ఆర్వీ రామారావ్
ఆరుట్ల రామచంద్రా రెడ్డి తెలంగాణా సాయుధ పోరాటంలో ఓ బెబ్బులి. ఆయన ఒక అగ్ని శిఖ. తెలంగాణా ప్రజల జీవితాలను బుగ్గి చేసిన నిజాం పాలనను, భూస్వామ్య దోపిడీని అరికట్టడానికి జరిగిన సాయుధ పోరాటంలో రామచంద్రారెడ్డి దూకారు. ఆయన అన్న ఆరుట్ల లక్ష్మీ నరసింహా రెడ్డి, భార్య కమలా దేవి కూడా సాయుధ పోరాటంలో బందూకు పట్టిన వారే. సన్నిహితులు ఆయనను ఎ.ఆర్. అని పిలిచేవారు. నిజాం హయాంలో తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు లేవు కనక రామచంద్రా రెడ్డి ఉర్దూ మాధ్యమంలోనే చదువుకున్నారు. ఆ తరవాత భువనగిరిలో విద్యాభ్యాసం చేశారు. చదువుకునేందుకు భువనగిరి వెళ్లడం ఆయన తల్లిదండ్రులకు ఎంత మాత్రం ఇష్టంలేదు. ఆ తరవాత హైదరాబాద్‌లోని గోషామహల్ పాఠ శాలలో చదువుకున్నారు. ఆ తరవాత నాంపల్లి ఉన్నత పాఠశాలలో 1930లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ రోజుల్లో అందరిలాగే గాంధీజీ సత్యాగ్రహం, జాతీయ ఉద్యమంతోరామచంద్రా రెడ్డి ప్రభావితుడయ్యాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడం అనేక మందికి లాగే ఎ.ఆర్.ను కూడా కలత పెట్టింది. ఆ సమయంలో స్వదేశీ లీగ్ ఏర్పాటైంది. ఆ సమయంలో ఎ.ఆర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ. చదువుతున్నారు. గాంధీజీ సిద్ధాంతాల వల్ల ప్రేరణ పొంది ఎ.ఆర్. కూడా ఖద్దర్ ధరించడం ప్రారంభించారు. ఆయనకు మొదటలో పెళ్లి చేసుకోకూడదని ఉండేది. ఇంట్లో పెద్దల ఒత్తిడి వల్ల పెళ్లికి అంగీకరించారు. ఆలేరు మండలంలోని మంతపురి గ్రామానికి చెందిన రుక్మిణితో పెళ్లి ఖరారు అయింది. ఆమె ఏ.ఆర్.కు మేనమామ కూతురే. ఆధునిక భావాలు ఉన్నందువల్ల తాను పెళ్లి చేసుకోవడానికి ఎ.ఆర్. కొన్ని షరతులు విధించారు. వరకట్నం ఇవ్వకూడదు, ఆడపిల్ల, మగపెళ్లివారు పెళ్లిలో ఖద్దరు వస్త్రాలే వేసుకోవాలి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చదువుకోనివ్వాలి. పెద్దలు ఈ షరతులకు అంగీకరించక తప్పలేదు. పెళ్లి సమయంలోనే రుక్మిణి అనే పేరును కమలా దేవిగా మార్చేశారు. కమలా దేవి చటోపాధ్యాయ మీద అభిమానం కొద్దీ తన భార్యకు కమలా దేవి అన్న పేరు పెట్టారు. ఎక్కువ మంది చదువుకోవాలని, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలన్నది ఎ.ఆర్. అభిమతం. అప్పటికి ఆమె పెద్దబాలశిక్ష మాత్రమే చదివారు. ఆమెను ఎ.ఆర్. హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కానీ అప్పటికి హైదరాబాద్‌లో బాలికల వసతి గృహాలు లేవు. ఎ.ఆర్.ఒత్తిడివల్లే బాలికల వసతి గృహం ఏర్పాటైంది. ఆమె మెట్రిక్యులేషన్ దాకా చదువుకున్నారు. అదే సమయంలో ఆంధ్రమహాసభ ఏర్పడిరది. జోగీపేటలో ఆ మహాసభకు రావి నారాయణ రెడ్డి పాతిక మంది యువకులను వెంటబెట్టుకుని జోగీపేట దాకా సైకిళ్ల మీద వెళ్లారు. వారిలో ఎ.ఆర్.కూడా ఉన్నారు. ఆయన ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం మొదలు పెట్టారు. దేవరకొండ, ఖమ్మం, సిరిసిల్ల, షాద్ నగర్‌లో జరిగిన ఆంధ్ర మహిళాసభ సమావేశాల్లో ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ఆ క్రమంలోనే అంటరానితనాన్ని రూపుమాపడం కోసం కృషి చేశారు. భువనగిరి చుట్టుపక్కల ఉన్న 35 గ్రామాలకు చెందిన దళితులను తీసుకుని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రవేశించారు. అప్పటికి అది చాలా సాహసోపేతమైన పని. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు నిజాం ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి వందేమాతరం గేయం ఆలపించినందుకు చాలా మందిని కళాశాలల నుంచి బహిష్కరించారు. వారిలో ఎ.ఆర్. కూడా ఉన్నారు. ఈ బహిష్కరణవల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో చదువు కొనసాగించడం సాధ్యపడనందువల్ల జబల్ పూర్ వెళ్లి బి.ఎ. పూర్తి చేశారు. ఆ సమయానికి జాగీర్దార్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఆయన అన్నతో కలిసి ఎ.ఆర్. కట్టుబానిస విధానానికి వ్యతిరేకంగా పోరాడారు. గ్రంథాలయోద్యమం కూడా ఎ.ఆర్.ను ఆకర్షించింది. ఆయన గ్రంథాలయం నిర్మించాలనుకున్నారు. కానీ నిజాం అనుమతి సంపాదించడం దుర్లభం కనక రామానుజ కూటం పేర భవన నిర్మాణం ప్రారంభించి కేవలం రెండు నెలల సమయంలో పూర్తి చేశారు. దీనికి ఆయన జన్మించిన కొలనుపాక గ్రామ ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉండేది. లక్ష్మీ చంద్ మద్దతుతో జైన మందిరం ఆవరణలో బాలికల పాఠశాల కూడా ప్రారంభించారు. బాలికల విద్యమీద ఎ.ఆర్.కు అంతటి నిబద్ధత ఉండేది.
ఈ లోగా కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చింది. గెరిల్లా యుద్ధ తంత్రంలో విజయవాడలో ఎ.ఆర్.శిక్షణ పొందారు. ఆ తరవాత భువనగిరి ప్రాంతంలో 500 మందిని ఎ.ఆర్. సాయుధ పోరాటానికి సిద్ధం చేశారు. భువనగిరి నుంచి సిద్దిపేట దాకా సీపీఐ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. ఎ.ఆర్. అనేక గెరిల్లా షెడ్ లు నిర్మించారు. భార్య కమలా దేవితో కలిసి అనేక సంక్షేమ కార్యకలాపాలు కొనసాగించారు. 1948 సెప్టెంబర్ 17న లొంగిపోయిన తరవాత జనం జాగీర్దార్ల మీద దాడిచేస్తుంటే అమానుషంగా ప్రవర్తించకూడదని ఎ.ఆర్. నచ్చచెప్పారు. ముస్లిం మహిళల మీద, పోలీసుల మీద దాడి చేయకూడదని కూడా చెప్పారు. ఇది ఆయన సంస్కారానికి చిహ్నం. పోలీసు ఆక్షన్ తరవాత కమ్యూనిస్టు పార్టీ మీద కూడా నిషేధం విధించారు. ఏ.ఆర్., ఆయన భార్య అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అప్పటికి వారికి ఒక శిశువు ఉంది. నెలల వయసు మాత్రమే ఉన్న ఆ పసి బిడ్డను వదిలేసి అజ్ఞాతంగా ఉండిపోయారు. కానీ పోలీసులకు చిక్కిపోయారు. సాయుధ పోరాటం ముగిసిన తరవాత ఎ.ఆర్.ను జైలు నించి విడుదల చేశారు. 1953లో ఉప ఎన్నికలో రామన్నపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.