Friday, February 21, 2025
Homeఆక్వాతో ఆర్థిక ఊతం

ఆక్వాతో ఆర్థిక ఊతం

. సాంకేతికత వినియోగంతో 30శాతం వృద్ధి
. సాగులక్ష్యం 10లక్షల ఎకరాలు
. కాలుష్యరహితంగా ఉండాలి
. అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం
. ఆక్వాటెక్‌ సదస్సులో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:సాంకేతికత వినియోగంతో అక్వారంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఈ రంగం గ్రోత్‌ ఇంజన్‌గా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నూతన సాంకేతిక పద్దతులతో ఈ రంగంలో నిలక డగా 30శాతం గ్రోత్‌రేట్‌ సాధ్యమేన న్నారు. అలాగే ఆక్వాలో ప్రకృతి సేద్యంతో ప్రపంచ వ్యాప్తంగా మన ఉత్పత్తులకు డిమాండ్‌ ఏర్పడుతుందని సీఎం చెప్పారు. ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఆక్వాలో కూడా ఆ తరహా విధానాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. జీఎఫ్‌ఎస్‌టీి అధ్వర్యంలో విజయవాడ మురళీఫార్చ్యూన్‌ హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఆక్వారంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలు, సమస్యలు, పరిష్కారాలు, విధానాలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చించారు. రైతులు, ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీల యజమానులు, ట్రేడర్లతో పాటు నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆక్వాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు గల అవకాశాలు, అధిగమించాల్సిన అవరోధాలపై చర్చించారు. రైతుల్ని చైతన్య పరిచేలా…టెక్నాలజీ వాడకం పెంచేలా మూడు రోజుల పాటు వివిధ అంశాలపై ఇక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సదస్సు ముగింపు సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం 4 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని, 2029 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని సీఎం ఆకాంక్షించారు. అయితే కాలుష్య రహితంగా ఆక్వా ప్రయాణం సాగాలన్నారు. ఆక్వాలో ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యానికి పరిష్కార మార్గాలు ఉన్నాయని, వాటిని రైతులు, ఉత్పత్తి దారులు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ సాగు వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలని, అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తానంటే మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆక్వాకు ప్రాధాన్యం అనేది తమ అభిమతమన్న సీఎం… నిబంధనల అమలు, పర్యావరణ పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఆక్వాసాగుకు రాష్ట్రం అనుకూలం
‘ఆక్వా రంగంపై నాకు ప్రత్యేక మైన శ్రద్ధ ఉంది.మన రాష్ట్రం ఆక్వా సాగుకు అత్యంత అనుకూలం. 2014-19 మధ్య కాలంలో నాడు ఆక్వా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. రాష్ట్ర జీవీఏ (స్థూల విలువ జోడిరపు)లో 8.8 శాతం ఆక్వా వాటాగా ఉంది. వియత్నాం వంటి దేశాల్లో మన కంటే తక్కువ ఉత్పత్తి ఉన్నా…వాల్యుయేషన్‌ లో వాళ్లు ముందు ఉన్నారు. వియత్నాం ఆక్వా ఉత్పత్తుల్లో 3.9 మిలియన్‌ టన్నుల ఎగుమతులతో 13 బిలియన్‌ డాలర్లు ఆర్జిస్తుండగా, మనం 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఎగుమతి చేస్తూ 3 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆర్జిస్తున్నాం. మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయి. మన ఉత్పత్తులను ప్రాసెస్‌ చేయడం ద్వారా మంచి ధరలు పొందవచ్చునన్నారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా పోత్సాహం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా రైతులు కూడా ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. ఆక్వా, హార్టికల్చర్‌, పామాయిల్‌, కోకో పంటల సాగుతో మంచి ఫలితాలు వస్తున్నాయని… రైతాంగం సాగులో మార్పులు చేయాలన్నారు. రానున్న రోజుల్లో దక్కే అవకాశాలను గుర్తించి దానికి అనుగుణంగా ఇప్పటినుంచే పనిచేస్తే ఫలితాలు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు