. కార్గో హ్యాండ్లింగ్ కోసం లాజిస్టిక్స్ కార్పొరేషన్
. షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
. పెట్టుబడుల కోసం మారిటైం పాలసీలో మార్పులు
. పరిశ్రమలు, మౌలిక వసతులపై సమీక్షలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని ప్రతి నౌకా, విమానాశ్రయాల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్ షిప్పులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణా చేయడానికి లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సోమవారం సమీక్షించారు. ఎయిర్‌పోర్టులు-పోర్టుల అభివృద్ధి, మారిటైం పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల నుంచి పెద్దఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయని, దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ‘ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. తద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలమో…ఏ విధంగా చేయగలమనే అంశాలపై బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకోవాలి. ఇదే సమయంలో సరకు రవాణపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు, రైలు, ఎయిర్ కార్గో, ఇన్ ల్యాండ్, మారిటైమ్ కార్గోలకు ఏపీనే కేంద్రంగా ఉండాలి. తక్కువ వ్యయమయ్యే మార్గం ద్వారా సరకులను రవాణా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏపీనే కేంద్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో అన్ని రకాల సరకు రవాణా మార్గాలు అందుబాటులో ఉంటే…అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులకు అనుసంధానంగా జాతీయ రహదారి, రైలు, అనుసంధానమయ్యేలా చూసుకోవాలి. రోడ్లపై ఎక్కడా పాత్ హోల్స్ లేకుండా ఉండాలి. ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ కనెక్టివిటీ కూడా ఉంటే…రాష్ట్రం నుంచే సరకు రవాణా ఎక్కువగా జరుగుతుంది. కేంద్రం వద్ద నేషనల్ హైవేలకు, రైల్వేలకు నిధుల కొరత లేదు. మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు పంపితే వాటిని ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి’ అని చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశనం చేశారు.
మౌలిక సదుపాయాల చోదక శక్తిగా లాజిస్టిక్స్ కార్పొరేషన్
‘రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను సమర్ధంగా నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పోర్టులు, ఎయిర్‌పోర్టుల సమీపంలో శాటిలైట్ టౌన్ షిప్పుల అభివృద్ధికి అవసరమైన సంస్థలను గుర్తించి పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలి. లాజిస్టిక్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ మాదిరిగా ఉండాలి. ఇదే తరహాలో 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకుంటున్న ఎంఎస్‌ఎంఈ పార్కుల వద్ద కూడా శాటిలైట్ టౌన్ షిప్పులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేయాలి. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి భూసేకరణ పూర్తి చేసి… పనులు మొదలు పెట్టాలి. ఈ ఎయిర్ పోర్టులు జాతీయ రహదారులను కలిపేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలి. అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండిరగ్ ద్వారా దీనిని చేపట్టాలి’ అని చంద్రబాబు ఆదేశించారు.
మారిటైం పాలసీలో మార్పులు
పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మారిటైమ్ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్ బిల్డింగ్ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్ టెర్మినళ్లు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నం, మూలపేట, చినగంజాం వంటి ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్లు ఎన్నిచోట్ల ఏర్పాటు చేయడానికి వీలుంటుందో చూడాలి. పోర్టుల నిర్మాణం, షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం సమయంలో స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చూడాలి. మత్స్యకారులకు సంబంధించిన పనిముట్లు, పరికరాలు పెట్టుకోవడానికి వీలు కల్పించేలా ఉండాలి. కంటైనర్ పోర్టుల ఏర్పాటు, అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల కంటైనర్ పోర్టు తమిళనాడుకు వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితులు రాకూడదు’ అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


