Tuesday, March 4, 2025
Homeవిశ్లేషణఇప్టాకన్నా ముందే ప్రజానాట్యమండలి

ఇప్టాకన్నా ముందే ప్రజానాట్యమండలి

ఆర్వీ రామారావ్‌
బొంబాయిలో 1943 మే 25న అఖిలభారత ప్రజానాట్య మండలి (ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ – ఇప్టా) ఏర్పడిన రోజుననే అక్కడే ఆంధ్ర ప్రజానాట్య మండలి కమిటీ కూడా ఏర్పడిరది. 1943 మే 23 నుంచి జూన్‌ ఒకటవ తేదీ వరకు బొంబాయిలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రథమ మహాసభలు జరిగాయి. సీపీఐ 1925లో కాన్పూర్‌లో ఏర్పడినా దీర్ఘకాలం నిషేధంలో ఉన్నందువల్ల మహాసభలు నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పటి సీపీఐ అగ్రనాయకులు పి.సి.జోషి ప్రతి రాష్ట్రం నుంచి కళాకారుల బృందాన్ని పంపించాలని కోరారు. కళలు ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ఉపయోగ పడ్తాయి కనక కళాకారులను సమైక్య పరిచి జాతీయోద్యమంలో వారిని భాగస్వాములను చేయాలనేది పి.సి.జోషి అలోచన. ఆ సందర్భంగానే కళాకారుల సమావేశం బొంబాయిలో జరిగింది.
మిక్కిలినేని, కోసూరి పున్నయ్య, సిరివిశెట్టి సుబ్బా రావు, కోడూరి అచ్చయ్య, ఎస్‌.వి.కె. ప్రసాద్‌, కొండెపూడి లక్ష్మి నారాయణ, తమ్మారెడ్డి సత్యనారాయణ, మానికొండ సూర్యావతి, కాట్రగడ్డ హనుమాయమ్మ, చండ్ర సావిత్రి, వెల్లంకి అన్నపూర్ణ, పెరుమాళ్లు, డా. రాజారావు ఆంధ్రా నుంచి ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆంధ్ర నుంచి వెళ్లిన కళాకారుల బృందానికి ముక్కామల నాగభూషణం నాయకత్వం వహించారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని దేశంలో మొట్టమొదటి సారి చాటి చెప్పింది ప్రజానాట్య మండలే. కళ ప్రజల కోసమేనని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. జానపద కళా రూపాలను వెలికి తీసి ఆధునిక ఇతివృత్తాలతో జనరంజకం చేయడానికి ఇప్టా నిర్ణయించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకోసం, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రజల పక్షాన నిలవాలని బొంబాయి సమావేశంలో నిర్ణయించారు.
ఈ లక్ష్య సాధన కోసం ఎన్‌.ఎం.జోషి అధ్యక్షులుగా, అనిల్‌ డి సిల్వా ప్రధాన కార్యదర్శిగా ఒక కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఆంధ్ర ప్రాంతం నుంచి డాక్టర్‌ రాజారావు, హైదరాబాద్‌ సంస్థానం నుంచి మఖ్దూం మొహియుద్దీన్‌ నియమితులయ్యారు. అప్పటికి ఏ.ఐ.టి.యు.సి. అధ్యక్షులుగా ఉన్న ఎస్‌.ఎ.డాంగే, కిసాన్‌ సభ నాయకులు బంకిం ముఖర్జీ, అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సజ్జాద్‌ జహీర్‌, ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. నాయకులు అరుణ్‌ బోస్‌ కూడా ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ప్రజానాట్య మండలి బాధ్యతలు ముక్కామల నాగభూషణం, డా. రాజారావు, కోడూరి అచ్చయ్యకు అప్పగిస్తూ తాత్కాలిక కమిటీ ఏర్పాటు అయింది. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సాగుతోంది. హిట్లర్‌ సైన్యాలు యూరప్‌ను ఆక్రమిస్తున్నాయి. హిట్లర్‌ నాజీయిజాన్ని నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. మన రాష్ట్రంలో 1943 మార్చి నెలలో కృష్ణా జిల్లా కొడాలిలో ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం చేయడానికి యువజన శిక్షణా శిబిరం జరిగింది. అప్పుడు యువకులుగా ఉన్న కోగంటి గోపాల కృష్ణయ్య, తమ్మా రెడ్డి సత్యనారాయణ, కొడాలి ఆదిశేషయ్య, సుంకర సత్యనారాయణ ఆ శిబిరానికి హాజరయ్యారు. యుద్ధ వ్యతిరేక పాటలు, ఇతర కళారూపాలు తయారు చేసి ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ లెక్కన చూస్తే బొంబాయిలో ఇప్టా అవతరించడానికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా నాట్య మండలికి పునాదులు పడ్డాయి. ఈ శిబిరంలో పాల్గొన్నవారే ఆంధ్రలో 1943లో ప్రజానాట్య మండలి అవతరణలో పాత్రధారులయ్యారు.
కృష్ణా జిల్లా తిరువూరులో చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సుంకర సోదరులు సత్యనారాయణ, వీరభద్ర రావుకు కళలు సాహిత్యం మీద అభిరుచి ఉండేది. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో నాజర్‌ నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయనకు సంగీతం మీద ఆసక్తి అపారం. అప్పుడు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులుగా ఉన్న వేములపల్లి శ్రీకృష్ణ నాజర్‌ను ప్రజానాట్యమండలిలో చేర్చారు. ఆ సమయంలో నాజర్‌ ‘‘కష్ట జీవి’’ బుర్ర కథ రాశారు. దీనితోనే ప్రజానాట్య మండలి బుర్రకథ దళాలకు అంకురార్పణ జరిగింది. నాజర్‌ దళమే కాక రాష్ట్రవ్యాప్తంగా అనేక బుర్రకథ దళాలు ఏర్పడ్డాయి. డప్పు దళితులకు సొంతం అయిన వాయిద్య కళారూపం. దీన్ని మొట్టమొదట వెలుగులోకి తెచ్చింది ప్రజానాట్య మండలే. అమృతయ్య, ఏసుదాసులను ఉత్తమ డప్పు కళాకారులుగా దిద్ది తీర్చింది ప్రజానాట్య మండలే.
ఆ సమయంలో పౌరాణిక నాటకాలకు ఆంధ్ర ప్రాంతంలో ఆదరణ ఉండేది. ఆధునిక నాటకం ప్రారంభం అవుతున్న తొలి దశ అది. ప్రజానాట్య మండలి ఆవిర్భావం తరవాత తెలుగు నాటక రంగంలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఆ నాడు ప్రజానాట్య మండలి అధ్వర్యంలో ముంద డుగు, మాభూమి నాటకాలు జనాన్ని ఉర్రూతలూగించాయి. తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగా మాభూమి నాటక ఇతివృత్తం. కష్టజీవి బుర్ర కథ ఇతివృత్తమూ అదే. మాభూమి నాటక ప్రదర్శనలకు ఒక కేంద్ర దళం, కృష్ణా జిల్లా దళం ఉండేవి. రాష్ట్ర దళానికి డా. రాజారావు దర్శకులు. కృష్ణా జిల్లా దళానికి కోడూరి అచ్చయ్య దర్శకులు. డా. రాజారావు, కోడూరి అచ్చయ్య, కోగంటి గోపాల కృష్ణయ్య, మిక్కిలినేని రాధాకృష్ణ, కోసూరి పున్నయ్య, నాజర్‌, పెరుమాళ్లు, అల్లు రామలింగయ్య, చదలవాడ కుటుంబరావు, మాచినేని వెంకటేశ్వర రావు, వల్లం నరసింహా రావు, వెంపటి రాధాకృష్ణ, సాలార్‌, కర్నాటి లక్ష్మీ నరసయ్య, రామకోటి, జమున, వీరమాచినేని సరోజిని, తాపీ రాజమ్మ, అన్నపూర్ణ, కొండేపూడి రాధ, కొండపల్లి కోటేశ్వరమ్మ, టి. చలపతి రావు, సి. మోహన్‌ దాస్‌, వి. మధుసూదన్‌ రావు, ప్రత్యగాత్మ, కె.బి.తిలక్‌, డప్పు కళాకారులు అమృతయ్య, ఏసుదాసు, రూపశిల్పి కుమార్‌ ఆ రోజుల్లో ఈ రెండు దళాల్లోనూ పని చేశారు. మాభూమి నాటకం ప్రదర్శించే దళాలు ఆ నాడు వందకు పైగా ఉండేవి. ఒక్క రాష్ట్ర దళమే వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన జానపద కళా రూపాలు ఒగ్గు కథ, గొల్ల సుద్దులను కూడా ప్రజానాట్యం మండలి ఆధునీకరించి విస్తృతంగా ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం సాయుధ మిలటరీ దళాలను పంపి మాభూమి నాటకాన్ని, కష్టజీవి బుర్రకథను నిషేధించింది. ప్రజానాట్యమండలి మీద కూడా నిషేధం విధించింది. 1948లో నిషేధం తరవాత అనేకమంది కళాకారులు మద్రాసు వెళ్లారు. డా. రాజారావు రాజమండ్రిలో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి వైద్యం చేశారు. సమాంతరంగా ‘‘రాఘవా కళా నిలయం’’ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. 1955 తరవాత ప్రజానాట్యమండలిలో కూడా స్తబ్దత ఆవరించింది. ఆ తరవాత 1973లో హైదరాబాద్‌లో ప్రజానాట్యమండలి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1974 నాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సాధ్యమైంది. ఈ పునరుద్ధరణలో నల్లూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ల ప్రతాప రెడ్డి కృషి అపారమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు