విశాలాంధ్ర`తిరుపతి: ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికవర్గం మంగళవారం బైక్ ర్యాలీలు నిర్వహిం చింది. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ర్యాలీలు జరిగాయి. తిరుపతి, వినుకొండ, ఇతర ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీలు కొనసాగాయి. కార్మికులు ఉత్సాహంగా బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ రాష్ట ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి మంగళవారం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీ తిరుపతి పట్టణమంతా కొనసాగింది. ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని, కార్మిక హక్కుల కోసం పోరాడతామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగ సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి… నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల కార్మికులు పెద్దఎత్తున నష్టపోతున్నారని, కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన సార్వత్రిక సమ్మెలో కోట్లాదిమంది కార్మికులు పాల్గొన్నారని, అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. కార్మిక కోడ్ల కారణంగా కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కోల్పోతారన్నారు. అందుకే కార్మిక వర్గం కదలాలని, పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట 18వ మహాసభలు ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్నాయని, మహాసభలలో గడచిన మూడేళ్లలో కార్మికవర్గం సాగించిన పోరాటాలు సమీక్షించుకొని… రాబోయే కాలంలో నిర్వహించాల్సిన పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారని వివరించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు రూపకల్పన చేస్తుందని, అందుకు కార్మికవర్గం పెద్దఎత్తున కదలిరావాలని, మహాసభలు జయప్రదం చేయడానికి కృషి చేయాలని కోరారు. మహాసభల జయప్రదం కోసం రాష్టవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించి… ప్రచార కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.శివ, ఎన్‌డీ రవి, సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, నాయకులు శ్రీరాములు, ఉదయ్ కుమార్, బండి చలపతి, పద్మనాభరెడ్డి, సెంథిల్, పురుషోత్తం, చంద్ర శ్రీనివాసులు, మహేంద్ర, వెంకటేష్, రవి, సురేష్, రామచంద్రయ్య, రాము, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు
- Advertisement -
RELATED ARTICLES


