ఇంధన నిల్వలన్నీ ఖాళీ
అమెరికా చర్యలతో సంక్షోభం
హవానా: క్యూబా అంధకారంలో చిక్కుకుంది. అక్కడి ఇంధన నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాలతో ద్వీపదేశంలో చమురు సంక్షోభం ముదిరింది. డీజిల్ లభించడం లేదని క్యూబా విద్యుత్, గనుల మంత్రి వెల్లడించారు. రాజధాని హవానా అంధకారంలో చిక్కుకున్నట్లు తెలిపారు. 20`22 గంటలు చిమ్మచీకటిలో ప్రజలు గడపాల్సి వస్తున్నదన్నారు. ఇప్పటికే ఆహారం, ఇంధనం, మందుల కొరత ఉండటంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. చాలా దశాబ్దాల్లో ఇలంటి దుస్థితి లేదన్నారు. అమెరికా దిగ్బంధంతో తమ దేశాన్ని సంక్షోభంలో కూరుకునేలా చేసిందని మంత్రి విసెంటే డీ లా ఓ విమర్శించారు. ‘మా వద్ద ఇంధనం లేదు. డీజిల్ కూడా లేదు’ అని ఆయన చెప్పారు. జాతీయ గ్రిడ్ క్లిష్ఠ పరిస్థితుల్లో ఉన్నదని, దేశంలో నిల్వలు ఖాళీ అయ్యాయని తెలిపారు. దేశీయ ముడి చమురు, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధనం ఆధారంగా జాతీయ గ్రిడ్ పని సాగిస్తోందని చెప్పారు. గత రెండేళ్లలో క్యూబా 1,300 మెగా వాట్ల సోలార్ పవన్ను ఏర్పాటు చేసుకుంది కానీ, ఇంధన కొరత వల్ల గ్రిడ్ అసమర్థతతో ఈ సామర్థ్యం దెబ్బతిన్నట్లు మంత్రి తెలిపారు. అయితే తమకు విక్రయిస్తామనే దేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునేందుకు క్యూబా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఉన్నత అధికారులు చెప్పారు. ఎవరి నుంచైనా ఇంధనం కొనేందుకు క్యూబా సిద్ధమన్నారు. క్యూబాకు అతిపెద్ద చమురు సరఫరా దేశాలుగా మెక్సికో, వెనిజులా ఉండేవి కానీ, ట్రంప్ తాజా చర్యలతో ఆ దేశాల నుంచి సరఫరా నిలిచిపోయింది. డిసెంబరు నుంచి రష్యా జెండాతో ఆనాటోలి కొలోడ్కిన్ అనే ఏకైక ట్యాంకర్ మాత్రమే ముడి చమురును క్యూబాకు సరఫరా చేసింది. దాంతో ఏప్రిల్లో ఈ ద్వీప దేశానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. క్యూబాలో ఇంధన సంక్షోభం గత నాలుగు నెలలుగా కొనసాగుతోంది. 10 మిలియన్ల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ఐక్య రాజ్య సమితి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ఆక్షేపించింది. క్యూబా ప్రజల అభివృద్ధి హక్కులను కాలరాయడమే కాకుండా వారికి ఆహారం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం కోసం ఉన్న హకT్కలను అమెరికా హరిస్తోందని విమర్శించింది.
అంధకారంలో క్యూబా
- Advertisement -


