కవిత ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు: జూపల్లి
విశాలాంధ్ర – హైదరాబాద్ : ‘సిగ్గుందా’ అనే పదం కేటీఆర్‌కి ఇప్పుడు గుర్తు వచ్చిందా… ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు సిగ్గు అనే పదం గుర్తుకు రాలేదా అని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. మేం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిలతో కలిసి మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిశామని ఎమ్మెల్యేలు చెప్తున్నారని, స్పీకర్ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు. రూ. వేల కోట్లు అక్రమార్జన జరిగిందని కవిత చెబుతోందని, ఆమె ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు సిగ్గులేని పనులు ఎన్నో చేశారని ధ్వజమెత్తారు. పెగ్గులు పోసే వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చేప్పుడు సిగ్గు అడ్డు రాలేదా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం కూలిపోతుంది అని ఎలా మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరూ ఏ పార్టీలో చేరలేదు, ఎవరైనా పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాను కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లానని, అయితే తాను పార్టీ మారిన సందర్భం వేరని చెప్పారు. తెలంగాణ కోసం వెళ్లాను అంటే తప్పు చేసినట్టా, రాష్ట్ర పరిస్థితి చూసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు.


