- 30 నిమిషాల్లో 9 మీటర్లు ఉప్పొంగిన నదులు
- 359కి చేరిన మృతులు… 900 మంది గల్లంతు
ఖాటˆండు: ఎన్నడూ చూడని విపత్తుకు హిమాలయ దేశం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఆకస్మిక జలప్రళయం నేపాల్‌లో తీరని విషాదాన్ని నింపింది. క్షణాల్లో దేశాన్ని జల సమాధి చేసింది. సునామీని తలపించిన ఈ విపత్తు భారీగా ప్రాణ`ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. 359 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 900 మంది జాడ లేరని అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు, 127 మంది నేపాలీలు, 65 మంది అమెరికన్లు, 33 మంది బ్రిటన్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారని, వందల ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని తెలిపారు. మట్టిలో కూరుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవానికి త్రిశూలి నది కేవలం 30 నిమిషాల్లో ఉగ్రరూపం దాల్చి… తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉప్పొంగిందని, మలేఖు వద్ద ఏడు మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించడంతో తీర ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జలసమాధి అయ్యాయి. భోటే కోషి ఉపనది లెండేకోలాలోకి భారీగా మంచు, కొండ చరియలు దూసుకువచ్చాయి. ఈ తాకిడి తీవ్రతతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. బండరాళ్లు దొర్లిపడ్డాయి. కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి నీటి ప్రవాహం ఉధృతంగా సాగింది. ఇది భారీ విధ్వంసానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో రెండోసారి వరదలు రావచ్చనే భయం నేపాల్‌ను వణికిస్తోంది. ఈ ముప్పుపై ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ వరద దిగువకు ప్రవహించి ఉంటే భారతపైనా తీవ్ర ప్రభావం ఉండేదని నిపుణులు హెచ్చరించారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
జాడలేని వందల పర్యాటకులు
300 మందికిపైగా చనిపోయారని, 900 మంది గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ గురువారం వెల్లడించారు. 85 మంది భద్రతా సిబ్బంది జాడ లేరని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 100 మంది చైనా దేశస్తులు ఆచూకీ లేరని తెలిపింది. 162 మంది వివిధ హైడ్రోపవర్ కేంద్రాల్లో పని చేస్తోన్న ఉద్యోగులు, 579 పర్యాటకుల జాడ తెలియలేదని వెల్లడించింది. టిబెట్ వైపు 588 మంది గల్లంతయ్యారని, వారిలో 260 మంది విదేశీయులేనని తెలిపింది. హిమాలయాల్లో కరిగిన మంచు జలవనరుల్లో నీటి మట్టాలను పెంచుతుందని, నిన్న మనందరం చూసింది అదేనని నేపాల్ మంత్రి అన్నారు. ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతయ్యారు. మానసరోవర్ యాత్రకు వెళ్లి వస్తుండగా ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా వారంతా వరద ముప్పుకు గురయ్యారు. వీరిలో 53 మంది భారత సంతతికి చెందినవారు ఉన్నట్లు ఈశా ఫౌండేషన్ ప్రతినిధి వెల్లడించారు. ఇదిలావుంటే తమ దేశానికి చెందిన 100 మంది గల్లంతైనట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. నేపాల్‌తో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. సంయుక్త సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నేపాల్ అవసరాలకు తగినట్లు అత్యవసర సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో కొండచరియలు విరిగిపడడం వల్ల వచ్చిన వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 558గా ఉన్నట్లు చైనా టీవీ పేర్కొన్నది. 260 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది.
భారత్‌కు ప్రధాని షా కృతజ్ఞతలు
అల్లకల్లోమైన నేపాల్‌కు భారత్ అండగా నిలిచింది. రెండు విమానాల్లో 47.5 టన్నుల సహాయక సామగ్రి పంపింది. సహాయక బృందాలను కూడా తరలించింది. ఆపన్న హస్తం అందించిన భారత్‌కు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు తెలిపారు. ఘోర విపత్తు సంభవించిందని, ప్రజల రక్షణ, సహాయక చర్యలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధైర్యపడవద్దని, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందరినీ ఆదుకుంటామంటూ ముంపు బాధితులకు నేపాల్ ప్రధాని భరోసానిచ్చారు. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు పూర్తిస్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా నిర్విరామంగా ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు. రాసువా జిల్లాలోని తిమురే ప్రాంతం నుంచి 21 మంది భారతీయులు సహా 116 మందిని తమ సైన్యం రక్షించిందని బాలేంద్ర షా తెలిపారు. ఆహారం, పునరావాసం, వైద్య సహాయం అందించేందుకు పూర్తిస్థాయిలో తమ వనరులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. భారత్ సహా తమకు అండగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారని, 10 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని పంపారని బాలేంద్ర షా చెప్పారు.


