Tuesday, May 13, 2025
Homeఆదాయం భారీగా పెంచుదాం

ఆదాయం భారీగా పెంచుదాం

. హైదరాబాద్‌ లేని లోటు పూడ్చుకోవాలి
. ఈ ఏడాది లక్ష్యం రూ.1,34,208 కోట్లు
. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు
. సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతకు చెక్‌
. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ
. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని, అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీఎత్తున పెరిగేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో శాఖల వారీ పురోగతిపై చర్చించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, గనులు, అటవీ… ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 2025-26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,34,208 కోట్లు ఆర్జించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇది గత ఏడాది కన్నా 29 శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి మే 11 వరకు వాణిజ్య పన్నులు, అటవీ ఆదాయంలో తగ్గుదల కనిపించగా, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి అనూహ్యంగా ఆదాయం పెరిగింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మే 11 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం గత ఏడాది కన్నా 26 శాతం తగ్గింది. 2024-25లో ఇదే కాలానికి కేంద్రం నుంచి రూ.17,170 కోట్లు రాగా… ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,717 కోట్లు మాత్రమే వచ్చిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన ఎక్సైజ్‌ పాలసీతో ఆదాయంలో వృద్ధి నమోదయింది. 2024-25లో రాష్ట్రానికి ఎక్సైజ్‌ ఆదాయం రూ.28,842 కోట్లు వచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 14.84 శాతం ఎక్కువ. అయితే దక్షిణాది రాష్ట్రాలయిన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్‌ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్‌ ద్వారా రూ.33,882 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయన్నారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో దేశంలోనే ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్‌ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మద్యం సరఫరా, అమ్మకాల ట్రాకింగ్‌
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా… సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేయాలని చెప్పారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే… ఆంధ్ర ప్రదేశ్‌లో ఎందుకు ఆదాయం తక్కువగా వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే, సరైన విధానాలను అవలంభించి ఆదాయం పెరిగేలా చూడాలని, నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ప్రయత్నించాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు.
ఎర్రచందనం నిల్వలపై సమగ్ర అధ్యయనం
రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. రాష్ట్రంలో ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి… వాటి విలువ ఎంత అనేదానిపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
హైదరాబాద్‌ లేని లోటు పూడ్చుకోవాలి
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని… మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏడాది కాలంలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులు పెంచుకుని తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందని, అప్పుడే అభివృద్ది, సంక్షేమ పథకాలకు విరివిగా నిధులు ఖర్చు చేయగలమని సీఎం అన్నారు. కేంద్ర సాయం, అప్పులు అనేది ప్రాథమిక దశలో నిలబడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని, మంచి పని తీరు ద్వారా ఆయా శాఖల్లో ఆదాయం పెరిగే ప్రణాళికలు అమలు చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు