Homeసుస్థిరాభివృద్ధికి బాటలు

సుస్థిరాభివృద్ధికి బాటలు

- Advertisement -

ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి పాలన
. త్వరలో రాష్ట్రానికి ఆరోగ్య కవచం
. ఆటో డ్రైవర్లకు దసరా కానుక రూ.15 వేలు
. వైసీపీ ఉనికి కోల్పోతోంది
. ‘సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాలాంధ్ర -సచివాలయం/ అనంతపురం: మనం పాలకులం కాదు… సేవకులమని ప్రజల దీవెనలతో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని, అవినీతి మన దరి చేరనీయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం అనంతపురం లో నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ రాజకీయాలు, ఎన్నికలు, ఓట్ల కోసం కాదని… 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను పునరుద్ధరించి, పరిపాలనను గాడిలో పెడుతున్నామని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని, గత తప్పులను సరిదిద్దుకుంటూ సుస్థిర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రకటనలు ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయన్నారు. కూటమిలోని మూడు పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అంకితభావంతో పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగు తమ్ముళ్లు, జనసేన, కమలదళం కలసికట్టుగా రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమష్టి కృషి రాష్ట్రానికి నూతన దిశానిర్దేశం చేస్తుందని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను గత పాలకులు హేళన చేశారని, ఇప్పుడు వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించామని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95శాతానికి పైగా స్ట్రైక్‌ రేట్‌ ఇచ్చి చరిత్ర తిరగరాశారని తెలిపారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలపై గతంలో విమర్శలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చంద్రబాబు అన్నారు .ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియ జేస్తున్నాయన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చివేతతో మొదలుపెట్టి, అవినీతి, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెట్టుబడులను తరిమేసి, పరిశ్రమలు రాకుండా చేశారని, 93 పథకాలను నిలిపివేశారని ఆయన విమర్శించారు. పేద, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు తాము సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేశామని చంద్రబాబు అన్నారు.
అన్నదాత సుఖీభవ, దీపం-2 విజయాలు రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తామని చెప్పామని, మొదటి విడతగా ఇప్పటికే 47 లక్షల మంది రైతులకు రూ. 3,173 కోట్లు జమ చేశామని అన్నారు. రైతన్నలకు యూరియా కొరత రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 1704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని వివరించారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఉచితంగా బస్సులో ప్రయాణించారన్నారు. ఉచిత బస్సు పథకం జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తోందన్నారు. ఈ పథకాలన్నీ ‘సూపర్‌ హిట్‌’ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించడం ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభుత్వం చూపుతున్న దృష్టి స్పష్టమవుతోందన్నారు. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.
ఆరోగ్య కవచం
రాష్ట్రంలోని త్వరలోనే సమగ్ర ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుందని, ప్రతి ఒక్కరికీ రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుందన్నారు. ఇది ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక పెద్ద ముందడుగని చంద్రబాబు అన్నారు. ఈ బృహత్తర పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. ఆరోగ్య బీమా పథకంతో పాటు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఆటో డ్రైవర్‌ లకు రూ.15 వేలు
ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారన్నారు. వీరందరికీ దసరా పండుగ రోజున ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే ‘వాహన మిత్ర’ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌ లకు రూ. 15,000 అందజేస్తామన్నారు.
అసెంబ్లీకి రాకుండా ‘రప్పా రప్పా’ రంకెలేంటి?
అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సీబీఎన్‌ అంటూ వైసీపీని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 10 నిమిషాల్లో పోలీసులు వస్తారన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదని, ప్రజలు మాత్రమే నన్నారు. అసెంబ్లీకి రాని వ్యక్తులు రాజకీయాలకు అర్హులా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఉనికి కోల్పోతోందన్నారు. పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్‌ మీడియా ఆఫీసులు తెరిచారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సిద్ధం సిద్ధం అని ఎగిరెగిరి పడ్డారని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో ప్రజలు వైసీపీ బెండు తీశారన్నారు. భూమి ఇవ్వగానే అది మెడికల్‌ కాలేజీ అయిపోదని, 17 మెడికల్‌ కాలేజీలు ఉంటే ఒక్కటే పూర్తయిందని చంద్రబాబు అన్నారు. గత పాలకులు మెడికల్‌ కాలేజీలకు పునాదులేసి వదిలేశారని… అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని తెలిపారు. మెడికల్‌ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కోరారు. అనంతపురం అభివృద్ధికి బ్లూప్రింట్‌ తయారు చేశామన్నారు. రాయలసీమ రాళ్ల సీమ కాదని రతనాల సీమని పేర్కొన్నారు. రాయలసీమలో శాశ్వతంగా కరవు నివారిస్తామన్నారు. రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. అందరి క్షేమం కోసం పీ4 తీసుకొచ్చామన్నారు. తన చివరి శ్వాస ఉన్నంతవరకూ పేదల బాగు కోసమే పనిచేస్తానని తెలిపారు. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సూపర్‌హిట్‌. ఏపీని అన్నింటా సూపర్‌హిట్‌ చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలిసభ కావడంతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, రాష్ట్ర మంత్రులు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సభకు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు