Homeఅంతర్జాతీయంఅవినీతి నియంత్రణకు ఏఐ మహిళా మంత్రి

అవినీతి నియంత్రణకు ఏఐ మహిళా మంత్రి

- Advertisement -

అల్బేనియా ప్రధాని వెల్లడి

టిరానా: ప్రపంచాన్ని ఏఐ కొత్త పుంతలు తొక్కిస్తున్న సంగతి తెలిసిందే. చివరకు మనిషి అవసరం లేకుండా అన్నీ ఏఐ చేసేస్తుందేమోనన్న రీతిలో పరిణామాలు మారుతున్నాయి. ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే తొలిసారి. అల్బేనియా దేశంలో ఈ ఏఐ మంత్రిని నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ఏడీ రమా ప్రకటించారు. సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించే ఈ మహిళా మంత్రి పేరు డీయెల్లా. ఆ దేశ భాషలో డియోల్లా అంటే సూర్చుడు అని అర్థం వస్తుంది. ప్రస్తుతం అల్బేనియాలో అవినీతి భారీ ఎత్తున సాగుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతో ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఈ ఏఐ మహిళా మంత్రిని నియమించింది. అల్బేనియా ఆన్‌లైన్‌ పోర్టల్‌ అయిన ఇ-అల్బేనియాను ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. దేశంలోని సుమారు 95 శాతం ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్‌ కమాండ్‌లు ఇవ్వడం దగ్గర నుంచి, దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి పనులన్నీ చేసేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటూ పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ ఏఐ మంత్రి దరఖాస్తులు, వాయిస్‌ కమాండ్‌లతో పాటూ అనేక కీలక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుంది. పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుందని అల్బేనియా ప్రధాని ఏడీ రమా తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను నిర్వహిస్తుందని చెప్పారు. అలాగే టెండర్లను మూల్యాంకనం చేయడంలోనూ ఎలాంటి పక్షపాతం చూపదని తెలిపారు. దీంతో పాటూ పబ్లిక్‌ ఫండ్‌ కేటాయింపులు పారదర్శకతతో జరిగేలా చూస్తుందట. ‘భౌతికంగా హాజరు కాని, వాస్తవంగా ఏఐ ద్వారా సృష్టించబడిన మొదటి కేబినెట్‌ సభ్యురాలు డీయొల్లా’ అంటూ ఎడీ రమా ప్రకటించారు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్బేనియన్‌ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో ఇది కీలక మలుపు అని ఆ దేశ మీడియా అంటుండగా… ఈ ఏఐ పాలన వల్ల చివరకు ఎదురుదెబ్బ తగలవచ్చేమోనని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు