Friday, April 25, 2025
Homeఏకచ్ఛత్రాధిపత్యమేమోదీ లక్ష్యం

ఏకచ్ఛత్రాధిపత్యమేమోదీ లక్ష్యం

. సమాఖ్య వ్యవస్థకు తూట్లు
. రాజ్యాంగం నిర్వీర్యానికి కుట్రలు
. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా

తిరువనంతపురం : మోదీ ప్రభుత్వం సమాఖ్య స్వరూపాన్ని సర్వనాశనం చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని రూపుమాపేందుకు నిరంకుశత్వంగా ముందుకెళుతోందని విమర్శించారు. ప్రజాప్రభుత్వంగా కాకుండా నియంత రాజ్యంగా భారత్‌ను మారుస్తోందని దుయ్యబట్టారు. భారత వైవిధ్యతను దెబ్బతీస్తూ ఒక దేశంఒక భాష/మతం/ఎన్నిక అంటూ ఏకచత్రాధిపత్యం కోసం యత్నిస్తోందన్నారు. స్వాతంత్య్ర సమరంలో కమ్యూనిస్టులు రక్తం చిందిస్తే... ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ వలసవాద రాజ్యాలకు వంత పాడాయని రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ సమైక్యత పరిరక్షణ కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నారని రాజా నొక్కిచెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని, దేశ ఐకమత్యాన్ని పరిరక్షించడం కోసం, వైవిధ్యతను కాపాడటం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన నిలిచి పోరాడుతోందని, ఇదే ధ్యేయంగా ముందుకెళుతున్నామని రాజా చెప్పారు. కేరళలోని తిరువనంతపురంలో సీపీఐ జాతీయ సమితి సమావేశం గురువారం జరిగింది. ఆపై పార్టీ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో పార్టీ కార్యదర్శులు కె.నారాయణ, అనీరాజా, రామకృష్ణ పాండా, అమర్‌జిత్‌ కౌర్‌, గిరీశ్‌ శర్మ, కాంగో, కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్‌ విశ్వం తదితరులు పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. 26 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రంతి వ్యక్తంచేశారు. సీపీఐ కశ్మీరీలకు ఎల్లప్పుడు తోడుగా నిలిచిందని, స్వాతంత్య్ర పోరాటం నాటి నుంచే కశ్మీరీలకు కమ్యూనిస్టుల అండ ఉందన్నారు. జమ్మూకశ్మీర్‌లో కమ్యూనిస్టులు నేటికీ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారన్నారు. అధికరణ 370 రద్దు తర్వాత రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉందని గుర్తుచేశారు. ‘ఉగ్రవాదాన్ని నియంత్రిస్తామని అధికరణ 370ను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఉగ్రదాడి ఎలా జరిగింది? చొరబాట్లు ఎలా జరుగుతున్నాయి? దేశంలోకి చొరబడి… పౌరుల రక్తాన్ని పారిస్తుంటే అమిత్‌షా అధ్వర్యంలో కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? అని రాజా నిలదీశారు. ప్రజలను కాపాడటం కోసం, ప్రజల ఐక్యతను పరిరక్షించడం కోసం, సౌభ్రాతృత్వాన్ని కాపాడటం కోసం కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతోందని ఉద్ఘాటించారు.
‘బీజేపీ అధికారంలోకి వచ్చాక అధికరణ 370ను రద్దు చేసింది. మరి అధికరణ 371 సంతేమిటి? ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని అనుసరించరా… అమిత్‌షాకు రాజ్యాంగాన్ని ఎలా చదవాలో తెలియాలి. అధికరణ 370 రద్దు చేశారు కానీ అక్కడితో ఆగకుండా జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదాను హరించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం అసెంబ్లీ ఉన్నాగానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు కరువుయ్యాయి. సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ న్యాయమైన డిమాండ్లను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోంది’ అని రాజా వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడికి సరిహద్దు భద్రతా వైఫల్యమే కారణమని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో గురువారం రాజకీయ పార్టీలతో కేంద్రం సమావేశమైంది. కానీ జమ్మూకశ్మీర్‌ పార్టీలు పాల్గొనలేదు. నాడు వాజ్‌పేయి సైతం జమ్మూకశ్మీర్‌ ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మనస్సులోని మాట తెలియాలంటే జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం, అక్కడి పార్టీలతో మరింత సమన్వయం చేసుకోవడం కేంద్రానికి అవసరం’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి హితవు పలికారు. దేశానికి తామే ప్రతీక అన్నట్లుగా జాతీయ పతాకాన్ని మోసే హక్కు తమకే ఉన్నట్లుగా ప్రచారం చేసుకోవడానికి బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌కు సిగ్గుండాలని విమర్శించారు. