Thursday, April 3, 2025
Homeసంపాదకీయంఅంతరిక్ష చరిత్రలోమరో మైలు రాయి

అంతరిక్ష చరిత్రలోమరో మైలు రాయి

భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ బుధవారం అర్థ రాత్రి అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకోవడం మానవ పట్టుదలకు నిదర్శనం. మామూలుగా అయితే వారు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో వారం రోజులే ఉండాల్సింది. కానీ సాంకేతిక కారణాల వల్ల తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంత సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చిక్కుపడి పోయినా వారు ఏ క్షణంలోనూ ధైర్యం కోల్పోలేదు. అక్కడ ఉన్నంత కాలం ఏవో పరీక్షలు, ప్రయో గాలూ చేస్తూనే ఉన్నారు. వారి దృఢ దీక్ష, చేసిన ప్రయోగాలు భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరిస్తాయి. ముందు అనుకున్నట్టు ఈ వ్యోమగాములు ఇద్దరూ ఎనిమిది రోజులే అంతరిక్షంలో ఉండాల్సింది. కానీ సాంకేతిక కారణాలవల్ల మరో 278 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ వ్యోమగాములు భూమి చుట్టూ 4,576 సార్లు ప్రదక్షిణం చేశారు. 195 మిలియన్‌ కిలోమీటర్ల మేర ప్రయాణించారు. సునీత విలియమ్స్‌ భారత సంతతికి చెందిన వారు. ఆమె తండ్రి దీపక్‌ పాండ్యా దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. సునీతా విలియమ్స్‌ సురక్షితంగా చేరుకున్నందుకు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అధిపతి వి.నారాయణన్‌ అభినందించారు. ఆమె పడ్డ కష్టం, గడిరచిన అనుభవం, చూపిన నైపుణ్యం, చేసిన ప్రయోగాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. వీరిని అంతరిక్షం నుంచి తీసుకు రావడానికి మరో వ్యోమ నౌకలో వెళ్లిన నిక్‌ హేగ్‌, రొస్కోస్మోస్‌, అలెగ్జాండరు గుర్బనోవ్‌ కూడా సురక్షితంగా తిరిగి వచ్చారు. 2023లో సునీత తన పూర్వీకుల స్వస్థలమైన గుజరాత్‌ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి మోదీని కలవలేదు. ఆమె సోహ్రాబుద్దీన్‌ కేసుతో సంబంధం ఉన్న హరేన్‌ పాండ్యాకు బంధువు. సునీత గుజరాత్‌లో గడిపిన ఒక రోజంతా హత్యకు గురైన హరేన్‌ పాండ్యా భార్య జాగ్రుటి పాండ్యాతోనే గడిపారు. అంతరిక్షంలో చిక్కుకు పోయినప్పటికి సునీత, బుచ్‌ విల్మోర్‌ ఏ మాత్రం ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. అపారమైన ఆశావాదం ప్రదర్శిం చలేదు. ఈ రెండూ లేనప్పుడు శాస్త్ర పరిశోధనలు ఎలా సఫలమవుతా యిగనక. అంతరిక్షంలో దిగబడిపోయిన సమయాన్ని ఈ వ్యోమగాములు ఒక అవకాశంగా మార్చుకుని శాస్త్ర ప్రయోగాల్లో నిమగ్నమయ్యారు. గమనించవలసిన విషయం ఏమిటంటే మన దేశంలో సకల వ్యవహారా లను, కడకు శాస్త్ర ప్రయోగాలనూ మోదీ ఘనతగా మలచడానికి ప్రయత్నిస్తారు. కానీ సునీత, విల్మోర్‌ తిరుగు ప్రయాణంపై ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు నాసా వ్యాఖ్యాత రాబ్‌ నావియస్‌ ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా వ్యాఖ్యానం కొనసాగిం చారు. తొమ్మిది నెలల పాటు వ్యోమగాములిద్దరూ అంతరిక్షంలో ఉండ డం రికార్డులను బద్దలు కొట్టే వ్యవహారం ఏమీ కాదని రాబ్‌ వ్యాఖ్యానిం చారు. ఇంతకు ముందు కూడా అంతరిక్ష యాత్రికులు 289 రోజుల నుంచి 371 రోజులు అంతరిక్షంలో గడిపిన ఉదంతాలు ఉన్నాయని ఆయన విడమర్చారు. అంతరిక్షంలో మానవ సంచారం లేని రోజు ఒక్కటి కూడా ఉండదు. వచ్చే నవంబర్‌ లోనే అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో మనిషి ఉండడానికి సంబంధించి 25 ఏళ్లు పూర్తి కానున్నాయి. మన దేశమూ అనేక అంతరిక్ష ప్రయోగాలు చేసింది. మోదీ అధికారంలోకి వచ్చే దాకా ఇవన్నీ కేవలం అంతరిక్ష పరిశోధకులకు పరిమితమైన అంశాలుగానే ఉన్నాయి. రాజకీయ నాయకుల హడావుడి ఎక్కడా కనిపిం చలేదు. కానీ మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత శాస్త్రవేత్తల సాఫల్యాన్ని కూడా మోదీ ఘన విజయంగా చెలామణి చేయడం మొదలైంది.
