడిట్’, సదరు అధికారి, కుటుంబ సభ్యుల ఆస్తులు, విదేశీ పర్యటనలపై విచారణ జరిపి, బినామీ ఆస్తుల జప్తునకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయినా ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి మిగిలే ఉంది. ‘సహకార వ్యవస్థకు పట్టిన చెదలును వదిలిస్తాం, దోచుకున్న 1,600 కోట్లు వసూలు చేస్తాం” అని బాధ్యతలు చేపట్టిన కొత్తలో వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన సింహగర్జనలు నేడు ఉత్త నీటిమూటలుగానే మిగిలిపోయాయా? 2019-24 మధ్య జరిగిన రూ. 6,000 కోట్ల మహా కుంభకోణంపై శాసనసభ వేదికగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యార్లగడ్డ వెంకట్రావు, బుర్ల రామాంజనేయులు నిప్పులు చెరిగినా, కూటమి ప్రభుత్వం సభా సంఘాన్ని నియమించి కమిటీలు వేసి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి ఎందుకు రికవరీ చేయలేకపోయారు? 13 జిల్లాల్లో సొంత పార్టీ నేతలే ఆధారాలతో సహా అక్రమార్కుల పేర్లు బయటపెడుతున్నా విచారణ కమిటీలు మారడం తప్ప, రైతు రక్తాన్ని తాగిన అక్రమార్కుల నుంచి పైసా రాబట్టలేకపోవడం వెనుక ఉన్న లోపాయికారీ ఒప్పందాలేమిటి?చిన్న రైతు పంట రుణం ఒక్క రోజు ఆలస్యమైతే చక్రవడ్డీలతో ముక్కుపిండి వసూలు చేసే వ్యవస్థ, వేల కోట్లు కొల్లగొట్టిన తిమింగలాల ముందు మోకరిల్లడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతికి కారకుడిగా, అక్రమాలకు అభయహస్తంగా నిలిచి ఇప్పుడు తీవ్రమైన సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అదే అధికారిని మళ్లీ అదే వ్యవస్థకు సారథిగా, ‘తిరుగులేని చక్రవర్తి’లా అదే సీటులో ఎలా కొనసాగిస్తారు? తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పీఠంపై ఉంటే విచారణలు పారదర్శకంగా ఎలా సాగుతాయి? రికార్డులు మాయం కాకుండా ఎలా ఉంటాయి? ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, సదరు అధికారిని తక్షణమే బాధ్యతల నుంచి తప్పించి, సీబీఐ విచారణకు పూర్తి సహకారం అందించాలి. దోచుకున్న ప్రతి పైసానీ కక్కించి, లూటీ అయిన ప్రజాధనాన్ని తిరిగి సొసైటీలకు, బాధిత రైతులకు జమ చేయాలి. మాటల ఆర్భాటం ఆపి, చేతల్లో నిజాయితీని నిరూపించుకోకపోతే సహకార వ్యవస్థను నమ్ముకున్న లక్షలాది మంది రైతన్నల ఆగ్రహజ్వాలల్లో అధికార పీఠాలు దహనమవ్వక తప్పవు.


