- గ్రూప్-1 నియామకాల్లో నిబంధనలు ధ్వంసం
- ప్లంబర్లు, డ్రైవర్ల చేతుల్లో అభ్యర్థుల జవాబు పత్రాలు
- హాయ్లాండ్‌లో 84 రోజులపాటు పేపర్లు
- బాధ్యులపై కఠిన చర్యలు
- ఏపీపీఎస్‌సీని ప్రక్షాళన చేస్తాం
- అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర – సచివాలయం: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో ఊహకూక్కడా అందని స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో నిబంధన 344 కింద చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించాల్సిన అత్యున్నత అధికారుల ఎంపిక ప్రక్రియలో గత పాలకులు బరితెగించి వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడిన ఏపీపీఎస్‌సీ విశ్వసనీయతను దెబ్బతీస్తూ వ్యవస్థలను పూర్తిగా విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలను అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో దిద్దించారని సీఎం మండిపడ్డారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు చేయాల్సిన మూల్యాంకనాన్ని ఎలక్రీట్షియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులు, నిరుద్యోగులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్లతో చేయించారని శాసనసభకు వెల్లడించారు. మొత్తం 158 మంది ప్యానెల్ను ఎంపిక చేసి అందులో 72 మందికి మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని… వారిలో 25 మంది అనధికారికంగా నియమితులైన వారేనని తెలిపారు. ?మరో 66 మంది ఎవాల్యుయేటర్లు అసలు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే జవాబు పత్రాలు దిద్దారని సభ దృష్టికి తెచ్చారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను కూడా పోలీసు ఎస్కార్ట్‌తో భద్రంగా తరలిస్తారని…అలాంటిది రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని నడిపే అధికారుల మూల్యాంకనంలో భద్రతను గాలికి వదిలేశారని సీఎం విమర్శించారు. డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, కోర్టును తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేశారన్నారు. ఏపీపీఎస్‌సీ స్రాట్ంగ్ రూమ్ నుంచి జవాబు పత్రాలను అనధికారికంగా తరలించి 84 రోజుల పాటు ‘హాయ్లాండ్’ ప్రైవేట్ రిసార్ట్‌లో ఉంచారని చెప్పారు. హాయ్లాండ్‌లో మూల్యాంకనం కోసం రూ.1.19 కోట్ల విలువైన పనులకు ఉత్తర్వులు ఇచ్చారని, లాజిస్టిక్స్ కోసమే రూ.1.14 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.
వాట్సప్లలో పేపర్లు…
ప్రైవేటు వ్యక్తుల ల్యాప్టాప్లకు మూల్యాంకన వివరాలను పంపించారని, పీడీఎఫ్ జవాబు పత్రాలను ప్రైవేటు ఈ-మెయిళ్లు, గూగుల్ డ్రైవ్, వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా షేర్ చేశారని సీఎం తెలిపారు. గౌతమ్ సవాంగ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ పేరుతో 49 వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్లు ముద్రించారని వెల్లడించారు. మూల్యాంకనం చేసిన 734 ఓఎంఆర్ స్లిప్పులలో ఏకంగా 718 స్లిప్పులలో మార్పులు, చేర్పులు, ఓవర్రైటింగ్లు జరిగినట్లు గుర్తించారన్నారు. 21 స్లిప్పులపై అసలు ఎలాంటి సంతకాలు లేకపోవడం అక్రమాల తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఓఎంఆర్ స్లిప్పులలో వైట్నర్ వాడినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. గ్రూప్-1 పరీక్ష రాసిన ఒక అభ్యర్థినే అదే పరీక్షకు ఎవాల్యుయేటర్ ఎగ్జామినర్‌గా నియమించడం మరింత దారుణమన్నారు. మూల్యాంకనం జరిగే హాల్‌లో 17 రోజుల పాటు సీసీ కెమెరాలు లేకపోవడం, మొబైల్ ఫోన్లను అనుమతించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు.
బాధ్యులను వదిలిపెట్టేది లేదు…
సీఎం సీట్‌లో కూర్చుని నేరాలు చేసిన వ్యక్తి నేడు సభకు వచ్చి ప్రజలకు, యువతకు సమాధానం చెప్పే ధైర్యం లేక పారిపోయారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్ష పడుతుందనే భయం వ్యవస్థలో ఉండాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఏపీపీఎస్‌సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, అత్యంత పారదర్శకమైన మూల్యాంకన విధానం, బలమైన భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. మేధావులు, ప్రజల అభిప్రాయాలను స్వీకరించి రిక్రూట్మెంట్ వ్యవస్థలో మూలమట్టంగా సంస్కరణలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.