2019 ఆగస్టు 20వ తేదీన చంద్రయాన్‌ 2 ప్రయోగం జరిగిన సమయాన్ని గుర్తు చేసుకుందాం. అప్పుడు చంద్రయాన్‌ ప్రయోగం జరగడాన్ని మోదీ తన సొంత ప్రచారం కోసం మహత్తర అవకాశంగా వినియోగించుకున్నారు. చంద్రయాన్‌ ప్రయోగాన్ని దేశ వ్యాప్తంగా ఉత్సాహపూరిత అంశంగా మార్చేశారు. శాస్త్ర విజయాలపై గర్వించడం వేరు. ఇది తమ ప్రతాపమే అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం వేరు. కానీ చంద్రయాన్‌ 2 ప్రయోగం మోదీ ఘనత అని ప్రచారం చేశారు. చంద్రయాన్‌ 2 ప్రయోగ సమయంలో ఇస్రో కెమెరాలు ప్రధానమంత్రి మోదీ ముఖాన్ని చూపించడం మీద ఎక్కువ శ్రద్ధ చూపాయి. చంద్రయాన్‌ 2 ప్రయోగం విఫలమైంది. ఆ రోజు ప్రయోగ వైఫల్యం గురించి అప్పటి ఇస్రో అధిపతి శివన్‌ ప్రధానమంత్రి మోదీకి వివరిస్తున్న దృశ్యాలు పదే పదే చూపించారు. శివన్‌ బుజం మీద చేయి వేసి శివన్‌ను అనునయి స్తున్న దృశ్యాలూ ప్రధానంగానే చూపించారు. చంద్రయాన్‌ ప్రయోగ సమయంలో వెళ్లకూడదని కూడా మోదీకి సలహా ఇచ్చారు. కానీ మోదీకి ప్రచారార్భాటం ఎక్కువ కనక వెళ్లనే వెళ్లారు. ప్రధానమంత్రే స్వయంగా ప్రయోగ సందర్భంలో హాజరైనప్పుడు ప్రయోగ విశేషాలు చూపడం మీద దృష్టి కేంద్రీకరించకుండా మోదీ ముఖారవిందాన్ని పదే పదే చూపడానికే కెమెరాలను వినియోగించుకున్నారు. మోదీ శివన్‌ను ఓదార్చడంతో సరిపెట్టుకోలేదు. చంద్రయాన్‌ ప్రయోగ వైఫల్యానికి బాధ్యత తనదే అని నిఖిల్‌ కామత్‌కు ఇచ్చిన పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. దీన్ని సునీత, విల్మోర్‌ అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్నప్పటి ప్రత్యక్ష ప్రసారంతో పోల్చి చూడొచ్చు. ఆ సందర్భంలో ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యాత ఒక్క సారి కూడా ట్రంప్‌ పేరు కానీ ఎలాన్‌ మస్క్‌ పేరుగానీ ఎత్తనే లేదు. నిరంతరం ఆ వ్యోమ నౌక భూమికి చేరుకుంటున్న వైనం గురించే చెప్పారు. చంద్రయాన్‌ వైఫల్యం మోదీ తన ఖాతాలో ఎందుకు వేసుకున్నారో తెలియదు. అది సఫలమై ఉంటే మరెంత హడావుడి చేసే వారో! చంద్రయాన్‌ వైఫల్యం రాజకీయ, పరిపాలనా పరమైన వైఫల్యం కాదుగా! మన అంతరిక్ష పరిశోధనల్ల్లోనూ అనేక వైఫల్యాలున్నాయి. వాటికి బాధ్యత తమదేనని అప్పటి ప్రధానమత్రులెవరూ చెప్పలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలవల్ల షేర్‌ మార్కెట్‌లో జనం లక్షలు కోట్లు కోల్పోతున్నప్పుడు, మంటల్లో నెలల తరబడి అగ్ని జ్వాలలు చెలరేగుతున్నప్పుడు వాటికి మోదీ బాధ్యత స్వీకరించలేదుగా. నిజానికి అవి రాజకీయ, పరిపాలనా పరమైన వైఫల్యాలు. వీటి బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాధినేతగా మోదీదే. కానీ అలాంటి సందర్భాలలో ఆయన బాధ్యత నుంచి తప్పించుకుంటారు. చంద్రయాన్‌ 3 ప్రయోగిస్తున్నప్పుడు మోదీ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అయినా మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రయోగంలో భాగస్వాము లయ్యారు. త్రివర్ణ పతాకాన్ని అటూ ఇటూ ఊపుతూ కనిపించారు. ఆ సమయంలోను ఇస్రో కెమెరా సగం తెరమీద చంద్రయాన్‌ ప్రయోగాన్ని, మరో సొగం మోదీ జెండా ఊపడాన్ని చూపించింది. చంద్రయాన్‌ ను విజయవంతంగా ప్రయోగించిన క్షణంలోనూ మోదీ ముఖమే చూపించారు. ఈ ప్రయోగం సఫలం కావడం అమృత కాలంలో కురిసిన అమృత వర్షం అని ఉపన్యాసమూ ఇచ్చారు. మోదీ దృష్టిలో కాదేదీ ప్రచారార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు