. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
. 3 నెలల్లోగా టిడ్కో ఇళ్లు అప్పగించాలి
. విశాఖ ఉక్కు కోసం 14న ఆందోళనలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
నగర కార్యదర్శుల జూమ్ సమావేశం సోమవారం జరిగింది. విజయవాడ చంద్రం బిల్డింగ్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవ్వగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షత వహిం చారు. జిల్లాల వారీగా పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సీపీఐ సభ్యత్వం, పేదలకు ఇళ్ల స్థలాలు, భూపోరాటాలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ వరకు సీపీఐ ప్రచార కార్యక్రమం, రైతు సమస్యలపై ఆందోళన, సీపీఐ శత వార్షికోత్స వాల సందర్భంగా జాతీయ సదస్సు అంశాలపై చర్చించారు. అజెండాలో పొందుపరిచిన అంశాలను రామకృష్ణ సభ్యులకు వివరించి… వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.10 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యలపై బాధితుల నుంచి పార్టీలకతీతంగా అర్జీల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, పార్టీ శ్రేణులు పూర్తిగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాల సమస్యలు అధికంగా వెలుగు చూస్తున్నాయని, పార్టీ శ్రేణులు చేపట్టిన అర్జీల సేకరణ ప్రక్రియలో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇళ్ల స్థలాల సమస్య 90 శాతం పట్టణాల్లోనే తీవ్రంగా ఉందన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి లబ్ధిదారులను చైతన్యవంతుల్ని చేయడం, వారితో అర్జీలు రాయించడం వల్ల మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్ధిదారులతో కలిసి పార్టీ నాయకులు కలెక్టరేట్లకు వెళ్లి వినతులిచ్చారని గుర్తుచేశారు. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు ఇంటింటికీ వెళ్లిన ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. అనంతపురం జిల్లా తాడిపర్తి, విశాఖ జిల్లాలో లబ్ధిదారులతో నిరసనలు చేపట్ట డం ఇందుకు ఉదాహరణగా రామకృష్ణ చెప్పారు. ఇళ్ల స్థలాల సమస్యలపై శ్రీసత్యసాయి జిల్లాలో మార్చిలో వేలాది మంది బాధితులు అర్జీలతో ఆందోళనకు సిద్ధమయ్యారని తెలిపారు. ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికిగాను ప్రజలను సమీకరించ డానికి ఇది మంచి అవకాశమని, ఇందుకోసం ఇళ్ల స్థలాల సాధన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ మినహా అన్ని ప్రజాసంఘాలు ఇళ్ల స్థలాల సమస్యలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్మిక వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థిక పోరాటాల రీత్యా మన జెండాలు పట్టుకోవాలని కోరారు. పట్టణాల్లో చాలాచోట్ల అసంఘటిత రంగ కార్మికులున్నారని, వారిలోనూ ఇళ్ల స్థలాలులేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రామకృష్ణ వివరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇళ్ల స్థలాల సమస్యపై పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని, దీని ద్వారా వేలాది మంది బాధితులు తరలివస్తారన్నారు. ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఇళ్ల స్థలాలకు కేటాయించిన నిధులపై స్పష్టత వచ్చాక… ఉద్యమ కార్యాచరణ రూపొందిద్దామని రామకృష్ణ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరిం చబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడం లేదని రామకృష్ణ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఆర్భా టంగా కూటమి నేతలు చెప్పుకుం టున్నారని మండిపడ్డారు. మార్చి 14న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పార్టీతోపాటు ఇతర వామపక్ష నేతలు నేరుగా పాల్గొంటారని చెప్పారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి కేంద్రీకరించాలని రామకృష్ణ సూచించారు.