Tuesday, December 24, 2024
Homeఅదానీ స్కామ్‌పై తగ్గేదేలె…

అదానీ స్కామ్‌పై తగ్గేదేలె…

. పార్లమెంటు ఉభయ సభల్లో ‘ఇండియా’ ఎంపీల ఆందోళన
. చర్చించకుండా పారిపోతున్న మోదీసర్కార్‌
. వాయిదాల పర్వం కొనసాగింపు

న్యూదిల్లీ : అదానీ ముడుపుల వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. ఇతర అంశాలను పక్కనబెట్టి అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠను మంటగలుపుతున్న అదానీ అవినీతి స్కామ్‌తో పాటు మణిపూర్‌ అల్లర్లు, సంభల్‌లో హింసపై చర్చకు ఇండియా ఐక్యసంఘటన పక్షాలు తగ్గేదేలే అన్న రీతిలో పట్టుబడుతున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లో ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించక పోతుండటం… మోదీ సర్కారు ఈ అంశాలపై చర్చకు సిద్ధంగా లేదన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. ఐదు రోజు శుక్రవారం ప్రారంభమైన గంటకే పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అదానీ అవినీతి అంశంతో పాటు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన, మణిపూర్‌ వివాదంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడిరది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభం కాగా… రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అదానీ స్కాం, మణిపూర్‌, సంభాల్‌ హింసాకాండ, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ పూజారి అరెస్టుపై చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన 17 నోటీసులను చైర్మన్‌ తిరస్కరించారు. చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో సభను డిసెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ అవినీతి వ్యవహారంపై చర్చకు విపక్షాల డిమాండ్‌ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదానీ అవినీతి కుంభకోణంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ ఎంపి మాణికం ఠాగూర్‌ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్య ప్రజా ప్రాముఖ్యత, భారత పాలన, నియంత్రణ చట్టాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. దానిని తిరస్కరించిన స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12.00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు