Homeఆగని నిరసనలు

ఆగని నిరసనలు

- Advertisement -

. గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యల దుమారం
. కాంగ్రెస్ సభ్యుల ప్రతిఘటన
. లోక్‌సభలో గందరగోళం

న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోందని, ప్రతిపక్ష నాయకుడిని సభలో కీలకాంశాలపై మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటు బుధవారం రసాభాస అయింది. ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. అధికార`విపక్షాల నినాదాలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తాయి. పదేపదే వాయిదా పడ్డాయి. చివరకు నిరసన హోరులోనే సభాపతులు ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నేపథ్యంలో లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించాల్సిన సమయానికి కొన్ని నిమిషాల ముందు లోక్‌సభను స్పీకర్ వాయిదా వేశారు. అయితే ఆయన రాజ్యసభలో గురువారం మాట్లాడతారు. లోక్‌సభ గొడవలతోనే ప్రారంభమైంది. ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయంగా దుమారం రేపుతున్న చర్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మాటలతోనే నిరసన తెలపాలని, చేతలతో కాదని (వెల్‌లోకి దూసుకెళ్లడాన్ని ఉద్దేశించి) అన్నారు. నిరసనల నడుమ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్ప్పుడు ప్రతిపక్ష సభ్యులు 2020 చైనాభారత్ ఘర్షణను లేవనెత్తారు. నినాదాల హోరులోనే భారత్అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. సభా హూందాతనాన్ని కాపాడాలని, బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించవద్దని ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ సూచించారు. ఆపై మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలు ఆపలేదు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ వ్యవసాయం, పాడి పరిశ్రమ ప్రయోజనాలను కాపాడినట్లు తెలిపారు. తుది ఒప్పందానికి ముందు రెండు వర్గాలు కొన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భోజన విరామం అనంతరం ఆయన రాజ్యసభలోనూ ఇదే అంశంపై మాట్లాడారు. మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతుండగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖడ్గే అడ్డుకున్నారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీని లోక్‌సభ, రాజ్యసభలో అవమానించడాన్ని ఖండించారు. లోక్‌సభ గురించి మాట్లాడలేను కానీ… రాజ్యసభలోనూ ఇదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇందుకుగాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ గురించి ప్రస్తావించేందుకు అనుమతి లేదు కాబట్టి ఖడ్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని జేపీ నడ్డా కోరారు. అంతకుముందు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖడ్గే ఆక్షేపించారు. రైతులు తిరుగుబాటు చేయొచ్చన్నారు. అందుకు దారితీసే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. దేశ సార్వభౌమత్వంపై దాడి… ట్రంప్ ఆధిపత్యంతో ప్రపంచంలో మన స్థానం ఏమిటని ఖడ్గే ప్రశ్నించారు. మోదీ హయాంలో సామాజిక న్యాయం లేదన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ఖడ్గే నిలదీశారు. ఎన్నో సంవత్సరాలుగా ఆరఎసఎస్‌లో మహిళా నాయకులే లేరన్నారు. అటు లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైనప్ప్పుడు టీడీపీ ఎంపీ హరీశ్ బాలయోగి మాట్లాడారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేను మాట్లాడాల్సిందిగా సభాపతి కష్ణ ప్రసాద్ తెన్నేటి సూచించగా… ఆయన గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ వారిపై రాసిన పుస్తకాలను ప్రస్తావించారు. జనరల్ ఎంఎం నరవణె స్వీయచరిత్ర గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో ప్రతి దాడికి దిగారు. దీంతో 349 నిబంధన కింద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తెన్నేటి సూచించారు. కానీ దూబే వినలేదు. ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో సభ వాయిదా పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బర్లాను కలిశారు. గాంధీ కుటుంబంపై దూబేను మాట్లాడనిచ్చేలా సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దూబే వ్యాఖ్యలతో నెలకొన్న గందరగోళంతో సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా పడింది. ఆపై పీపీ చౌదరి (బీజేపీ) మాట్లాడేందుకు నిలబడినప్ప్పుడు ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభను గురువారానికి సభాపతి వాయిదా వేశారు. పార్లమెంటు బయట కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యానికి అవమానం: ప్రియాంక
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. ఆయన తన వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అవమానిస్తున్నట్లు స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు.‘మోదీ ప్రభుత్వం అనుమతితోనే దూబే మాట్లాడారు. సభను రసాభాస చేయాలని ప్రభుత్వానికి ఎప్ప్పుడు అనిపిస్తే అప్ప్పుడు ఆయనను నిలబెట్టడం పరిపాటైంది. ప్రచురితమైన పుస్తకంలోని అంశాలను సభ ఎదుట ఉంచేందుకు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వడంలేదు. ఆ పుస్తకాన్ని ‘అమెజాన’ నుంచి కొనుగోలు చేశాం. అది నిబంధనలకు విరుద్ధం ఎలా అవుతుంది. దూబే ఏవో పుస్తకాల్లోని అంశాలను చదువుతుంటే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి పార్లమెంటుకు, సభాపతికి, ప్రజాస్వామ్యానికి, దేశ ప్రజలకు ఎంతో అవమానకరం’ అని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెహ్రూ గురించి మాట్లాడకుండా బీజేపీ ఉండలేదంటూ ఆమె దుయ్యబట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు