. నేడు మహా ప్రదర్శన, బహిరంగ సభతో ప్రారంభం
. తిరుపతిలో పూర్తయిన ఏర్పాట్లు
. బ్యానర్లు, కటౌట్లతో ఎరుపెక్కిన నగరం
. 24 రాష్ట్రాల నుంచి ప్రతినిధుల రాక
. హాజరవనున్న అగ్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు
విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలకు సర్వం సిద్ధమైంది. తిరుపతి కేంద్రంగా జరగబోయే ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు మహాసభలు జరుగుతాయి. నగరమంతటా ఏఐవైఎఫ్ జెండాలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడల్లను తోరణాలతో అలంకరించారు. నగరమంతటా విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్యుల సమస్యలు, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కటౌట్లు ఏర్పాటు చేశారు. బాలాజీ కాలనీ, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ రోడ్డు, నాలుగు కాళ్లమండపం, తుడా సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, పూర్ణ కుంభం సర్కిల్ తదితర ప్రాంతాల్లో కటౌట్లు నగర వాసులు, పర్యాటకులు, భక్తులను ఆలోచింపజేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో తోరణాలు చూపరులను ఆకట్టుకుంటు న్నాయి. మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి కె.నారాయణ, ఎంపీ సంతోశ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్, మాజీ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర హాజరవుతారు. 24 రాష్ట్రాల నుంచి యువత తరలి రానున్నారు. మహాసభలను మహా ప్రదర్శనతో ప్రారంభిస్తారు. తిరుపతిలోని బాలాజీ కాలనీ, ఎస్వీ హైస్కూల్ మైదానం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ రోడ్, తిలక్ రోడ్డు మీదుగా తుడా సర్కిల్‌లోని ఇందిరా మైదానం వరకు ఈ ప్రదర్శన జరగనుంది. వేలాది మంది యువకులు పాల్గొని తమ సమస్యలపై గళం వినిపించనున్నారు. అనంతరం ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. విద్య, ఉపాధి సమస్యలు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు, నిరుద్యోగ భృతి సాధన తదితర అంశాలపై మహాసభల్లో ప్రతినిధులు చర్చిస్తారు. కాగా, మహాసభల ఏర్పాట్లను నారాయణ, తిరుమలై రామన్, జి.ఈశ్వరయ్య, లెనిన్ బాబు, హరినాథరెడ్డి, రామానాయుడు, పి.మురళి, పెంచులయ్య, రాధాకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. మహాసభల సందర్భంగా ప్రచార రథాన్ని నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తిరుమలై రామన్, జి.ఈశ్వరయ్య, ఎ.రామానాయుడు, రవి, పి.మురళి, పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు 2022లో హైదరాబాద్‌లో జరిగాయి. జాతీయ కార్యవర్గం నిర్ణయం మేరకు 17వ జాతీయ మహాసభలకు తిరుపతి వేదికైంది.