Tuesday, February 25, 2025
Homeఇచ్చిన మాట తప్పం

ఇచ్చిన మాట తప్పం

. సూపర్‌సిక్స్‌ సహా హామీలన్నీ అమలు చేస్తాం
. మేలో ‘తల్లికి వందనం’
. త్వరలో ‘రైతు భరోసా’
. 2027లో పోలవరం పూర్తి
. అందరికీ ఆరోగ్య బీమా
. ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యం
. 8 నెలల్లోనే అద్భుత ప్రగతి
. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా అమలు పర్చి తీరుతామని ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు పునరుద్ఘాటించారు. తల్లికి వందనం సహా…సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టత నిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… తల్లికి వందనం పథకం మే నెలలో అమలు చేస్తామని చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తామన్నట్లు మే నెలలో ఈ పథకం కింద ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. రైతుకు భరోసా కల్పించే విషయంలో తాము చెప్పినట్లుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన రూ. 6000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 14 వేలు కలిపి మొత్తం రూ. 20వేలు అందిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ అమలు చేస్తామన్నారు. దివ్యాంగులకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేలు పింఛను పెంచామన్నారు. సాధారణ పింఛన్‌ను రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచామన్నారు. దేశంలో ఏటా రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని చెప్పారు. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్‌లకు సమయానికి జీతాలు ఇస్తున్నామని… ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటిన్లు తిరిగి ప్రారంభించామన్నారు. పేదలకు దీపం 2 పథకం కింద 93 లక్షల మందికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి డీఎస్సీ పోస్టుల మంజూరు చేశాకే పాఠశాలలు తెరుస్తామని తెలిపారు. మత్స్యకారులకు సైతం చెప్పిన విధంగా రూ.20వేలు ఇస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు. కేంద్రమే సాయం చేసి ఉండకపోతే…మనకు మరిన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. గతంలో కౌరవ సభ… ఇప్పుడు గౌరవ సభ అంటూ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని తెలిపారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలు చీకటి రోజు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా మేం ఇచ్చేది కాదు… ప్రజలు ఇవ్వాలని పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాము (టీడీపీ, జనసేన, బీజేపీ) కలవ లేదని… రాష్ట్ర సంక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా ఏర్పాడ్డామన్నారు. వైసీపీ పాలనలో వృద్ధి రేటు ఎలా తగ్గిందో స్లైడ్స్‌ వేసి మరీ సీఎం చంద్రబాబు వివరించారు. 2024-25లో 12.94 శాతం వృద్ధి వచ్చిందన్నారు. వైసీపీ పాలనలో రూ.9,54,576 కోట్లు అప్పులు పెట్టారని తెలిపారు. వృద్ధిరేటును రెట్టింపు చేయగలిగితే..నాలుగున్నర రెట్ల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌లు పూర్తయ్యాయన్నారు. కరెంటు చార్జీలు పెంచమని చెప్పామని, అదే మాటకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80వేల కోట్లు అవసరం అని, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో మద్య తరగతి వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ రూ.2.50 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందిస్తామని, ఆ తర్వాత అవసరమైన వారికి రూ.25 లక్షల వరకూ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కింద చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పేద వర్గాలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం కేటాయింపు…ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికి రాష్ట్రంలో 1.14 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని, జూన్‌ నాటిటకి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. దేవాలయాల్లో అర్చకులతో పాటు ఇమాం, మౌజర్‌లకు వేతనాలను పెంపు చేయడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు