విచారిస్తున్న సీఐడీ అధికారులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో ఏపీ సీఐడీ అధికా రులు ఆయనను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. మాజీ సీఎం జగన్‌కు అత్యంత విధేయుడిగా వ్యవహరించిన పీఎస్సార్… ముంబై నటి కేసులో రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ అయ్యారు. జత్వానీ వ్యవహారంలో వైసీపీ ముఖ్యనేత చెప్పగానే పీఎస్‌ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగి ఆమెపై ఏ కేసు పెట్టాలి… ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానై చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పిలిపించి జత్వానీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వానీ, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లి జత్వానీ, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్‌కు పంపడం తదితర వ్యవహారాలను కాంతిరాణా, విశాల్ గున్నీ పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు తమపట్ల వ్యవహరించిన తీరుపై జత్వానీ ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో తనను, తన కుటుంబసభ్యులను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్‌తో పాటు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపిన కూటమి ప్రభుత్వం పీఎస్‌ఆర్ ఆంజనేయులతోపాటు మిగిలిన పోలీస్ అధికారులనూ సస్పెండ్ చేసింది. తర్వాత మరోసారి ఆ సస్పెన్షన్‌ను కొనసాగించింది. వచ్చే సెప్టెంబరు నెల వరకు ఆయనపై సస్పెన్షన్ వేటు అమల్లో ఉంది. హైదరాబాద్‌లోని ఒక ఫాంహౌస్‌లో ఉన్న పీఎస్సార్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి విజయవాడ సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. బుధవారం కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.