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌కు జాతీయ జెండా మోసే నైతిక హక్కు లేదని రాజా అన్నారు. పహల్గాం ఉగ్ర దాడిపై తగిన రీతిలో స్పందించడం అవసరమని కేంద్ర ప్రభుత్వానికి రాజా హితవు పలికారు. దీనిని రాజకీయం చేయరాదన్నారు. దేశాన్ని విభజించేందుకు, హిందూముస్లిం పేరిట అల్లర్లు రెచ్చగొట్టేందుకు ఉగ్రదాడిని అస్త్రంగా మార్చుకోవద్దని తేల్చిచెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఉద్ఘాటించారు. దేశ ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. సరిహద్దు ఆవలి ఉగ్రవాదంపై పోరాటానికి సంబంధించి స్పష్టమైన వైఖరితో సీపీఐ ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి దారుణంగా ఉందని, చాలాచోట్ల సైనిక ఘర్షణలు జరుగుతున్నాయని, గాజాలో పలస్తీనా ప్రజల మారణహోమం సాగుతోందని, వేలాదిమంది పిల్లలు, మహిళలు చనిపోతున్నారని, ఉక్రెయిన్‌రష్యా మధ్య యుద్ధం సాగుతోందని, సైనిక తిరుగుబాట్లు/ఘర్షణలు తలెత్తితే పరిష్కరించడం కష్టమని రాజా ఆందోళన వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు, రాజకీయ పార్టీలు, భాగస్వాములతో చర్చలు జరపాలని, వారి విశ్వాసాన్ని పొందాలని మోదీ ప్రభుత్వానికి రాజా సూచించారు. మోదీ ప్రభుత్వానికి స్వతంత్ర విదేశాంగ విధానం లేకపోవడం వల్లే ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. అమెరికా సామ్రాజ్యవాద శక్తికి, డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందని విమర్శించారు. భారతదేశ స్వయంప్రతిపత్తి, స్వావలంబన, వైవిధ్యతను వేడుకగా చేసుకోవాలని సూచించారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందుకు భిన్నంగా భారత్‌ వైవిధ్యతను దెబ్బతీస్తూ...భిన్నత్వంలో ఏకత్వానికి భంగం కలిగిస్తున్నాయని రాజా విమర్శించారు.1957లో మొదటిసారి ఒకే పార్టీ పాలనకు స్వస్తి పలికి... ప్రపంచంలోనే మొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎన్నుకొని కేరళ ప్రజలు చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట ప్రభుత్వాల అధికారాలు హరించేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ తిరిగి అధికారంలోకి రావాలని కాంక్షించారు. ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ధనబలంతో బీజేపీ రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చేస్తోందని, ఎన్నికల బాండ్ల ద్వారా దేశాన్ని లూటీ చేసిందని, ధనిక పార్టీ కాగలిగిందని దుయ్యబట్టారు. ఎల్డీఎఫ్‌ను తిరిగి అధికారంలోకి తేవడం ద్వారా ధన రాజకీయాలు కేరళలో చెల్లవని బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌కు స్పష్టమైన సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీపీఐ విధానాలు, ప్రచారాలు, ఉద్యమాలు, పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలను రాజా కోరారు. సీపీఐ ఘన చరిత్ర గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని, 1925లో ఆవిర్భవించిన పార్టీ ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోందని అన్నారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, బీజేపీ, మోదీ సర్కారు విభజన`మతోన్మాద అజెండాతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయన్నారు. బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే దేశానికి విముక్తి లభించగలదని, ఇదే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, తమ పోరాటంలో కలిసి రావాలని పార్టీలకు, ప్రజలకు రాజా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు