. ఆశావాహుల్లో ఉత్కంఠ
. భర్తీ కానున్న ఆలయ, మార్కెట్ కమిటీ పోస్టులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మరో 48 గంటల్లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం ఉండడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి ఆఖరుకు నామినేటెడ్ నియామకాలు పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఉగాది రోజు ప్రకటిస్తామని మూహుర్తం కూడా వెల్లడిర చారు. దీంతో తెలుగు సంవత్సరాది సందర్భంగా తమకు మంచిరోజులు రాబోతున్నాయని ఆశావాహులు వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఆరోజు ప్రకటించే జాబితాలో మార్కెట్ యార్డుల పాలకవర్గాలు, వివిధ ఆలయాలకు కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు మరికొంతమందికి కీలక పోస్టులు కూడా ప్రకటించే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీలతో పొత్తుల కారణంగా కొందరు టీడీపీ సీనియర్లు పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశారు. వారిలో కొందరికి ఎమ్మెల్సీ సీట్లు, మరి కొందరికి నామినేటెడ్ పదవులిస్తామని హామీ ఇచ్చారు. అలాంటివారిలో ఇప్పటికే కొందరికి అవకాశాలు దక్కినప్పటికీ, ఇంకా చాలా మంది మిగిలి ఉన్నారు. ఇలాంటివారిలో మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, నాడు 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. రెండో విడత నవంబరులో 59 మందితో జాబితా విడుదలైంది. ఇక మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై గత నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు, కూటమి పార్టీల డిమాండ్లతో ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు ఈ కూర్పు కొలిక్కి వచ్చింది. మూడో విడత జాబితా కూడా దాదాపు సిద్ధమైంది. మూడు పార్టీల నేతలకు ఇందులో అవకాశం దక్కనుంది. ఈ మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితాను ఉగాది నాడు విడుదల చేసేందుకు కసరత్తు తుది దశకు చేరింది. వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు మరికొన్ని కీలక కార్పొరేషన్లు, వివిధ ఆలయాలకు పాలకవర్గాల నియామకాలు ఈ జాబితాలో ఉంటాయని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నామినేటెడ్ పోస్టుల కోసం దాదాపు 60వేల దరఖాస్తులు వచ్చినట్లు స్వయంగా సీఎం వెల్లడిరచారు. జనసేన, బీజేపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారిపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆ రెండు పార్టీలకు సంబంధించి ఏ పదవులు, ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై కూడా కసరత్తు పూర్తి కావడంతో ఆశావాహుల్లో అదృష్టవంతులెవరో వేచిచూడాల్సిందే.