. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. కమ్యూనిస్టు దిగ్గజం లెనిన్‌కు నేతల ఘన నివాళి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎర్ర జెండాయే ప్రత్యామ్నాయమని, ఎర్ర జెండాతోనే దేశానికి భవిష్యత్తు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రప్రథమ సోషలిస్టు రాజ్య స్థాపకులు వీఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ విగ్రహాల కమిటీ అధ్వర్యంలో మంగళవారం విజయవాడ లెనిన్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు నివాళులు అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లో ఉంచుకునేందుకు అమెరికన్ సామ్రాజ్యవాదం ముసుగులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎర్ర జెండా మాత్రమే ప్రత్యామ్నాయమని వక్తలు అభిప్రాయ పడ్డారు. ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ సోవియట్ యూనియన్‌లో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం చేసి, విజయం సాధించి సుదీర్ఘకాలం ఎర్ర జెండా పరిపాలన కొనసాగిందన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో లేక పోవచ్చుగానీ, భవిష్యత్ మాత్రం ఎర్ర జెండాదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న చైనా… అమెరికాను ట్రంప్‌ను ఏ మాత్రం లెక్క చేయడం లేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ, ప్రతి ఏడాదికి ఒక ప్రత్యేకత ఉన్నట్టే ఈ సారి ట్రంప్ సాగిస్తున్న ఆర్థిక అరాచకాలతో దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలు, ఎండుమిర్చి వంటి అనేక ఉత్పత్తులకు సరైన ధర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారని వివరించారు. దేశంలో గడచిన 11ఏళ్లలో కార్పొరేట్లకు తప్ప సాధారణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.ప్రసాద్ మాట్లాడుతూ మార్క్స్ సిద్ధాంతాలు లెనిన్ పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.కార్ల్ మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ విగ్రహాల కమిటీ బుడ్డిగ జమిందార్ మాట్లాడుతూ, వీఐ లెనిన్ మరణించి వందేళ్లు అయినప్పటికీ, ఆయన భౌతిక దేహాన్ని మాస్కోలో భద్రపరిచారని, రాబోయే సెప్టెంబర్‌లో లెనిన్ తల్లిదండ్రులు సమాధుల వద్దనే ఖననం చేయనున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ నిరసించాలని కోరారు. సీనియర్ వామపక్ష నాయకులు చుక్కపల్లి తిరుమలరావు…లెనిన్‌పై ఇచ్చిన సందేశం ఆకట్టుకుంది. తొలుత లెనిన్ విగ్రహం వద్ద పూలరింగు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, విజయవాడ నగర కార్యదర్శి జీ కోటేశ్వరరావు, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పంచదార్ల దుర్గాంబ, జమలయ్య, సూర్యారావు, లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, ఎం.సాయికుమార్, ఆర్.పిచ్చయ్య, నజీర్, అనిల్, చంద్రనాయక్, భారతి, కొట్టు రమణారావు, పైడియ్య, పాపులర్ సంస్థ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్, విశ్రాంత ఆచార్యులు సి.నరసింహారావు, వివిధ సంఘాల ప్రతినిధులు దివికుమార్, లక్ష్మయ్య, వై.చెంచయ్య, సుబ్బరావమ్మ, అక్కినేని చంద్రరావు, అరసం అరుణ కుమార్, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.