Homeస్తంభించిన భారత్‌

స్తంభించిన భారత్‌

- Advertisement -

. కదం తొక్కిన కార్మిక, ఉద్యోగ వర్గం
. మోదీ సర్కారు కార్మికకర్షకప్రజా వ్యతిరేక విధానాలపై పెల్లుబికిన నిరసనలు

. రోడ్డురైల్‌ రోకోలతో నిలిచిన రవాణా
. బెంగాల్‌లో స్వల్ప ఉద్రిక్తత: అరెస్టులు
. బీహార్‌లో ‘ఇండియా’ ర్యాలీచక్కాజామ్‌
. సార్వత్రిక సమ్మె విజయవంతం

న్యూదిల్లీ : కేంద్ర కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనాగ్రహం పెల్లుబికింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కొత్త కార్మిక చట్టాలు రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, కనీస వేతనం, కనీస పెన్షన్‌ అమలు తదితర డిమాండ్లపె కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలు కదం తొక్కాయి. మోదీ ప్రభుత్వ వినాసకర ప్రజారైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాయి. సమ్మె ప్రభావంతో దేశ వ్యాప్తంగా వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. రవాణా నిలిచిపో యింది. బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. కార్మికులు`కర్షకులు ఐక్యంగా గళమెత్తారు. రోడ్లను దిగ్బంధించారు. రైల్‌ రోకోలు నిర్వహించారు. ఇండియా ఐక్య సంఘటన అధ్వర్యంలో బీహార్‌లో చక్కా జామ్‌ జరిగింది. ఆ రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించారు. మోదీ విధానాలను, ఎన్నికల సంఘం వైఖరిని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), కాంగ్రెస్‌, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎండగట్టారు. ప్రజలకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా అనుసరించే విధానాలను వ్యతిరేకించారు. మోదీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగట్టారు. నాలుగు లేబర్‌ కోడ్ల రద్దు, ఎంఎస్‌పీకి చట్టబద్ధత తదితర రైతులు, కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ 35 కోట్ల మందికిపైగా కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొన్నారు. రైతు సంఘాలతో పాటు బ్యాంకింగ్‌, రవాణా, ఇతర ప్రభుత్వ సేవల సంఘాల మద్దతుతో అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. పోస్టల్‌, మైనింగ్‌, నిర్మాణం, రవాణా రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు మద్దతిచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, వామపక్షాల తోడ్పాటుతో సార్వత్రిక సమ్మె అన్ని రాష్ట్రాల్లో జయప్రదం అయింది. న్యాయం కోసం, తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు, రైతులు డిమాండ్‌ చేశారు. తమ యూనియన్ల జెండాలతో కదం తొక్కారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, అసోం, కర్నాటక, జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్‌, నాగాలాండ్‌, తమిళనాడు, దిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, గుజరాత్‌, నాగాలాండ్‌, చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, త్రిపుర తదితర రాష్ట్రాల్లో కార్మికులు, రైతులతో పాటు కలిసి విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. అన్ని రంగాల ప్రజలు మద్దతిచ్చారు. వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్చంధంగా మూసివేశారు. ప్రజా రవాణా స్తంభించింది. బీహార్‌ ర్యాలీలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీ కంటే దీనస్థితి ఉందన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రజలు, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తోందని విమర్శించారు. అమెరికాకు తలొగ్గుతోందని దుయ్యబట్టారు. అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ మార్కెట్లు కుదేలవుతాయని, ముఖ్యంగా డెయిరీ, వ్యవసాయ రంగంపై ప్రభావం ఉంటుందని రాజా హెచ్చరించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకం కావాలని ప్రతిపక్షాలకు, ప్రజాస్వామ్యలౌకిక సంఘాలకు పిలుపునిచ్చారు. బీహార్‌ బంద్‌తో రవాణా స్తంభించింది. రైల్‌ రోకోలు, రోడ్ల దిగ్బంధాలు సాగాయి. పట్నాలోని మహాత్మా గాంధీ సేతు వద్ద టైర్లు తగలపెట్టి ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపారు. సచివాలయ హాల్ట్‌ రైల్వే స్టేషన్‌లో రైళ్లను నిరసనకారులు నిలిపివేశారు. అరారియా, పూర్నియా, కథిహార్‌, ముజఫర్‌పూర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో సమ్మె విజయవంతంగా సాగింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) కార్యకర్తలు అర్వాల్‌, జెహానాబాద్‌, దర్భంగాలో రోడ్లు దిగ్బంధించారు. టైర్లు తగలపెట్టి నిరసన తెలిపారు.
దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఏఐటీయూసీ అధ్వర్యంలో నిరసన జరిగింది. వందల సంఖ్యలో కార్మికులు కదం తొక్కారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. స్వాతంత్రానికి పూర్వం సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో నాలుగు లేబర్‌ కోడ్స్‌లు తేవడం వల్ల కార్మిక వర్గానికి అనేక హక్కులు అంటే 29 చట్టాలు రద్దు కాపడతాయని అందులో భాగంగా 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయని మహిళలకు రాత్రి వేళల్లో పనిచేయాలని నిబంధనలు వస్తున్నాయని అమర్‌జిత్‌ కౌర్‌ తెలిపారు.ఈ లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కేంద్రంలో ఎనిమిదవ వేతన సంఘం వెంటనే నియమించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగిస్తూ కార్పొరేట్‌ వర్గాల కొమ్ముకాస్తుందని కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందని అందులో భాగమే 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఇందువల్ల కార్మిక వర్గం అనేక హక్కులను కోల్పోయిందని రావుల వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
సార్వత్రిక సమ్మె కేరళలో విజయవంతం అయింది. అన్ని జిల్లాల్లో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వ విధానాలకు కార్మికులు, రైతులు, సామాన్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వినయ్‌ విశ్వం, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీ రాజేంద్రన్‌ పాల్గొన్నారు. ప్రజా పోరాటాలకు కేరళ కట్టుబడి ముందుకెళుతున్నట్లు నాయకులు ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో రాజ్‌ భవన్‌ వరకు ర్యాలీ జరిగింది. కొచ్చిలోని బీపీసీఎల్‌ వర్కర్లు ధర్నా నిర్వహించారు.
బెంగాల్‌ను వామపక్షాలు స్తంభింపజేశాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు మూసివేశారు. సమ్మె క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి బస్సు డ్రైవర్లు హెల్మెట్‌ పెట్టుకొని విధులు నిర్వర్తించారు. పశ్చిమ బర్దామన్‌లోని దుర్గాపూర్‌, ముర్షిదాబాద్‌లోని లాల్‌గోలా, డైమండ్‌ హార్బర్‌, ఉత్తర 24 పరగణాల్లో బరాక్‌పురÑ హుగ్లీలోని కోన్నగర్‌లో రైల్‌రోకో జరిగింది. బస్సులను నిరసనకారులు నడవనివ్వలేదు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. దీంతో పోలీసులు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి రైల్వే ట్రాక్‌లపై నుంచి నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో ఘర్షణలు జరిగాయి. కలకత్తా వర్సిటీ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన, జాదవ్‌పూర్‌లో వామపక్షాల అధ్వర్యంలో టైర్లను తగలబెట్టి నిరసన తెలపారు.ఉత్తర 24 పరగణాలలో రిలయన్స్‌ జూట్‌ మిల్లు ప్రవేశాన్ని కార్మిక నేతలు దిగ్బంధించారు. కొన్ని చోట్ల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అరెస్టు చేశారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తుంటే మమత సర్కార్‌ ఎందుకు అడ్డుకుంటోందని వామపక్ష నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని మమత సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా యధావిధిగా కొనసాగాలని ఆదేశించింది.
జమ్మూకశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా ఎరుపెక్కాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తూర్పు నుంచి పశ్చిమం వరకు ఒడిశా నుంచి గుజరాత్‌ వరకు సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మేఘాలయలో విద్యుత్‌ కార్మికులు, నాగాలాండ్‌లో ఎల్‌పీజీ బాటిలింగ్‌ ప్లాంట్‌ వర్కర్లు, చత్తీస్‌గఢ్‌లో భారత్‌ అల్లూమీనియం లిమిటెడ్‌ కార్మికులు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. అసోం నుంచి ఉత్తరాఖండ్‌ వరకు భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించారు. సముద్రంలో ఇండియన్‌ సీఫేర్స్‌ సైతం సమ్మెకు మద్దతు పలికారు. త్రిపుర స్తంభించిపోయింది. అక్కడి మార్కెట్లు మూతబడ్డాయి. వీధులు నిర్మానుష్యమయ్యాయి. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములయ్యారు. పంజాబ్‌, లూథియానా బస్టాండ్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తమిళనాడులోనూ భారీస్థాయిలో ఆందోళనలు, ప్రదర్శనలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధురౖౖె రైల్వే స్టేషన్‌ ఎదుట రోడ్‌ రోకో జరిగింది. ఈరోడ్‌లో రోడ్‌ రోక్‌ సందర్భంగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఫ్రీడం పార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేశారు. అసోంలో తేయాకు తోటల కార్మికులు, రవాణా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బస్సులు, ట్రక్కులు, వాణిజ్య వాహనాలు రోడ్డెక్కలేదు. గువహటిలో బస్సులతో పాటు ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర, ముంబైలో బ్యాంకు ఉద్యోగులు భారీ బ్యాక్‌ ర్యాలీ నిర్వహించారు. జార్ఖండ్‌లో మైనింగ్‌, బ్యాంకు రంగాల కార్మికుల అధ్వర్యంలో సమ్మె జరిగింది. రాంచీలో వామపక్షాలు, జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ సంయక్త అధ్వర్యంలో రెండు ర్యాలీలు జరిగాయి. కార్మిక కోడ్ల రద్దుతో సహా 17 డిమాండ్లను నాయకులు చేశారు. సైనిక్‌ మార్కెట్‌, కుట్చేరిలో ర్యాలీలు నిర్వహించారు. అల్బర్ట్‌ ఎక్కా చౌక్‌ వద్ద బహిరంగ సభ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర పాఠక్‌ మాట్లాడుతూ కార్మిక కోడ్ల రద్దు, ఒప్పందీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కనీస వేతనాల పెంపుదల కోసం డిమాండ్‌ చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు