అన్నదాత విలవిల
ఎల్‌నినోతో ఎడారిని తలపిస్తున్న పంట పొలాలు
ప్రత్యేక కరవు సహాయ ప్యాకేజీకి వినతి
విశాలాంధ్ర – సచివాలయం: పసిడి వర్ణంలో మెరిసిపోవాల్సిన పొలాలు నెర్రలు చాచి ఎడారిని తలపిస్తున్నాయి. కరువు రాకాసి కోరల్లో చిక్కుకుని అన్నదాత విలవిల్లాడుతున్నాడు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కొండంత అండగా నిలవాల్సిన ‘పంటల బీమా’ యంత్రాంగం నిర్లక్షాయూనికి సాక్ష్మీభూతంగా మారింది. ప్రభుత్వం బీమా నమోదు గడువును దాదాపు నెలన్నర రోజులు పొడిగించినా క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పేదీ కనిపించడం లేదు. ఈ నెలాఖరుతో తుది గడువు ముగియనుండటంతో ఇంకేమి చేయాలో పాలుపోక లక్షలాది మంది రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాలకుల ఉదాసీనత, క్షేత్రస్థాయి అధికారుల ప్రచార లోపం వల్ల బీమాకు రైతాంగం దూరమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఉచిత పంటల బీమా అమలులో ఉన్నప్పుడు పోటీపడి పేర్లు నమోదు చేసుకున్న రైతులు, ఇప్పుడు ప్రీమియం చెల్లించాలనే సరికి తీవ్ర విముఖత చూపుతున్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో ఉపాధి-అంచనాల నిబంధనల పేరుతో తిరకాసులు పెడుతుండటంతో రైతుల్లో అపనమ్మకం పెరిగిపోయింది. “ప్రీమియం కట్టినా చేతికి రూపాయి పరిహారం వస్తుందన్న నమ్మకం లేదు” అని రైతాంగం వాపోతోంది. గణాంకాలను పరిశీలిస్తే… ఫసల్ బీమా యోజన కింద 2024 ఖరీఫ్‌లో ఉచితంగా ఉన్నప్పుడు 24.05 లక్షల మంది రైతులు 51.55 లక్షల ఎకరాలను నమోదు చేసుకున్నారు. 2025లో ప్రీమియం నిబంధన అమలులోకి రావడంతో నమోదు సంఖ్య ఏకంగా 4.52 లక్షల మందికి పడిపోయింది. ప్రస్తుతం ఎల్‌నినో భయాలు పొంచి ఉన్నందున 2026 ఖరీఫ్‌లో గడువు పొడిగించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 10.57 లక్షల మంది రైతులు 25.65 లక్షల ఎకరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2024లో 8 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా, 2025లో అది 3.04 లక్షలకు పడిపోయింది. ప్రస్తుతం గడువు ముగిసే సమయానికి కేవలం 4.91 లక్షల మంది (14.97 లక్షల ఎకరాలు) మాత్రమే ముందుకొచ్చారు. వర్షాభావ పరిస్థితులు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. జాతీయ స్థాయిలో వర్షపాతం లోటు కేవలం 13 శాతంగా ఉంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఏకంగా 52.7 శాతం తీవ్ర వర్షపాతం లోటు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు కేవలం 18.90 లక్షల హెక్టార్లలోనే విత్తనాలు పడ్డాయి. వర్షాలు పడకపోవడం, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో పంటల సాగు ఘోరంగా పడిపోయింది. ముఖ్యంగా వేరుశనగ పంటపై కరువు దెబ్బ తీవ్రంగా పడింది. సాధారణ విస్తీర్ణంలో కేవలం 34 శాతం భూముల్లోనే వేరుశనగ సాగైంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, పల్నాడు వంటి జిల్లాల్లో వేరుశనగ, పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారు. జాతీయ స్థాయిలో వరి సాగు 98.32 శాతానికి చేరితే, మన రాష్ట్రంలో మాత్రం 62 శాతానికే పరిమితమైంది. ఒకవైపు కరువు మంటలు మండిస్తుంటే, మరోవైపు రాష్ట్రంలోని లక్షలాది మంది కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భూ యజమానుల ఒప్పంద పత్రాలు, అర్హత కార్డుల పేరుతో నిబంధనల ఉచ్చు బిగించడంతో మెజారిటీ కౌలు రైతులు బీమా కవరేజీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. విత్తనాలు వేసి పంటలు ఎండిపోతుండటంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వీడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. నమోదుకు మిగిలి ఉన్న కొద్ది రోజుల్లో గ్రామస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా ప్రత్యేక ప్రచార డ్రైవ్‌లు నిర్వహించి ప్రతి రైతుకూ బీమా రక్షణ కల్పించాలని, ఉచిత బీమా పునరుద్ధరించాలని, రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే ‘ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ’ ప్రకటించి అందించాలని రైతులు కోరుతున్నారు.


