Thursday, April 10, 2025
Homeఉత్తరాంధ్రలో అంతర్జాతీయ యూనివర్సిటీ

ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ యూనివర్సిటీ

మంత్రి లోకేశ్‌ సమక్షంలో జార్జియా విశ్వవిద్యాలయం ఒప్పందం
రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న జీఎన్‌యూ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ యూనివర్సిటీ రానుంది. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక జార్జియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ (జీఎన్‌యూ) ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో జార్జియా నేషనల్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్‌యూ, ఏపీి ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ స్థాపించడానికి ఆ సంస్థ సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్‌మెంట్‌లలో జీఎన్‌యూ బలాలను ఉపయోగించుకోవడం ఈ సహకారం లక్ష్యం. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ జార్జియా నేషనల్‌ యూనివర్సిటీతో జరిగిన ఈ ఒప్పందంతో మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న తమ ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఉన్నతవిద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్‌ ఎక్స్‌ పోజర్‌, పాఠ్యాంశాలను మెరుగుపర్చడం, అధునాతన విద్య, సాంకేతికలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కార్యక్రమాలలో ముఖ్యంగా సాంకేతికత, వాణిజ్య, ఆరోగ్య సంరక్షణలలో జీఎన్‌యూ నైపుణ్యాలను అందిస్తుంది. అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నాలెడ్జి షేరింగ్‌ను సులభతరం చేయడం, ఆంధ్ర ప్రదేశ్‌ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. అంతర్జాతీయంగా ప్రస్తుత ధోరణికి అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంతో పాటు ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక పురోగతికి దోహదం పడుతుందని మంత్రి లోకేశ్‌ వివరించారు.
ఈ కార్యక్రమంలో జీఎన్‌యూ వ్యవస్థాపకుడు, రెక్టార్‌ డాక్టర్‌ గియా కావ్టెలిష్విలి, విద్యా వ్యవహారాల వైస్‌ రెక్టార్‌ ప్రొఫెసర్‌ జార్జ్‌ గవ్తాడ్జే, అడ్మినిస్ట్రేటివ్‌ ఎఫైర్స్‌ వైస్‌ రెక్టార్‌ డాక్టర్‌ గొడెర్జి బుచాష్విలి, ఫైనాన్స్‌ అండ్‌ రిసోర్సెస్‌ వైస్‌ రెక్టార్‌ లెవాన్‌ కలందరిష్విలి, ఇండియా ఆపరేషన్స్‌ అండ్‌ అడ్మిషన్స్‌ డైరక్టర్‌ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి, ఆత్మీయ ఎడ్యుకేషన్‌ ఫౌండర్‌, చైర్మన్‌ హష్మిక్‌ వాఘేలా, సిఇఓ చిరాగ్‌ వాఘేలా, ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈవో సాయికాంత్‌ వర్మ, ఆంధ్ర ప్రదేశ్‌ కళాశాల విద్య కమిషనర్‌ భరత్‌ గుప్త, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు