Monday, May 12, 2025
Homeఅర్ధాకలితో ఆవిరైపోమా…

అర్ధాకలితో ఆవిరైపోమా…

నిరాశ్రయుల వసతి గృహానికి నీలినీడలు

. పట్టించుకోని పాలకులు, అధికారులు
. ఆరు నెలలుగా నిర్వాహకులకు ఆదేశాలివ్వని వైనం
. కలెక్టర్‌ కరుణచూపాలని వృద్ధుల వేడుకోలు

విశాలాంధ్ర – పార్వతీపురం టౌన్‌ : మన్యం జిల్లా పార్వతీపురంలో నిరాశ్రయుల వసతి గృహానికి నీలినీడలు అలుముకుంటున్నాయి. ఎటువంటి ఆధారం లేని వృద్ధులు తల దాచుకునేం దుకు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ సౌజన్యంతో నిర్వహించ బడుతోంది. వృద్ధుల భోజన సదుపాయం కోసం ప్రతి ఒక్కరికి రూ. 50 చెల్లిస్తూ ఉండేది. 2019 నుంచి 2023 వరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో ఈ వసతి గృహం నడిచేది. నిత్యవసర వస్తువులు, తాగునీరు, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తూ గృహ నిర్వాహకులకు వేతనాన్ని చెల్లించేది. 2024 నుంచి మున్సిపాలిటీ నిర్వహిస్తూ భోజనం ఖర్చు మాత్రమే ఒక్కో వ్యక్తికి రూ.50 చెల్లించేది. ఇది ఇలా ఉండగా… గతంలో ఐఆర్‌పీడబ్ల్యుఏ సంస్థ అధ్వర్యంలో నడిచేది. సదరు సంస్థకు నిర్వహణ కాల పరిమితి ముగియడంతో ఈ వసతి గృహ నిర్వహణకు సెప్టెంబరు 9, 2024న పార్వతీపురం పట్టణానికి చెందిన ఆదర్శ్‌ రూరల్‌ అండ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌కు చెందిన రేజేటి దయామని, ఆర్‌డీఎం అసోసియేషన్‌ పార్వతీపురంనకు చెందిన ఎస్‌.చరణ్‌ తేజ, నిర్మల ఆర్గనైజేషన్‌ విజయనగరం నకు చెందిన జీవీఎస్‌ ఎస్‌ఎన్‌ సన్యాసిరాజు దరఖాస్తు చేశారు. సెప్టెంబరు 30న జరిగిన మున్సిపల్‌ పాలకవర్గ సమావేశంలో కౌన్సిల్‌ సిఆర్‌ నెంబర్‌ 633 లో పొందుపరిచి పట్టణానికి చెందిన ఆదర్శ్‌ రూరల్‌ అండ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ కు ఆమోదం తెలిపారు. సదర సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించ మని గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాల యం వారు అక్టోబరు 17, 2024న సర్కులర్‌ పంపినప్పటికీ స్థానిక మున్సిపల్‌ అధికారులు నేటికీ దానిని అమలు చేయకుండా నిరాశ్రయుల వసతి గృహ నిర్వహణను గాలికి వదిలేశారు. సుమారు ఆరు నెలల నుంచి ఈ వసతి గృహ నిర్వహణకు బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేశారు. దీంతో వృద్ధులు బిక్కుబిక్కు మంటూ అర్ధాకలితో గడుపుతూ… అన్నదానం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా నిర్వహణ బాధ్యతలు ఆదర్శ్‌ రూరల్‌ అండ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కు అప్పగించమని పాలకవర్గం ఆమోదం తెలిపి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్న ఎందుకు అప్పగించలేదని ఆ సంస్థ నిర్వాహకులు రేజేటి దయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మున్సిపల్‌ కమిషనర్‌ గా విధులు నిర్వహించిన కోన శ్రీనివాస్‌ ఆర్‌డీఎంఏ ఆదేశాలతో తమ సంస్థకు బాధ్యత నిర్వహణ అప్పగించేందుకు సంతకాలు చేశారన్నారు. ఆయన బదిలీపై వెళ్లటంతో నేటి వరకు బాధ్యతలు అప్పగించకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత కమిషనర్‌ను అడగగా …మీరు ఎమ్మెల్యేను కలుసుకొని వచ్చిన తర్వాత ఆదేశాలు ఇస్తామని చెబుతున్నారని , ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా… ఈ విషయంలో తాను చేసేది ఏమీ లేదని కమిషనర్‌ ఆర్డర్‌ ఇస్తారని చెబుతూ రోజులు గడిపేయడం ఎంతవరకు న్యాయమని దయామని ఆవేదన చెందుతున్నారు. పాలకవర్గ సమావేశాలు లేకుండా ప్లానింగ్‌ కమిటీ అనుమతులతో ఇటీవల మున్సిపల్‌ కార్యాలయంలో ఒక మేస్త్రికి ఒక అటెండర్‌ కి కారుణ్య నియామకాలు ఇచ్చిన మున్సిపల్‌ కమిషనర్‌ పాలకవర్గం ఆమోదం పొంది, ఆర్డీఎంఏ ఆదేశాలు ఇచ్చినా వసతి గృహ నిర్వహణ బాధ్యత మాకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వసతి గృహ నిర్వహణ బాధ్యతను ఏ స్వచ్ఛంద సంస్థకు అప్పగించకుండా గత ఆరు నెలలుగా గాలికి వదిలేస్తే మా పరిస్థితి ఏమిటని నిరాశ్రయుల గృహంలో తలదాచుకుంటున్న వృద్ధులు కంటతడి పెడుతున్నారు. అర్ధాకలితో రెండు రోజుల క్రితం ఒక వృద్ధుడు ప్రాణాలను విడిచారని, తాము కూడా అర్ధాకలితో మరణించవలసిందేనా అంటూ ఈ గృహంలో తలదాచుకున్న 24 మంది వృద్ధులు మనోవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి మాకు ఆకలి తీర్చే మార్గాన్ని చూపెట్టాలని వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు