Thursday, May 8, 2025
Homeఅమరావతికి చట్టబద్ధత

అమరావతికి చట్టబద్ధత

. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం
. ఆపరేషన్‌ సిందూర్‌కు సంఫీుభావం
. రాజధాని పనులపై సీఆర్‌డీఏ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధాని పనులను అర్ధాంతరంగా నిలిపివేసి విధ్వంసానికి పాల్పడడంతో... భవిష్యత్‌లో మరోసారి ఇలా జరగకుండా రాజధానికి చట్టబద్ధత తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ తీసుకురావడమే పరిష్కారంగా భావించింది. ఆ మేరకు సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది. దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆపరేషన్‌ సిందూర్‌ పేరు ఉందని మంత్రివర్గం అభిప్రాయపడిరది. తీరప్రాంత భద్రత, రక్షణరంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. విశాఖ, మచిలీపట్నం, నాగాయలంక వంటి ప్రదేశాల్లో భద్రత, కార్యాచరణపై, తీర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. ఇక వివిధ అంశాలపై మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. అ అమృత్‌- 2.0 కింద రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక మొదటి, రెండవ విడతలో గతంలో చేసిన సవరణలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంస్థల్లో 281 పనులను ఎస్‌ఎన్‌ఏస్పార్స్‌ ప్లాట్‌ఫాం ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ కింద చేపట్టడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించనున్నారు.
అ ఒక ఏజెన్సీ/వ్యక్తిని కాంట్రాక్టర్‌గా నమోదు చేసేందుకు బ్లాక్‌ పీరియడ్‌ ఐదు సంవత్సరాల నుండి పదేళ్లకు పెంపు.
అ చిన్న, మధ్య తరహా నీటిపారుదల వనరులకు సంబంధించి రూ.345.39 కోట్లతో 7174 ఆపరేషన్‌, నిర్వహణ పనులకు ఆమోదం.
అ వాణిజ్యేతర ప్రయోజనాల కోసం రైతులు తమ సొంత ఖర్చులతో చిన్న నీటిపారుదల చెరువుల నుండి మట్టి తవ్వకం, రవాణాకు అనుమతి.
అ రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్న ‘పారిశ్రామిక వివాదాల (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద పెండిరగ్‌లో ఉన్న ‘కార్మిక చట్టాలు (ఆంధ్రప్రదేశ్‌ నేరాల సమ్మేళనం కోసం సవరణ) బిల్లు, ‘ఫ్యాక్టరీల (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు, 2019’ ఉపసంహరణ ప్రతిపాదనకు ఆమోదం.
అ ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 14 వరకు నిషేధ కాలంలో సముద్ర చేపల వేట నిషేధ ఉపశమనంగా ప్రతి కుటుంబానికి అందజేస్తున్న రూ.10,000లను రూ.20,000లకు పెంచే పథకం పేరును ‘మెరైన్‌ ఫిషింగ్‌ బ్యాన్‌ రిలీఫ్‌’గా నామకరణం.
అ వైఎస్సార్‌ జిల్లా కొండాపూర్‌ మండలం కె.బొమ్మేపల్లిలో మొత్తం 191.64 ఎకరాల భూమిని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ద్వారా 1000 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ స్థాపించడానికి కౌలు ప్రాతిపదికన కేటాయించడానికి ఆమోదం. ఎకరానికి సంవత్సరానికి రూ.31 వేల కౌలు రేటుతో, ప్రతి రెండేళ్లకు 5 శాతం పెరుగుదలతో మొత్తం 46 సంవత్సరాలకు అనుమతి.
అ డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన (మం) చిర్రయనంలో సర్వే నెం.1లో గల ఐదెకరాల ప్రభుత్వ భూమిలో పీతల హ్యాచరీ స్థాపించడానికి మార్కెట్‌ విలువ చెల్లింపుపై ఏడాదికి ఎకరానికి రూ.2.50 లక్షల లీజు ప్రాతిపదికన 15 ఏళ్ల కాలపరిమితితో కేటాయింపు.
అ విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నెం.101/1లో గల 18.70 ఎకరాల ప్రభుత్వ భూములను బీచ్‌ రిసార్ట్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీకి బదిలీ.
అ చిత్తూరు జిల్లా కుప్పం (మం) పాలర్లపల్లెలోని సర్వే నెం.221లో గల 18.70 ఎకరాల ప్రభుత్వ భూమి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కేటాయింపు.
అ టీటీడీలో అర్బన్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయడానికి నూతనంగా 8 పోస్టుల కల్పనకు మంత్రిమండలి ఆమోదం.
అ పర్యాటక విధానం 2024-29కి అనుబంధంగా తీసుకువచ్చిన ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానానికి గ్రీన్‌సిగ్నల్‌. ఈ విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు రూ.24.70 కోట్లు ప్రోత్సాహకాలుగా అందజేస్తారు.
అ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కార్యక్రమాలు, ఈవెంట్‌ల నిర్వహణ కోసం పర్యాటక అథారిటీకి రూ.78 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు.
అ ఏపీపీడీసీఎల్‌ సంస్థల ఆస్తులను నిరర్థక ఆస్తిగా ప్రకటించకుండా ఉండేందుకు, ఏపీ జెన్‌కో సంస్థ రూ.650 కోట్ల మధ్యకాలిక రుణం ఏపీపీడీసీఎల్‌కు అందించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం
అ గత సీఆర్‌డీఏ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ… సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూముల పునః సమీక్ష విషయంలో మంత్రుల బృందం 17వ సమావేశంలో చేసిన సిఫార్సులను, అమరావతి భూ కేటాయింపు నిబంధనలపై కమిషనర్‌కు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమీక్ష ద్వారా భూ కేటాయింపుల్లో సమగ్రత, పారదర్శకత, సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడం ప్రధాన లక్ష్యం.
అ నెల్లూరుజిల్లా గుడ్లూరు మండలం రావూరుగ్రామంలో ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా పారిశ్రామిక హబ్‌ నిర్మాణం కోసం జరుపుతున్న భూ సేకరణకు పరిహారాన్ని ఎకరాకు రూ.4 లక్షలకు పెంపు.
అ ఏపీ మారిటైమ్‌ బోర్డు పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఓడరేవుకు సమీపంలో ఉన్న భూములను, ఏపీ ఎంబీ సేకరించిన, సేకరణ ప్రక్రియలో ఉన్న భూములను, భవిష్యత్తులో సేకరించబోయే భూములను, ప్రభుత్వ ఉప్పు భూములను పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు బదిలీ చేయడానికి ఆమోదం.
అ నెల్లూరు జిల్లా నెల్లూరు బిట్‌-2 గ్రామంలోని సర్వే నెం.2062-3లో గల 36 ఎకరాల భూమి వర్గీకరణను ‘పెన్నానది పొరంబోకు’ నుండి అసెస్డ్‌ వేస్ట్‌ డ్రైగా మార్చడానికి, కొత్త సర్వే నెం.2224 సృష్టించి భగత్‌ సింగ్‌ కాలనీ నివాసితులకు పట్టాలు మంజూరు చేసే సులభతర ప్రక్రియకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారధి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు