సంయమం పాటించండి
వాషింగ్టన్/మాస్కో: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొనడంపై ప్రపంచ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను శాంతియుతంగా, సామ రస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకో వాలని, ఇందుకోసం రాజకీయ, దౌత్య, ద్వైపాక్షిక మార్గాలను అనుసరించాలని భారత్, పాకిస్థాన్‌కు హితవు పలికారు. ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు విఘాతం కలగనివ్వవద్దని సూచించారు. దౌత్యానికి తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమని కొందరు నేతలు వెల్లడిరచారు. జమ్మూకశ్మీర్, పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ మంగళబుధవారం మధ్యరాత్రి పేరిట మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. దీంతో ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. శాంతికి పిలుపునిచ్చారు. సంయమం పాటించాలని సూచనలు చేశారు. ఈ శుత్రుత్వం త్వరగా ముగుస్తుందని అమెరికా, రష్యా, చైనా, జపాన్, అరబ్‌తో పాటు అనేక దేశాలు ఆకాంక్షించాయి. శాంతి మార్గంలో సమస్యలు పరిష్కారం కాగలవని, యుద్ధం వద్దని, సంయమం పాటించాలని ఐక్య రాజ్య సమితి కూడా పిలుపునిచ్చింది. పహల్గాంలో ఉగ్రదాడి కి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ పరిణామాన్ని పాకిస్థాన్ యుద్ధ చర్యగా అభివర్ణించింది. శాంతించాలి... భారత్, పాకిస్థాన్‌కు ప్రత్యేకంగా ఇచ్చే సందేశమేమీ లేదు కానీ ఇదంతా త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓవల్ కార్యాలయంలోకి ప్రవేశించేటప్పుడు విషయం తెలిసిందని చెప్పారు. ఈ పోరు ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోందని అన్నారు. ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా మంత్రి మార్కో రూబియో వెల్లడిరచారు. పాకిస్థాన్ మీద భారత్ ప్రతీకార దాడి... పోరు తీవ్రరూపం దాల్చుతుండటం ఆందోళన కలిగిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖోరోవా అన్నారు. పరిస్థితి చేయిదాటకుండా చూసుకోవాలని హితవు పలికారు. ప్రాదేశిక ఘర్షణను నివారించేందుకు సంయమం పాటించాలని కోరారు. శాంతియుత, రాజకీయ, దౌత్య మార్గాల్లో భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు పరిష్కారం కాగలవని ఆకాంక్షించారు. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ ప్రకారం ద్వైపాక్షిక మాధ్యమంగా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్, పాక్‌కు రష్యా అధికారి సూచించారు. ప్రాదేశిక, అంతర్జాతీయ శాంతికి ముప్పు కలిగించే పరిస్థితి తేవద్దని, పరిస్థితి మరింత జఠిలం కాకుండా, ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చకుండా సంయమం పాటించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఒక ప్రకటనలో కోరారు. చర్చలు, పరస్పర అవగాహనతో సైనిక ఘర్షణల నివారణకు పిలుపునిచ్చారు. దక్షిణాసియా సుస్థిరతకు, ప్రాదేశిక ఉద్రిక్తతల నివారణకు శాంతియుతంగా చర్చించుకోవాలని సూచించారు. శాంతి, సుస్థిరత, సౌభాగ్యతకు కట్టుబడాలన్నారు. శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలని భావిస్తే తమ వంతు సహకారం అందించేందుకు యూఏఈ సిద్ధమన్నారు. భారత్, పాక్ మధ్య పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిమాసా హయాషి తెలిపారు. ఈ పరిస్థితులు యుద్ధానికి దారి తీయొచ్చు... సంయమం పాటించండి అని రెండు దేశాలను కోరారు. దక్షిణాసియా శాంతి, సుస్థిరత కోసం చర్చల ద్వారా పరిస్థితిని నియంత్రించాల న్నారు. ఇదిలావుంటే, ప్రాదేశిక శాంతి, సుస్థిరత పరిరక్షణకు చైనా పిలుపు నిచ్చింది. సంయమం పాటించాలని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ‘భారత్, పాకిస్థాన్ ఇరుగు పొరుగు దేశాలు, చైనాకు కూడా ఇవి పొరుగు దేశాలు. వీటి మధ్య ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరం. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకి స్తుంది. అయితే శాంతి, సుస్థిరత దృష్ట్యా సంయమం పాటించాలని, పరిస్థితిని జఠిలం చేసే చర్యలు నివారించాలని సూచిస్తోంది’ అని ప్రకటనలో చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.


