అఖిలపక్ష నేతల పిలుపు
. సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలు
. త్వరలో అనంతపురంలో సంఫీుభావ సదస్సు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కల్పతరువుగా ఉండి పేదల అభ్యున్నతికి 56 ఏళ్లుగా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అఖిలపక్ష నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత వై.ప్రభాకర చౌదరి, కాంగ్రెస్ పార్టీ నేత కొరివి వినయ్‌కుమార్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ దాసరిభవన్‌లో జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ‘ఆర్డీటీని కాపాడుకుందాం’ అంశంపై అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. దీనికి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కె.రామకృష్ణ ప్రసంగిస్తూ విన్సెంట్ ఫెర్రర్ 1969లో అనంతపురంలో ఆర్డీటీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారని, గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా లక్షలాది కుటుంబాలకు విద్య, వైద్యం, తాగునీరు, వైజ్ఞానిక అభివృద్ధి లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. బత్తులపల్లి ఆసుపత్రి కరోనా సమయంలో వేలాదిమందిని బతికించిందని, ప్రతిభ గల విద్యార్థులకు ఆర్డీటీ ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. విన్సెంట్ ఫెర్రర్ కుటుంబం స్పెయిన్ నుంచి వచ్చినప్పటికీ… భారతీయ పౌరసత్వం తీసుకొని తన కుమారుడు మంచూ ఫెర్రర్ వెనుకబడిన వర్గాల హిందూ మహిళను వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన సమాజాల అభ్యున్నతి కోసం ఈ ట్రస్ట్ లాభాపేక్ష లేకుండా పనిచేస్తోందని వివరించారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, వ్యవసాయాభివృద్ధి, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో ఆర్డీటీ గణనీయ కృషి చేసిందన్నారు. కేవలం వైద్య సేవలు కోసమే ఏడాదికి రూ.80 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఆర్డీటీ తన కార్యక్రమాల నిర్వహణకుగాను విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధులపై ఆధారపడుతోందని, ఈ నిధులు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్‌సీఆర్‌ఏ)కు లోబడి ఉంటాయని, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న ఈ చట్టాన్ని ఉపయోగించి ఇటీవల ఆర్డీటీకి సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో విదేశీ నిధులు పూర్తిగా ఆగిపోతాయని, ఆర్డీటీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఆర్డీటీకి మతం రంగు ఆపాదించి నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అంశంపై ఇటీవల సీఎం చంద్రబాబును తమ పార్టీ బృందం కలిసి… ఆయన దృష్టికి తీసుకెళ్లగా… సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. ఇటీవల మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ ట్రస్ట్ ప్రతినిధులను కలిపి ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆరా తీసినట్లు తెలిసిందన్నారు. సంస్థను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల, మేధావుల తోడ్పాటుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాలన్నారు. ఒకవైపు విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తూ మరోవైపు విదేశీ విరాళాలతో నడిచే సంస్థలను నిరోధించడం సహేతుకం కాదని, లౌకిక భావాలతో పేదరిక నిర్మూలన కోసం విదేశీ సంస్థల, వ్యక్తుల విరాళాలతో నడిచే సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినవైఖరి అవలంబించడం దురదృష్టకరమన్నారు. ప్రభాకర చౌదరి ప్రసంగిస్తూ ఆర్డీటీకి కుల, మతాలు లేవని, మదర్ థెరెస్సా ఆదర్శంగా అనంతపురం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ 3,877 గ్రామాల్లో పనిచేస్తోందని, తెలంగాణలో నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో సేవా కార్యక్రమాలతో విస్తరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి…ఆర్డీటీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో మైనార్టీల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ పేద, బడుగుజీవుల విద్య, వైద్యంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటున్న ఆర్డీటీని మోదీ ప్రభుత్వం, దాని వెనుకున్న ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలు నిధుల విడుదలకు ఆటంకాలు కలిగించడం హేయమైన చర్య అని తప్పుపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ మోదీ మతతత్వ విధానాలతో ఆర్డీటీని నిర్వీరం చేసే కుట్రలకు తెగబడ్డారని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశం మూడు తీర్మానాలు ఆమోదించింది.
సీఎం చంద్రబాబును ప్రతినిధుల బృందం కలిసి ఆర్డీటీ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేలా కేంద్ర హోంశాఖపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతిపత్రం అందించాలని, త్వరలో అనంతపురం నగరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఆర్డీటీ పరిరక్షణ కోసం సంఫీుభావ సదస్సు నిర్వహించి… ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని, పార్లమెంటు జరిగే సమయంలో అన్ని రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల ప్రతినిధుల బృందం దిల్లీ వెళ్లి మన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రుల సహకారంతో హోంశాఖ అధికారులతో కలిసి వినతిపత్రం అందించాలని, కుల, మత రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీని పటిష్ట పరచడానికి కృషి చేయాలని తీర్మానించారు. సమావేశంలో కొరివి వినయ్‌కుమార్, సాహితీవేత్త గోళ్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ల పూర్వ అధ్యక్షుడు ఏవీ పటేల్, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు నజీర్, రంగం రమేశ్ అభ్యుదయ గేయాలు ఆలపించారు.