మోదీ నాయకత్వంలోని బీజేపీ కేవలం శుష్క వాగ్దానాలకు మాత్రమే ప్రసిద్ధమైంది కాదు. ఎన్నికలలో విజయం సాధించడానికి ఎన్ని మాయోపాయాలైనా పన్నగలదని నిరూపించింది. తమకు కావలసిన వాళ్లని ఎన్నికల కమిషన్ ప్రధానాధికారులుగా నియమించడంలో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం ఎన్నికల కమిషన్‌ను తమ చేతిలోని పావుగా మార్చడానికి మాత్రమే కాదు. అసలు ఓటర్ల జాబితా తయారీ నుంచే బీజేపీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సకల కట్టుదిట్టాలు చేస్తోంది. ఓటర్ గుర్తింపు కార్డులవల్ల ఒకరికి బదులు మరొకరు ఓటు వేసే అవకాశం తగ్గి ఉండొచ్చు. శేషన్ లాంటి ఎన్నికల ప్రధానాధికారులు ఎన్నికలను సవ్యంగా నిర్వహించడానికి అనేక చర్యలు తీసుకుని ఉండొచ్చు. కానీ శేషన్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిగా ఉన్నప్పుడే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శేషన్‌కు తోడు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. ఇలాంటి ఎత్తుగడలన్నీ బీజేపీ పన్నాగాల ముందు కురుచనైపోయాయి. ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటి ఎత్తుగడలు ఒక్క బీజేపీకే పరిమితం కాలేదు. కానీ కేంద్రంలో అధికా రంలో ఉన్న పార్టీ తమ గెలుపు కోసం ఎన్ని కుట్రలు పన్నడానికి అవకాశం ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పోలింగ్ కేంద్ర స్థాయిలో తమ కార్యకర్తలను ఇన్‌చార్జీలుగా నియమించే అవకాశం మరే పార్టీకీ లేదు. ఓటర్ల జాబితాలో పేజీల వారీగా ‘‘పన్నా ప్రముఖ్’’ లను నియమించడం బీజేపీకి మాత్రమే సాధ్యమయ్యే అంశమూ కావచ్చు. అంతిమ ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోవ డానికి మోదీ ఏలుబడిలో బీజేపీ ప్రభుత్వాధికారాన్ని వినియోగించే తీరు చూస్తే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడిరది. ఇటీవల దిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతల ఇళ్ల చిరునామాలలో పదుల మంది పేర్లు ఓటర్లుగా నమోదు అయ్యాయి. ఇందులో బీజేపీ మంత్రులూ, ఎంపీలు కూడా ఉన్నారు. ఒక్కో ఇంట్లో ఇంతమంది ఓటర్లుగా నమోదు కావడం ఏమిటి అన్న ప్రశ్న ఎన్నికల కమిషన్‌కు రానేలేదు. ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు మీద ఒక విశిష్టమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఆధార్ కార్డులు దేశంలో ఉన్న వారెవరైనా తీసుకోవచ్చు. కానీ ఏ ఇద్దరి ఆధార్ కార్డుల నెంబర్లూ ఒకటే ఉండవు. ఇలా ఉన్నట్టు ఫిర్యాదులు ఎన్నడూ రాలేదు. కానీ మోదీ హయాంలో, మొన్నటి దాకా రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రధానాధి కారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిగా ఉన్నప్పుడు ఓటర్ల గుర్తింపు కార్డుల మీద ఒకే సంఖ్య ఒకరికన్నా ఎక్కువ మందికి ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టింది. ఓటర్ల జాబితాను బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చేట్టుగా తయారు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి కనక ఇప్పటి నుంచే బీజేపీ కేంద్రంలో తమ చేతిలో ఉన్న అధికారాన్ని, చెప్పిన మాట సుగ్రీవాజ్ఞలా భావించే ఎన్నికల కమిషన్ అధికార్లతో కుమ్మక్కై తమ విజయాన్ని సునిశ్చితం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర, దిల్లీ శాసన సభ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు గోల చేసినా మోదీ పెదవి విప్పలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ జవాబు చెప్పనూ లేదు. ఇప్పుడు అందుతున్న ఫిర్యాదులనుబట్టి చూస్తే ప్రతిపక్షాల ఫిర్యాదులు నిజమేననిపిస్తోంది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదన ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఆ రాష్ట్రానికి చెందని 20-30 వేల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. ఒక రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు ఓటర్లుగా ఉండకూడదని కాదు. కానీ పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనుపున ఇలా అక్రమంగా ఓటర్లను నమోదు చేయించ డం ఎన్నికల కమిషన్ పూర్తి పక్షపాత ధోరణికి నిదర్శనం. ఒకే సంఖ్య ఉన్న ఓటరు గుర్తింపు కార్డులున్న ఉదంతాలను మమతా బెనర్జీ ఎత్తి చూపారు. ఎన్నికల కమిషన్ తాను చేసిన తప్పులను 24 గంటల్లోగా అంగీకరించి సరిదిద్దక పోతే ఎన్నికల కమిషన్ పాల్పడుతున్న అక్రమాలు మరిన్ని బయట పెడ్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. నాల్గో తేదీ సాయంత్రానికి ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందనా వచ్చిన దాఖలాలు లేవు. వంద రోజుల్లోగా ఓటర్ల జాబితాలో చేసిన అక్రమాలను తొలగించాలని మమతా బెనర్జీ పట్టుబడ్తున్నారు. భిన్నమైన రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఓటరు గుర్తింపు కార్డుల మీద ఒకే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉందని రెండో తేదీన ఎన్నికల కమిషన్ ఒప్పుకోవడం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. ఓటర్ల జాబితాలో దొంగ చాటుగా చేర్చి బీజేపీ మహారాష్ట్ర, దిల్లీ ఎన్నికలలో విజయం సాధించిందన్న ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. హర్యానాకు చెందిన అనేకమంది పేర్లు బెంగాల్ ఓటర్ల జాబితాలో దూర్చేశారు. జరిగిన తప్పుల్ని దిద్దక పోతే ఉద్యమిస్తామని మమతా బెనర్జీ హెచ్చరించడాన్ని కేవలం హుంకరింపులా కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇలాంటి అక్రమాలను నిరోధించడానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సోమవారం కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే ఆరోపణ చేసింది. ఓటరు గుర్తిపు కార్డులలో ఒకటి కన్నా ఎక్కువ సందర్భాలలో ఒకే గుర్తింపు సంఖ్య ఉండడాన్ని ఎత్తి చూపింది. మహా రాష్ట్రలో మొత్తం వయోజనులకన్నా నమోదైన ఓటర్ల సంఖ్యే ఎక్కువ అని రాహుల్ గాంధీ ఫిబ్రవరి ఏడున ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తరవాత 2024 నవంబర్‌లో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన సమయానికి నమోదైనంత మంది ఓటర్లు గత అయిదేళ్లలో కూడా నమోదు కాలేదు. అంటే ఎన్నికలకు ముందు తమ విజయాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ ఎంతటి కుట్ర పన్నిందో అర్థం చేసుకోవచ్చు. 2019లో శాసనసభ ఎన్నికల నుంచి 2024 లోక్‌సభ ఎన్నికలకు మధ్య కాలంలో మహారాష్ట్రలో 32 లక్షల మంది ఓటర్లు అమాంతం పెరిగిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు 2024లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మధ్య మరో 39 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దూరిపోయాయి. ఎన్నికల సమయం ముగిసిన తరవాత కూడా ఎన్నికల సంఘం పోలైన ఓట్ల శాతాన్ని మాత్రమే ప్రకటిస్తోంది. తుది వివరాలకు, తాత్కాలిక అంచనాలకు మధ్య విపరీతమైన తేడా ఉంటోంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. దిల్లీలో కొందరి పేర్లు తొలగించి కొందరి పేర్లు చేర్చిన తరవాత 895881 మంది పేర్లు నమోదై పోయాయి. అంటే ఇతర రాష్ట్రాల వారి పేర్లు అక్రమంగా చేరుస్తున్నారు.